పౌరుల వ్యక్తిగత గోప్యత పరిరక్షించే సాకుతో కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం, దానికి అనుగుణంగా నిరుడు విడుదలైన నిబంధలు పత్రికా స్వేచ్ఛకు పాతర పెట్టేవిగా ఉన్నాయి. ఈ నిబంధనల్ని అమలు చేయటం మొదలెడితే దేశంలో తమ సంస్థలన్నీ మూతబడక తప్పదని మంగళ వారం వివిధ మీడియా సంస్థల తరఫున సర్వోన్నత న్యాయస్థానం వాదన వినిపించిన న్యాయవాది చెప్పిన మాటలు ప్రత్యక్షర సత్యాలు.
అవి మూతబడే పరిస్థితి ఏర్పడిందంటే ప్రజలకు వాస్తవ సమాచారం శాశ్వతంగా రాకుండా పోతుంది. ‘చాలావరకూ మనల్ని భయపెడుతున్న దానినే మనం ద్వేషిస్తుంటాం’ అంటాడు విలియమ్ షేక్‌స్పియర్. మీడియా విషయంలో ఇలాంటి భయాలేవో ప్రభుత్వానికి ఉన్నట్టు కనబడుతోంది. డీపీడీపీ చట్టంలో మెటా, గూగుల్ వంటి బహుళజాతి సంస్థలు ఇక్కడి సమాజం విషయంలో బాధ్యతాయుతంగా మెలగటానికి నిబంధనలు రూపొందించారు.
మంచిదే. కానీ డిజిటల్ మీడియా సంస్థ లకు మినహాయింపు మాట ఇందులో లేదు. వాస్తవానికి ఇప్పుడు ప్రతి ప్రచురణ సంస్థకూ అన్ని వేదికలూ ఉన్నాయి. కనుక సారాంశంలో ఇది మొత్తం మీడియా పీకనొక్కడమే. ఈ విషయమై మొన్న ఆగస్టులో డిజిటల్ వార్తా ప్రచురణకర్తల సంఘం(డీఎన్‌పీఏ) కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. పౌరులకు వ్యక్తిగత గోప్యత ఉండితీరాలి. ఆ విషయంలో రెండో మాట లేదు. కానీ దానికి రక్షణ కల్పిస్తున్నట్టు కనబడుతూనే మీడియా స్వేచ్ఛను అరికట్టాలని చూడటం అనైతికం.
ఇటీవల కొన్ని మీడియా సంస్థల పోకడలు ఆందోళన కలిగించేవే. మీడియా స్వేచ్ఛ అంటే ఇష్టానుసారం ఏది పడితే అది రాసే స్వేచ్ఛ కానే కాదు. జరిగిన ఉదంతానికీ, మాట్లాడిన మాటలకూ స్వీయ వ్యాఖ్యానాలు జోడించి వక్రీకరించే స్వేచ్ఛ అంతకన్నా కాదు. మీడియా స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణం ద్వారా ప్రజలకు సమకూరిన హక్కు. దీన్ని దుర్వినియోగంచేసి వక్రమార్గంలో పోయే మీడియా సంస్థల విశ్వసనీయత త్వరలోనే అడుగంటుతుంది. అందుకే అత్యధిక మీడియా సంస్థలు తమకుండే పరిమితుల్లోనే శక్తివంచన లేకుండా బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి.
డిజిటల్ డేటా పరిరక్షణ చట్టమైనా, దానికి అనుగుణంగా రూపొందిన నిబంధన లైనా చిత్రంగా ఉన్నాయి. ఎవరైనా తప్పుడు చర్యకు పాల్పడ్డారని పాత్రికేయులకు సమాచారం అందితే, ఆ వ్యవహారంపై పరిశోధించే ముందు సంబంధిత వ్యక్తి అనుమతి కోరాలట! అప్పటికే కథనాలేమైనా రూపొందించివుంటే తొలగించాలట. అంతేకాదు... ఆ సమాచారం ఎలా వచ్చిందో చెప్పాలట. దీని ప్రకారం ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఎన్నికల సంఘం అస్తవ్యస్థ నిర్వహణపైనా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్ష నిర్ణయాలపైనా గత నెల 23న ప్రచురించిన సమాచారాన్నిముందుగా ఆయనగారికి సమర్పించాలి.
ప్రచురించటానికి అనుమతి కోరాలి. పైగా ఆ సమాచారం ఎలావచ్చిందో చెప్పాలి. పెద్ద మనసుతో ఆయన తొలుత అనుమతించినా... ఏ దశలోనైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చు కూడా! ఇదేమైనా బాగుందా? 80వ దశకం చివర మీడియాలో బద్దలైన బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం, యూపీఏ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన 2జీ స్కామ్ వగైరాలతో రాజకీయంగా నిండా బాగుపడిన బీజేపీ సారథ్యంలో ఉన్న సర్కారు ఇలాంటి చట్టం చేసిందంటే నమ్మశక్యంగాదు. అటు నుంచి ఇటొస్తే అన్నీ తేడాగా కనబడతాయి కాబోలు!
ఈ చట్ట నిబంధనలు కేవలం మీడియాపై దాడితోనే ఆగవు. వాటి పర్యవసానాలు ముందూ మునుపూ సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ)పైనా ఉంటాయి. గతంలో వ్యక్తిగత సమాచారాన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో నిరాకరించవచ్చనీ, ప్రజాప్రయోజనం ఇమిడి ఉన్న సందర్భాల్లో మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుందనీ నిబంధన ఉండేది. ఇప్పుడు డీపీడీపీ చట్టంలోని 44(3) నిబంధన ఆ మినహాయింపును ఆవిరిచేసింది. ప్రజాప్రయోజనం ఉన్నా సరే... అధికారులు వద్దంటే అంతే సంగతులన్నమాట! ఇప్పటికే పత్రికా స్వేచ్ఛలో మనం పాకిస్తాన్, పాలస్తీనా వగైరాల కన్నా అట్టడుగునున్నాం. ఇంకా అధోగతికి పోవాలనా ఈ చట్టం? ఈ అప్రజాస్వామిక నిబంధనల్ని ఇకనైనా ఉపసంహ రించుకోవటం ఉత్తమం.


