ధరల రికవరీ, సీజనల్ డిమాండ్ వంటివి సిమెంట్ కంపెనీల ఆర్జన క్రమంగా మెరుగుపడేందుకు తోడ్పాటునివ్వనున్నాయి. అక్టోబర్ నుంచి దేశీ సిమెంట్ రంగంలో నెలవారీ రికవరీ కనిపిస్తోంది. రుతుపవన అవాంతరాల నుంచి బయటపడటానికితోడు.. నిర్మాణ రంగ కార్యకలాపాలు పుంజుకోవడం ఇందుకు మద్దతిస్తున్నాయి.
మౌలికసదుపాయాల ఎగ్జిక్యూషన్, ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు, వ్యక్తిగత గృహ నిర్మాణాల ప్రభావంతో ఓవైపు పరిశ్రమలో డిమాండ్ సహా, సిమెంట్ విక్రయాలు నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో సిమెంట్ తయారీ దిగ్గజాలు అక్టోబర్ మొదట్లో ఒక్కో సిమెంట్ బస్తాపైన రూ. 10-15 ధరల పెంపుకు తెరతీశాయి.
దేశవ్యాప్తంగా సగటు సిమెంట్ ధర నెలవారీగా చూస్తే రూ. 9(3 శాతం) పెరిగింది. వెరసి ఆగస్ట్, సెప్టెంబర్‌లలో కనిపించిన బలహీనతల నుంచి ధరలు బలపడుతున్నాయి. దేశవ్యాప్తంగా మెరుగుపడుతున్న ధరలు, డిమాండ్‌ను ప్రాంతీయ ధోరణులు సైతం ప్రతిబింబిస్తున్నాయి. అయితే రికవరీ వేగంలో ప్రాంతీయంగా అంతరాలున్నాయి.
దక్షిణాది, తూర్పు భారత్‌లో సిమెంట్ బస్తా ధరలు రూ. 11-13 చొప్పున పుంజుకోగా.. ఉత్తరాదిన సుమారు రూ. 8 చొప్పున పెరిగాయి. ప్రధానంగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో పటిష్ట డిమాండ్ నెలకొంది. మధ్యభారతంలో బస్తా ధర రూ. 4 చొప్పున బలపడింది. పశి్చమాన రూ. 8 చొప్పున అధికమైనప్పటికీ.. వ్యక్తిగత గృహ నిర్మాణాలు మందగించడం, కార్మికుల వలసలు, లోటు వర్షపాతం సమీప భవిష్యత్‌లో విక్రయాలను ప్రభావితం చేయనున్నాయి.
ద్వితీయార్థం నుంచి గుడ్
ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం నుంచి సిమెంట్‌కు డిమాండ్ బలపడనున్నట్లు అంచనా. సీజనల్‌గా నిర్మాణాలు ఊపందుకోనుండటం, మౌలికసదుపాయాల అభివృద్ధి, గృహ సముదాయాల పురోగతి, ప్రయివేట్ రంగ పెట్టుబడులు ఇందుకు దోహదపడనున్నాయి. అయితే ప్రాంతీయ పరిస్థితులు రికవరీ వేగాన్ని మందగింపచేయవచ్చు.
ఢిల్లీఎన్‌సీఆర్‌లో నిర్మాణాలపై ఆంక్షలు, లోటు వర్షపాతంసహా కొన్ని మార్కెట్లలో కార్మికుల కొరత వంటి అంశాలు ప్రతికూలంగా పరిణమించనున్నాయి. మరోపక్క ముడివ్యయాల భారాన్ని కంపెనీలు పండుగల సీజన్ తదుపరి విక్రయ ధరలకు బదిలీ చేయనున్నాయి. పెట్‌కోక్ దిగుమతి ధరలు టన్నుకి 185-190 డాలర్లుగా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా బొగ్గు టన్నుకి 128 డాలర్లు పలుకుతోంది. కాగా.. ఇటీవల ముడిచమురు ధర గరిష్టం నుంచి 17 శాతం క్షీణించి బ్యారల్ 96 డాలర్లకు దిగివచ్చింది.


