యూపీ ఎన్నికలు: కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేశ్ కీలక వ్యాఖ్యలు! | Akhilesh Yadav On Seat Sharing With Congress Latest Updates | Sakshi
Sakshi News home page

యూపీ ఎన్నికలు: కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేశ్ కీలక వ్యాఖ్యలు!

Nov 16 2026 11:37 AM | Updated on Nov 16 2026 11:50 AM

Akhilesh Yadav On Seat Sharing With Congress Latest Updates

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌తో చర్చలు కొనసాగుతాయని, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ పార్టీ అభ్యర్థికే సీటు కేటాయిస్తామని స్పష్టం చేశారు. మైన్‌పురిలో ఆయన మాట్లాడుతూ.. రెండు పార్టీలు అన్ని అంశాలను సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాల్లో 181 సీట్లు కోరినట్లు అఖిలేశ్ వెల్లడించారు. అయితే బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యమని, కూటమి ఐక్యంగానే ఉందని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నవంబర్ 16న కీలక సమావేశం జరగనుంది. రాహుల్ గాంధీ, యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రాజేంద్ర పాల్ గౌతమ్, ఆరాధన మిశ్రా, ఇమ్రాన్ మసూద్ ఇందులో పాల్గొననున్నారు. 2027 ఎన్నికల నియోజకవర్గాల వారీగా సన్నాహాలు, సీట్ల పంపకం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

నవంబర్ 17న ఎస్పీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ 181 స్థానాలు కోరుతున్నట్లు వస్తున్న వార్తలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కుల సమీకరణాలపై ఎస్పీ దృష్టి సారించింది. అఖిలేశ్ యాదవ్ ప్రతిపాదించిన పీడీఏ (వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు) వ్యూహంలో భాగంగా ఆగ్రాలో నవంబర్ 15న దళిత సమ్మేళనం నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రంలో రాజకీయంగా పట్టు కోల్పోయిందని, ఆ పార్టీని రాజకీయాల నుంచి పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని అఖిలేశ్ వ్యాఖ్యానించారు.

అయితే ఎస్పీ నిర్వహించిన దళిత సమ్మేళనంపై సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ విమర్శలు చేశారు. ఎస్పీ పాలనలో ఆ పార్టీ నేతలే దళితులపై దాడులు, భూకబ్జాలు, దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావని గతంలో ఎస్పీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. మొత్తానికి 2027 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు దక్కుతాయన్నది నవంబర్ 17 చర్చలతో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: శబరిమల సేవలు: హెలికాప్టర్ నుంచి అరవణ మెషీన్ల వరకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement