నియంత్రించాల్సిన వ్యవస్థలు నోరుమూసుకుంటే, పర్యవేక్షణ చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్టుంటే జరిగేదేమిటో ప్రాణాంతక కేన్సర్ వ్యాధికి వాడే ఔషధాల ధరలు చుక్కలనంటడం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమూ, జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) ప్రదర్శిస్తున్న అంతులేని నిర్లక్ష్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం మొన్న మంగళవారం తీవ్రంగా దుయ్యబట్టాక ఆ వెంటనేకొంత కదలిక వచ్చిన జాడలు కనబడ్డాయి.
అంతక్రితమే సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సాగుతుండగా ఎంపికచేసిన 137 ఔషధాల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై నియంత్రణ విధిస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది. వచ్చే నెల 9నుంచి అమల్లోకొచ్చేలా వీటి ధరలు తగ్గించామని ఉత్పత్తిదారులు ప్రకటించారు. మంచిదే. అయితే మొత్తం 543 కేన్సర్ ఔషధ రకాల్లో వీటి సంఖ్య ఏపాటి? చావు కబురు చల్లగా చెప్పినట్టు పేటెంటు, లైసెన్సు, ఇతర రకాల పరిరక్షణ వ్యవస్థల పరిధిలోకొచ్చే ఔషధాలకు మాత్రం ఈతగ్గింపు వర్తించదంటున్నారు ఉత్పత్తిదారులు.
ప్రజలందరి మేలూ కోరే ఆర్థిక వ్యవస్థ లేనిచోట నిరుద్యోగం, పేదరికం, అజ్ఞానం, అనారోగ్యంవంటి సమస్త రుగ్మతలూ ముసురుకుంటాయని కెనడాకు చెందిన ప్రజా వైద్యుడు డాక్టర్ నార్మన్ బెతూన్ చెప్పి దశాబ్దాలు దాటుతోంది. దాదాపు అన్ని ప్రభుత్వాలూ తమ ఆచరణ ద్వారా ఆయన చెప్పింది నూరుశాతం నిజమని నిరూపి స్తున్నాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులతోపాటు పలు ఇతర కేన్సర్లకు వాడే మెర్క్‌కంపెనీ ఔషధం వంద మిల్లీగ్రాముల టీకా ధర రూ. 2.16 లక్షలు. ఇంత ధర వెచ్చించటం సాధారణ రోగులకు సాధ్యమేనా? 21 మాత్రలుగా ఉండే ఇమ్యూనోథెరపీ ఔషధం200 మిల్లీగ్రాముల ధర రూ. 24,435. ఈ రెండు రకాల ఔషధాలూ జాబితాలో లేవు.
ఇవేకాదు... రూ. 10 లక్షల ఖరీదుచేసే మరో ఔషధం కూడా జాబితాలో గల్లంతయింది! అలాగే చాలావాటి ధరలు స్వల్పంగా... అంటే రూ. 100లోపే తగ్గాయి. రొమ్ము, ప్రొస్టేట్ తదితర కేన్సర్లకు వినియోగించే నాలుగైదు రకాల ఔషధాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. ఉదాహరణకు కీమోథెరపీలో వాడే ఔషధం ధర రూ. 80,071 నుంచి రూ. 7,150కి, రొమ్ము కేన్సర్‌కు వాడే ఔషధం ధర రూ. 40,421 నుంచి రూ. 2,720కి, బహుళ కేన్సర్లకు వాడే ఔషధం ధర రూ. 69,852 నుంచి రూ. 13,512కు తగ్గాయి.
అసలు ఎంఆర్‌పీపై నియంత్రణ సరిపోతుందనుకోవటమే లోపభూయిష్టం.తగ్గించామని ఘనంగా చెప్పుకున్నంతసేపు పట్టదు అవి పెరగటానికి. ముడి సరుకుల ధరలు పెరిగితే అవి పైపైకి పోతాయి. చాలా రకాల ఔషధాలకు లక్షల రూపాయల ధర పెట్టడం వెనక అవి ప్రాణరక్షణకు ప్రభావవంతంగా తోడ్పడటంతప్ప మరేవిధమైన హేతుబద్ధతా లేదు. ఉత్పత్తిదారుల దగ్గర ధరను నియంత్రిస్తే వేరు. ఉదాహరణకు ఒక ఔషధ తయారీకయ్యే వ్యయానికి ఉత్పత్తిదారులు 42.8 శాతం అదనంగా వేసుకుని స్టాకిస్టులకు విక్రయిస్తారు. రోగులకెళ్లేలోగా మరిన్ని అంచెలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆస్పత్రులే నేరుగా కొని విక్రయిస్తాయి. ఈ క్రమంలో ప్రతిచోటా అదనపు లాభం వేసుకుంటూపోతారు. ఎంఆర్‌పీపై కేంద్రీకరిస్తే ఈ లాభార్జన స్వల్పంగా తగ్గుతుంది. ఆస్పత్రులైతే మందులపై ‘కోల్పోయిన’ దాన్ని గది అద్దె పెంచటంద్వారానో, మరో రకంగానో వసూలు చేస్తాయి.
గతంతో పోలిస్తే కేన్సర్ మహమ్మారి విస్తృతి పెరిగింది. గ్రామాలు, నగరాలన్న తేడా లేకుండా అందరినీ కాటేస్తోంది. కారణాలు అందరికీ తెలుసు. సాగులో ఎరువులవాడకం, అధిక పాల ఉత్పత్తి కోసం పశువులకు విచక్షణారహితంగా ఇంజెక్షన్లివ్వటం, వాతావరణ కాలుష్యం, నదులు, భూగర్భ జలాల కాలుష్యం, ప్రమాదకరమైన ఆహార విక్రయాలు... ఇవన్నీ కేన్సర్ కారకాలు. సారాంశంలో ప్రభుత్వ విధానాలు కావొచ్చు... వాటి నిర్వా్యపకత కావొచ్చు... ఈ ప్రాణాంతక వ్యాధికి మూలం. ప్రత్యక్షంగాలేదా పరోక్షంగా తామే ఈ మరణమృదంగానికి కారణమవుతూ... కనీసం ఔషధాల ధరలైనా సరిగా నియంత్రించలేనప్పుడు ప్రభుత్వాలుండి ఏం ప్రయోజనం? అందుకేకంటితుడుపు చర్యలు మానుకుని వాస్తవంగా జనానికి లబ్ధి చేకూరే విధానాలు అమల్లోకి తీసుకురావాలి.


