ఇరాన్‌కు సౌదీ, పాక్‌ వీఐపీ టీమ్‌.. యుద్ధానికి ముగింపు? | Saudi Pakistan Turkey Team Heads to Iran They Stop the War | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు సౌదీ, పాక్‌ వీఐపీ టీమ్‌.. యుద్ధానికి ముగింపు?

Oct 26 2026 11:54 AM | Updated on Oct 26 2026 11:54 AM

Saudi Pakistan Turkey Team Heads to Iran They Stop the War

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు, సౌదీ అరేబియాకు మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ, టర్కీ, పాకిస్థాన్‌ దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధులు టెహ్రాన్‌లో ఇరాన్‌ అధికారులతో సమావేశం కానున్నారు. సౌదీపై క్షిపణులు, డ్రోన్ల దాడులు కొనసాగుతున్న సమయంలో ఈ భేటీ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాంతీయ భద్రతను కాపాడటం, యుద్ధం మరింత విస్తరించకుండా చూడటం, అమెరికా-ఇరాన్‌ మధ్య దౌత్యానికి మార్గం సుగమం చేయడం ఈ చర్చల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలుగా భావిస్తున్నారు. అయితే, ఈ సమావేశం యుద్ధాన్ని ఆపగలదా? ఇరాన్‌ వైఖరిలో మార్పు తీసుకురాగలదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

రాయిటర్స్‌ కథనం ప్రకారం, సోమవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ప్రాంతీయ భద్రతపై కీలక చర్చలు జరగనున్నాయి. సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్‌ ఖాలిద్‌ బిన్‌ సల్మాన్‌, పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌, టర్కీ నిఘా విభాగం అధిపతి ఇబ్రహీం కలిన్‌ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికారులతో వీరు చర్చలు జరపనున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నియంత్రించడం, భద్రతాపరమైన సమన్వయం, యుద్ధ ప్రభావాలను తగ్గించడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

సౌదీపై దాడులు.. ఇరాన్‌పై ఒత్తిడి?
అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో, యెమెన్‌లోని ఇరాన్‌ అనుకూల హౌతీ తిరుగుబాటుదారుల దాడులు సౌదీ అరేబియాకు కొత్త సవాలుగా మారాయి. ఆదివారం కూడా సౌదీ అరేబియా క్షిపణులు, డ్రోన్ల దాడి ప్రయత్నాలను అడ్డుకున్నట్లు రాయిటర్స్‌ నివేదించింది. ఈ పరిణామాలు ప్రాంతీయ యుద్ధాన్ని మరింత విస్తరించే ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇక, గత ఆగస్టులో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్‌ మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒక సభ్యదేశంపై సాయుధ దాడిని అన్ని సభ్యదేశాలపై దాడిగా పరిగణించే నిబంధన ఈ ఒప్పందంలో ఉంది. ఈ నేపథ్యంలో సౌదీ భద్రతకు ముప్పు పెరిగితే మిగతా రెండు దేశాల పాత్ర ఏమిటన్నది కీలకంగా మారింది. ఈ నెల ప్రారంభంలో రియాద్‌లో జరిగిన అత్యవసర సమావేశంలో సౌదీలో సైనిక బలగాలు, రక్షణ సామర్థ్యాలను వేగంగా మోహరించేందుకు మూడు దేశాలు అంగీకరించినట్లు నివేదిక తెలిపింది.

అమెరికా-ఇరాన్‌ చర్చలకు పాక్‌ మధ్యవర్తిత్వం!
అమెరికా, ఇరాన్‌ మధ్య గతంలో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేసిన ఇస్లామాబాద్‌.. మరోసారి రెండు పక్షాల మధ్య దౌత్య మార్గాలను తెరిచే ప్రయత్నం చేయవచ్చు. ఇటీవలే అసిమ్‌ మునీర్‌ టెహ్రాన్‌లో ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో సమావేశమయ్యారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు వాషింగ్టన్‌తో చర్చలు జరపబోమని ఇరాన్‌ అధికారులు తెలిపినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా సమావేశం ద్వారా ఇరాన్‌ వైఖరిలో మార్పు వస్తుందా? అమెరికాతో చర్చలకు కొత్త మార్గం ఏర్పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

యుద్ధానికి బ్రేక్‌ పడుతుందా? 
ఈ సమావేశం ప్రాంతీయ సంక్షోభాన్ని తగ్గించే దౌత్య ప్రయత్నమా? సౌదీ భద్రతను బలోపేతం చేసే వ్యూహమా? లేక భవిష్యత్తులో మరింత సమన్వయంతో పనిచేసే రక్షణ కూటమికి పునాది వేస్తుందా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఇరాన్‌తో నేరుగా చర్చలు జరపడానికి మూడు దేశాల ప్రతినిధులు ఒకేసారి రావడం మాత్రం కీలక పరిణామమే. ఇప్పుడందరి దృష్టి టెహ్రాన్‌ భేటీపైనే ఉంది. ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయి? హౌతీ దాడులను నిలువరించే దిశగా ఏమైనా అంగీకారం కుదురుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో హై టెన్షన్‌.. నెతన్యాహుకు బిగ్‌ షాక్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement