బ్రెజిలియా: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో 80 ఏళ్ల వామపక్ష నేత లుయిజ్ ఇనాసియో లులా డా సిల్వా సంచలన విజయం సాధించారు. తొలి విడత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ, చివరికి మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పెద్ద కుమారుడు, సెనేటర్ ఫ్లావియో బోల్సోనారోను ఓడించి, నాలుగోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. లాటిన్ అమెరికాలో పెరుగుతున్న మితవాద గాలిని ఎదుర్కొంటూ ఒపీనియన్ పోల్స్‌ను తలకిందులు చేసి ఈ విజయం సాధించడం విశేషం.
ఈ ఎన్నికల విజయం ద్వారా లూలా తన రాజకీయ ప్రస్థానంలో మరోసారి ఘనమైన విజయం దక్కిచుకున్నారు. 2003 నుంచి 2011 వరకు అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, 2022లో జైర్ బోల్సోనారోను ఓడించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ద్రవ్యోల్బణం, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ పనితీరుపై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రజలు అనిశ్చితి వైపు కాకుండా సుపరిచితమైన దారినే ఎంచుకోవడంతో లూలా విజయం సాధించగలిగారు. ఈ గెలుపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గానికి ఎదురుదెబ్బగా నిలిచింది.
అయితే నాలుగోసారి అధికారంలోకి వస్తున్న లూలాకు భవిష్యత్తులో తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఎదురుకానున్నాయి. బ్రెజిల్ చరిత్రలోనే అత్యంత సంప్రదాయవాద కాంగ్రెస్ ఎన్నిక కావడంతో, పార్లమెంటులో రైట్‌పార్టీల కూటమి బలముంది. ఇది ఆయన ప్రభుత్వ విధానాలకు ఆటంకం కలిగించవచ్చని, అభిశంసన ముప్పు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు దేశంలో పెరుగుతున్న ప్రభుత్వ రుణం (జీడీపీలో 82 శాతానికి పైగా), గరిష్ట వడ్డీ రేట్లు, గృహ రుణాల భారం వంటి తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఆయన ఎదుర్కోవాల్సి ఉంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ప్రజా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, సంప్రదాయవాద పార్లమెంటుతో నెగ్గుకురావడం లూలాకు కత్తి మీద సాములా మారనుంది.


