ఏ లక్ష్యమైనా మా పరిధిలోనే.. | Operation Sindoor Proved No Target Beyond IAF Reach | Sakshi
Sakshi News home page

ఏ లక్ష్యమైనా మా పరిధిలోనే..

Oct 26 2026 2:05 AM | Updated on Oct 26 2026 2:05 AM

Operation Sindoor Proved No Target Beyond IAF Reach

ఆపరేషన్‌ సింధూర్‌తో నిరూపించాం 

ఐఏఎఫ్‌ చీఫ్‌ ఏపీ సింగ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) తన సత్తాను శత్రువుకు రుచి చూపించిందని ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ చెప్పారు. సరిహద్దుల్లో 1,200 కిలోమీటర్ల పొడవునా, 200 కిలోమీటర్ల మేర శత్రు భూభాగంలో ఎలాంటి లక్ష్యాన్నైనా అత్యంత కచి్ఛతత్వంతో ధ్వంసం చేశామని ఆయన పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తలెత్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యముందని చెప్పకనే చెప్పామన్నారు.

 ఆయన పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన కొన్ని ఆయుధ వ్యవస్థలు అసాధారణ రీతిలో రాణించాయని, శత్రువు భూభాగంలోకి చొచ్చుకెళ్లి కోలుకోలేని దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ ఆసాంతం మన వైపు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చేయాలనే నిబద్ధతతో సాగిందని ఏపీ సింగ్‌ తెలిపారు.  

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంపై సునిశిత దృష్టి 
ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో మారుతున్న పరిణామాలపై ఐఏఎఫ్‌ ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతోందని ఏపీ సింగ్‌ వివరించారు. సుదూర ప్రాంతాల్లోని భారత ప్రయోజనాలను కాపాడుకునేందుకు సైతం అందిపుచ్చుకోవాల్సిన ప్రత్యేక సామర్థ్యాలపై దృష్టి పెట్టామన్నారు. ఈ ప్రాంతంలో చైనా తన సైనిక సాధన సంపత్తిని విపరీతంగా పెంచుకుంటుండటం అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ విషయం ప్రస్తావించారు. 

తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో మనకు అండమాన్‌ నికోబార్‌ దీవులు అత్యంత వ్యూహాత్మకంగా మారాయని అన్నారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో సమ్మిళితత్వ భావనతోపాటు దేశ ప్రయోజనాలు, సార్వభౌమత్వ పరిరక్షణకు భారత్‌ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ విషయంలో భారత్‌తో జపాన్, అమెరికా, ఆ్రస్టేలియా, కొన్ని యూరప్‌ దేశాలు ఉమ్మడి వైఖరితో ఉన్నాయని చెప్పారు. 

అవసరాలకు తగ్గట్టుగా విధానాలు 
మనదేశ నిర్దిష్ట భద్రతా అవసరాలకు తగినట్లుగా యుద్ధ విధానాలు ఉండాలని, విదేశీ నమూనాలను గుడ్డిగా అనుసరించరాదని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ చెప్పారు. వివిధ దేశాలు, ప్రాంతాల్లో జరుగుతున్న సంఘర్షణలను ప్రస్తావిస్తూ ఆయన.. వైమానిక శక్తి సైనిక ఫలితాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయగలవని పేర్కొన్నారు. అవసరమైన చోట మాత్రమే వైమానిక శక్తిని వినియోగించుకునే వీలుండాలని తెలిపారు.

 కార్యాచరణ సన్నద్ధత విషయంలో ఎప్పటికీ రాజీ తగదని ఆయన స్పష్టం చేశారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ సారథ్యంలో ఏర్పాటైన త్రివిధ దళాల అధిపతులతో కూడిన ఉమ్మడి నిర్మాణమే ఆపరేషన్‌ సింధూర్‌కు మార్గదర్శిగా ఉందని ఆయన వివరించారు. ఆ సమయంలో సైనిక వనరులను వేగంగా తగిన చోటుకు తరలించడం ఈ వ్యవస్థ వల్లే సాధ్యమైందని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement