బెల్గ్రేడ్: సెర్బియాలో విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. దీనితో అలెగ్జాండర్ వూచిక్ నేతృత్వంలోని సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ పాలనకు తెరపడింది. 2024లో నోవి సాద్ రైల్వే స్టేషన్ పైకప్పు కూలి 16 మంది మరణించిన విషాద ఘటన తర్వాత చెలరేగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ దుర్ఘటనకు అవినీతే కారణమని ఆరోపిస్తూ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి.
దేశవ్యాప్తంగా ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి, గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనివిధంగా సుమారు 65 శాతం పోలింగ్ నమోదు చేశారు. పోలింగ్ ముగిసిన రెండు గంటల్లోనే అధ్యక్షుడు అలెగ్జాండర్ వూచిక్ తన ఓటమిని అంగీకరించడంతో, సెర్బియాలోని పలు నగరాల్లో ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. తాము స్వేచ్ఛా దేశంలో జీవిస్తున్నట్లు భావిస్తున్నామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో విద్యార్థుల తరఫున పోటీ చేసిన అభ్యర్థులలో ఎక్కువ మంది విద్యావేత్తలు, కళాకారులు వంటి వివిధ రంగాలకు చెందిన నిపుణులే ఉన్నారు. వీరికి రాజకీయ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అవినీతిని అణచివేయడమే ప్రధాన అజెండాగా బరిలోకి దిగి విజయం సాధించారు. మరోవైపు, ఈ చారిత్రాత్మక విజయాలపై యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, హంగేరీ ప్రధాని పీటర్ మాగ్యార్ విద్యార్థులకు అభినందనలు తెలిపి, చట్టబద్ధత, అవినీతి నిర్మూలనలో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్షుడిగా లూసియో ఇనాసియో లులా డా సిల్వా


