బ్రెజిల్: అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా.. సోషల్ మీడియా సంస్థలపై నియంత్రణ అవసరమని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో మెటా సంస్థ తనకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ, డిజిటల్ వేదికల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రచారంలో సామాజిక మాధ్యమాల ప్రభావం, ఎన్నికల్లో వాటి పాత్రపై ఈ పరిణామం మరోసారి చర్చకు దారితీసింది.
అక్టోబర్ 25న ఆదివారం తిరిగి ఎన్నికైన అనంతరం లూలా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి లోబడి సోషల్ మీడియా సంస్థలు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ అయిన మెటాతో ఎన్నికల సమయంలో ఆయన ప్రచార బృందానికి వివాదం తలెత్తింది. మెటా అల్గారిథమ్‌లు తన ప్రత్యర్థి ఫ్లావియో బొల్సొనారోకు అనుకూలంగా వ్యవహరించాయని, తనకు మద్దతుగా ఉన్న పోస్టుల వ్యాప్తిని పరిమితం చేశాయని లూలా ప్రచార బృందం ఆరోపించింది.
ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను మెటా ఖండించింది. ఏ అభ్యర్థికీ రాజకీయ సిద్ధాంతాల ఆధారంగా అనుకూలంగా వ్యవహరించబోమని స్పష్టం చేసింది. ప్రచార సమయంలో ఎదురైన సమస్యలు సాంకేతిక లోపాల వల్లే తలెత్తాయని వివరించింది. సెప్టెంబరులో లూలా ప్రచార ప్రకటనల ఖాతాను పొరపాటున గంటకు పైగా నిలిపివేసినట్లు అంగీకరించింది. ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాన్ని అనుకరించే ప్రయత్నంపై అనుమానంతో నిర్వహించిన పరిశీలనలో ఈ పొరపాటు జరిగిందని, అనంతరం దాన్ని సరిచేశామని తెలిపింది.
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల చివరి వారాల్లో ఈ వివాదం మరింత ముదిరింది. సోషల్ మీడియా పోస్టులు కనిపించే స్థాయి, వాటి వ్యాప్తి, చెల్లింపు ప్రకటనల పంపిణీపై లూలా ప్రచార బృందం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మెటా కృత్రిమ మేధ (ఏఐ) సాధనాల ద్వారా రూపొందించిన రాజకీయ సమాచారాన్ని నిర్వహించే తీరుపైనా ఆందోళన తెలిపింది. అయితే, ఈ పరిణామాలు ఉద్దేశపూర్వక రాజకీయ జోక్యానికి నిదర్శనమన్న ఆరోపణలను మెటా తోసిపుచ్చింది.
ఈ వివాదంపై బ్రెజిల్ సుపీరియర్ ఎలక్టోరల్ కోర్టు మెటాను వివరణ కోరింది. అభ్యర్థుల ప్రచార సమాచారాన్ని సమానంగా చూడలేదన్న ఆరోపణలపై ప్రశ్నలు లేవనెత్తింది. అనంతరం రెండు ప్రచార బృందాల పట్ల సమానంగా వ్యవహరించేలా చర్యలు తీసుకున్నామని మెటా వెల్లడించింది. ఎన్నికల్లో ఓటర్లను చేరుకోవడానికి రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో, వాటి నియంత్రణపై చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. పోస్టుల వ్యాప్తి, ప్రకటనల ప్రదర్శన ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల అనంతరం కూడా ఈ అంశాన్ని కొనసాగిస్తానన్న లూలా వైఖరి.. బ్రెజిల్‌లో టెక్నాలజీ సంస్థలపై ఎలాంటి నియంత్రణలు అమలవుతాయన్న ఆసక్తిని పెంచుతోంది.
ఇదీ చదవండి: లూలా విజయంతో భారత్‌కు ఒరిగేదేంటి?


