మాజీ అధ్యక్షుడు ఒబామా ధ్వజం
డెట్రాయిట్: అమెరికాలో నవంబర్ 3వ తేదీన మధ్యంతర ఎన్నికలు జరగనుండగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిపక్ష డెమోక్రాట్ అభ్యర్థుల తరఫున శనివారం మిషిగన్, ఒహాయోల్లో ప్రచారం చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ఇరాన్‌పై అనవసరంగా యుద్ధం కారణంగా దేశంలో ఇంధనంతోపాటు అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు.
గత రెండేళ్లుగా సాగుతున్న అవినీతి, అసమర్థతలకు ముగింపు పలికే సమయం వచ్చిందని ఒబామా ప్రజలకు పిలుపునిచ్చారు. అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబం తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయని ఒబామా చెప్పారు. దేశం ఆర్థికంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఖర్చులను తగ్గించడానికి బదులుగా వైట్‌హౌస్‌లో కొత్త బాల్‌రూమ్, సౌత్ లాన్ వద్ద హెలిప్యాడ్ వంటివి నిర్మిస్తూ ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారన్నారు.
ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఒక చీజ్ కేక్ ఫ్యాక్టరీని తెరిచినట్లుగా ఆయన వైట్‌హౌస్‌ను మార్చేశారంటూ దెప్పిపొడిచారు. ట్రంప్, ఆయన అనుచర బృందం క్రూరంగా, అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓహాయోలో రిపబ్లికన్ పార్టీ గవర్నర్ అభ్యర్థి వివేక్ రామస్వామి ప్రచార పోకడలను తప్పుబట్టారు. ప్రత్యర్థిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ రామస్వామి అన్ని హద్దులను దాటేశారని, నీచమైన స్థాయికి దిగజారారని విమర్శించారు.


