ఇజ్రాయెల్‌లో హై టెన్షన్‌.. నెతన్యాహుకు బిగ్‌ షాక్‌? | Thousands of Israelis fly home to vote in Elections | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో హై టెన్షన్‌.. నెతన్యాహుకు బిగ్‌ షాక్‌?

Oct 26 2026 7:57 AM | Updated on Oct 26 2026 8:04 AM

Thousands of Israelis fly home to vote in Elections

ఇజ్రాయెల్‌ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. దేశానికి దూరంగా విదేశాల్లో నివసిస్తున్న వేలాది మంది ఇజ్రాయెల్‌ పౌరులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వదేశానికి పయనమవుతున్నారు. సెలవుల కోసం కాదు.. పర్యటనల కోసం అంతకన్నా కాదు.. తమ దేశాన్ని ఎవరు పాలించాలనే నిర్ణయంలో భాగస్వాములు కావడానికి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ అంచనా ప్రకారం, ఈసారి దాదాపు 67 వేల మంది ఇజ్రాయెలీలు ఎన్నికల కోసం స్వదేశానికి చేరుకునే అవకాశం ఉంది. 

దీంతో ఈ ఓట్లు ఎవరికి అనుకూలంగా మారతాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరోవైపు.. ఎన్నికల వేళ ఇజ్రాయెల్‌లో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే అంచనాలు కనిపిస్తున్నాయి.

కాగా, ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు ఈ విదేశీ ఓటర్లు కొత్త రాజకీయ సవాలుగా మారతారా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశాల్లో నివసించే ఇజ్రాయెలీలు రాజకీయ మార్పును కోరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ నువ్వా-నేనా అన్నట్లు సాగితే, ఈ ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, విదేశీ ఓటర్లంతా నెతన్యాహుకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి ఆధారాలు లేవు.

ఎందుకీ ప్రత్యేక ప్రయాణాలు?
విదేశాల్లో నివసించే సాధారణ ఇజ్రాయెల్‌ పౌరులకు పోస్టల్‌ లేదా ఆన్‌లైన్‌ ఓటింగ్‌ సదుపాయం లేకపోవడంతో, ఓటు వేయాలంటే స్వయంగా దేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో అమెరికా నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు వస్తుండగా, యూరప్‌, కెనడా, ఆస్ట్రేలియా, ఆసియా ప్రాంతాల నుంచి కూడా పలువురు బయలుదేరుతున్నారు. వీరిలో చాలామంది తమ ప్రయాణ ఖర్చులను తామే భరిస్తున్నారు.

రెండు స్థానాలపై ప్రభావం చూపుతాయా?
ఇజ్రాయెల్‌లో 73 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని సర్వేలు సూచిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే ఓట్ల ప్రభావం దాదాపు రెండు స్థానాల వరకు ఉండవచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో, విదేశీ ఓటర్లను స్వదేశానికి తీసుకొచ్చే ప్రచారాన్ని అడ్డుకునేందుకు నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ ప్రయత్నించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

నెతన్యాహుకు ఇబ్బందేనా?
విదేశీ ఓటర్లు పెద్ద సంఖ్యలో స్వదేశానికి రావడం ఎన్నికల సమీకరణాల్లో ప్రాధాన్యం పొందవచ్చు. అయితే, ఆ ఓట్లు ఏ పార్టీకి పడతాయి, ఎంతమంది నిజంగా ఓటు వేస్తారు, మొత్తం ఫలితాలపై ఎంత ప్రభావం చూపుతారు అన్నది ఇంకా స్పష్టంగా లేదు. అందువల్ల నెతన్యాహుకు ఓటమి ముప్పు పొంచి ఉందని ఇప్పుడే తేల్చేయడం సరికాదు. కానీ పోటీ గట్టిగా ఉన్న ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. విదేశాల నుంచి వస్తున్న ఈ ఓటర్ల తీర్పు ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిప్పుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి, ఆయనను అధికారం నుంచి తప్పించాలని చూస్తున్న ప్రతిపక్ష కూటమికి మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అయితే, తాజా సర్వేలలో ప్రతిపక్షానికి కొన్ని స్థానాల ఆధిక్యం కనిపించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 61 స్థానాల మెజారిటీ(మొత్తం స్థానాలు 120) ఏ కూటమికీ స్పష్టంగా కనిపించడం లేదు.

ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. 
మరోవైపు.. ఇజ్రాయెల్‌ ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు తన మద్దతు ఉంటుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. నెతన్యాహు కాకుండా మరో నేత అధికారంలోకి వస్తే ఇరాన్‌ విషయంలో అమెరికాపై మరింత బాధ్యత పడవచ్చన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో ఇజ్రాయెల్‌ ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, ట్రంప్‌ మద్దతు నెతన్యాహు కూటమి ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ఇజ్రాయెల్‌ ఎన్నికల షెడ్యూల్‌..

  • అక్టోబర్ 27, మంగళవారం: పోలింగ్‌ జరుగుతుంది. ఇజ్రాయెల్‌ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడతాయి.

  • అక్టోబర్ 28, బుధవారం తెల్లవారుజాము: ఓట్ల లెక్కింపు ప్రారంభ దశలోనే తొలి ఫలితాల సరళి స్పష్టమయ్యే అవకాశం ఉంది. 

    అక్టోబర్ 29, గురువారం మధ్యాహ్నం: అన్ని ఓట్ల లెక్కింపు పూర్తయితే తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల కమిటీ అంచనా వేసింది.

  • నవంబర్ 4: అధికారిక ఫలితాల ప్రకటనకు గడువు. 

ఇదీ చదవండి: ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోంది?.. జనం ఎందుకు తిరగబడుతున్నారు? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement