సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చర్చలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ముందుండి నడిపించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్‌లో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో పార్టీ అధిష్ఠానం సమావేశమైంది. ఎన్నికల సన్నద్ధత, సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పొత్తు భాగస్వాములపై నేతలు మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం.
డిసెంబర్ మొదటి వారంలో యూపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇందులో ఖర్గే ర్యాలీలతో పాటు పాదయాత్రల్లో కూడా పాల్గొననున్నట్లు ఎంపీ ఇమ్రాన్ మసూద్ తెలిపారు. అంతేకాదు సీట్ల సంఖ్య కంటే కూటమి విజయమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 33 స్థానాలకే పరిమితమైంది. తమకు ఆ ఫలితాలే స్ఫూర్తి అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.
Under the leadership of INC President Sh. Mallikarjun @kharge ji and LOP Sh. @RahulGandhi ji, along with Smt. @priyankagandhi ji, AICC In-Charge Sh. Rajendra Pal Gautam ji and UP PCC President Smt. Aradhana Misra-Mona ji, CLP Leader Sh. Virendra Chaudhary ji and Working President Sh. Imran Masood ji, held an important strategy meeting to discuss our preparations for the upcoming assembly elections. Along with our INDIA bloc partners, we will ensure the BJP’s defeat in UP - just as we did in the 2024 Lok Sabha elections. The people of UP know that the BJP’s double engine has destroyed the state’s social and economic fabric and must be thrown out at the earliest. UP will surely send the BJP packing and play a pivotal role in the country’s political future in the months and years to come.
— K C Venugopal (@kcvenugopalmp) November 16, 2026
ఇక మరోవైపు సీట్ల పంపకాలపై ఇంకా అధికారిక చర్చలు ప్రారంభం కాలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. కూటమి పార్టీలు పరస్పర గౌరవంతో, బలమైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్రశేఖర్ ఆజాద్ కలిసి 'సామాజిక్ పరివర్తన్ మోర్చా' పేరుతో కొత్త కూటమిని ప్రకటించారు. ఈ కూటమి మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు చంద్రశేఖర్ ఆజాద్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించారు.
ఇదీ చదవండి: హోటల్‌లో విధ్వంసం సృష్టించిన అక్కాచెల్లెళ్లు


