షాన్‌దార్‌ షాదాబ్‌ | Pakistan in the final of the triangular ODI series | Sakshi
Sakshi News home page

షాన్‌దార్‌ షాదాబ్‌

Oct 26 2026 4:24 AM | Updated on Oct 26 2026 4:24 AM

Pakistan in the final of the triangular ODI series

96 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో 113 నాటౌట్‌

పదో వికెట్‌కు రవూఫ్‌తో 89 పరుగుల రికార్డు భాగస్వామ్యం

154/9 నుంచి... 243/9కు పాక్‌

ఉత్కంఠ పోరులో ఒక వికెట్‌ తేడాతో ఇంగ్లండ్‌ ఓటమి

ముక్కోణపు వన్డే సిరీస్‌ ఫైనల్లో పాకిస్తాన్‌  

లాహోర్‌: పాకిస్తాన్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. గత మ్యాచ్‌లో 429 పరుగులు చేసి మరీ శ్రీలంక చేతిలో పరాజయం పాలైన ఆ జట్టు... ఆదివారం పాకిస్తాన్‌ చేతిలో రెండో ఓటమి మూటగట్టుకుంది. ఒకదశలో సునాయాసంగా మ్యాచ్‌ గెలుస్తుందనుకున్న ఇంగ్లండ్‌ జట్టు పట్టు కోల్పోయి పరాజయం పాలవగా... ఆశల్లేని స్థితి నుంచి పాకిస్తాన్‌ అద్భుతం చేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 46.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. 

బెన్‌ డకెట్‌ (111 బంతుల్లో 105; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... స్యామ్‌ కరన్‌ (42; 5 ఫోర్లు), అట్కిన్సన్‌ (36 నాటౌట్‌; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (1), జో రూట్‌ (5), బాంటన్‌ (4), కాక్స్‌ (6) విఫలం కావడంతో ఒకదశలో 52 పరుగులకే 4 వికెట్లతో కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ జట్టును డకెట్‌ ఆదుకున్నాడు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ షాహీన్‌ షా అఫ్రిది 4 వికెట్లు పడగొట్టగా... రజాఉల్లా, అరాఫత్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తన్‌ 47.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి గెలిచింది.

ఒక దశలో 154/9తో ఓటమి అంచున నిలిచిన జట్టును ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షాదాబ్‌ ఖాన్‌ (96 బంతుల్లో 113 నాటౌట్‌; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో విజయతీరాలకు చేర్చాడు. ఫఖర్‌ జమాన్‌ (10), సయీమ్‌ అయూబ్‌ (6), బాబర్‌ ఆజమ్‌ (10), సాద్‌ బైగ్‌ (32; 7 ఫోర్లు), సల్మాన్‌ ఆఘా (26), హసన్‌ నవాజ్‌ (15), అరాఫత్‌ మిన్హాస్‌ (1) ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌ చేరడంతో పాకిస్తాన్‌ పరాజయం దాదాపు ఖాయమైపోయింది. ఇక ఓటమి తప్పదనిపించిన స్థితిలో షాదాబ్‌ ఖాన్‌ మొండిగా పోరాడాడు. 

ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన అతడు... హరీస్‌ రవూఫ్‌ (7 నాటౌట్‌)తో కలిసి అబేధ్యమైన 10వ వికెట్‌కు 80 బంతుల్లో 89 పరుగులు జోడించాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో విజయవంతమైన ఛేదనల్లో చివరి వికెట్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. దీంతో ముక్కోణపు సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన పాకిస్తాన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లగా... వరుసగా మూడో పరాజయంతో ఇంగ్లండ్‌ ఫైనల్‌ రేసుకు దూరమైంది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో పాకిస్తాన్‌ ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement