డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారికి అలర్ట్‌ | RBI 6-Hour Rule New Cybersecurity Guidelines Digital Payment | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారికి అలర్ట్‌

Nov 16 2026 11:39 AM | Updated on Nov 16 2026 11:51 AM

RBI 6-Hour Rule New Cybersecurity Guidelines Digital Payment

దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్న వేళ ఆన్‌లైన్‌ మోసాలు, డేటా చోరీ, సైబర్‌ దాడుల నుంచి వినియోగదారుల సొమ్ముకు రక్షణ కల్పించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక అడుగు వేసింది. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను మరింత పటిష్టపరిచే లక్ష్యంతో బ్యాంకింగేతర చెల్లింపు వ్యవస్థల నిర్వహణ సంస్థలకు (నాన్‌ బ్యాంకు పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్స్‌) సమగ్ర సైబర్‌ భద్రత, డిజిటల్‌ పేమెంట్‌ సెక్యూరిటీ నియంత్రణలపై మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం, ఏదైనా సైబర్‌ భద్రతా ఘటన లేదా సాంకేతిక అంతరాయం తలెత్తినట్లు గుర్తించిన ఆరు గంటల్లోగా ఆర్‌బీఐకి నివేదించడం తప్పనిసరి.

సైబర్‌ దాడి జరిగిన తర్వాత నష్టనివారణ చర్యలు చేపట్టే పాత పద్ధతికి స్వస్తి పలికి ముందస్తు గుర్తింపు, తక్షణ స్పందన, నిరంతర పర్యవేక్షణ విధానాలను అమలు చేయడమే ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా యూపీఐ, కార్డులు, డిజిటల్‌ వాలెట్ల లావాదేవీలకు వెన్నెముకగా నిలిచే సంస్థల భద్రతా ప్రమాణాలను ఆర్‌బీఐ మరింత కట్టుదిట్టం చేసింది.

ఈ నిబంధనలు ఎవరెవరికి వర్తిస్తాయి?

  • నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వంటి చెల్లింపు వ్యవస్థల నిర్వాహకులు.

  • కార్డ్‌ నెట్‌వర్క్‌ సంస్థలు.

  • పేమెంట్‌ అగ్రిగేటర్లు.

  • ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ- డిజిటల్‌ వాలెట్లు, గిఫ్ట్‌ కార్డులు) జారీ చేసే సంస్థలు.

  • వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు.

  • ఇతర అధీకృత బ్యాంకింగేతర చెల్లింపు వ్యవస్థల నిర్వహణ సంస్థలు.

  • కేవలం సొంత వ్యవస్థలకే కాకుండా పేమెంట్‌ గేట్‌వేలు, థర్డ్‌ పార్టీ టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్లు, విక్రేతల నుంచి తలెత్తే సైబర్‌ ముప్పులను నియంత్రించే బాధ్యత కూడా సదరు పేమెంట్‌ ఆపరేటర్లదేనని ఆర్‌బీఐ తేల్చిచెప్పింది.

ఆరు గంటల నిబంధన

సైబర్‌ దాడులు, ఐటీ మౌలిక సదుపాయాల్లో అంతరాయాలు, అంతర్గత మోసాలు లేదా సెటిల్‌మెంట్‌ ప్రక్రియలో ఆలస్యం వంటి అసాధారణ ఘటనలు గుర్తించిన ఆరు గంటల్లోగా నిర్దేశిత ఫార్మాట్‌లో ఆర్‌బీఐకి నివేదిక సమర్పించాలి. దీనితో పాటు, సైబర్‌ భద్రతా ఘటనలను ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌)కు తప్పనిసరిగా తెలియజేయాలి. ఘటన అనంతరం కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

12 గంటల కూలింగ్‌ పీరియడ్‌

సైబర్‌ నేరగాళ్లు వినియోగదారుల ఖాతాలను హ్యాక్‌ చేసి, ఫోన్‌ నంబర్లు మార్చి నిమిషాల్లో ఖాతాలు ఖాళీ చేసే మోసాలకు ఆర్‌బీఐ చెక్‌ పెట్టింది. పేమెంట్‌ సాధనానికి అనుసంధానమైన రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ లేదా ఈ-మెయిల్‌ ఐడీని మార్చినప్పుడు ఆ తర్వాత కనీసం 12 గంటలపాటు ఆన్‌లైన్‌ చెల్లింపులను అనుమతించకూడదని ఆదేశించింది. ఈ కూలింగ్‌ పీరియడ్‌ వల్ల మోసపూరిత మార్పులను వినియోగదారులు గుర్తించి అప్రమత్తమయ్యే అవకాశం లభిస్తుంది.

సంస్థలపై పాలనాపరమైన బాధ్యతలు

  • సైబర్‌ రిస్క్‌ పర్యవేక్షణకు సంస్థల డైరెక్టర్ల బోర్డు బాధ్యత వహించాలి. బోర్డు కమిటీ కనీసం త్రైమాసికానికి (మూడు నెలలకు) ఒకసారి సమావేశమై భద్రతా ప్రమాణాలను సమీక్షించాలి.

  • అనుమానాస్పద లావాదేవీలను తక్షణమే పసిగట్టే రియల్‌టైమ్‌ ఫ్రాడ్‌ మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మోసపూరిత లావాదేవీలపై కస్టమర్లు ఫిర్యాదు చేసేందుకు ఏడాదిలో 365 రోజులు, 24 గంటలూ పనిచేసే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి.

  • కస్టమర్ల వ్యక్తిగత, కార్డు వివరాలకు పటిష్టమైన ఎన్‌క్రిప్షన్‌ కల్పించాలి. ఆడిట్‌ లాగ్‌లను కనీసం ఐదేళ్లపాటు భద్రపరచాలి. అర్హత కలిగిన ఆడిటర్లతో వార్షిక సిస్టమ్‌ ఆడిట్‌ నిర్వహించి ఆర్థిక సంవత్సరం ముగిసిన రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలి.

  • అనుమతించిన మినహాయింపులు మినహా ప్రతి డిజిటల్‌ లావాదేవీకి బహుళ అంచెల ధ్రువీకరణ తప్పనిసరి.

అమలు గడువు ఎప్పటి నుంచి?

సంస్థల పరిమాణాన్ని బట్టి ఆర్‌బీఐ వేర్వేరు గడువులను నిర్దేశించింది. పెద్ద, మధ్యస్థ బ్యాంకింగేతర పేమెంట్‌ ఆపరేటర్లకు ఈ మార్గదర్శకాలు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ప్రచురించిన తేదీ నుంచే తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే, చిన్న స్థాయి సంస్థలకు తగిన సమయం ఇస్తూ 2028 ఏప్రిల్‌ 1 నుంచి వీటిని అమలు చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement