ఇరాన్ యుద్ధంలో మరో కీలక మలుపు! అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో సైనికంగా దెబ్బతిన్నా.. హార్ముజ్ జలసంధి వద్ద కొత్త వ్యూహాలతో ఇరాన్ ఎదురుదాడికి దిగుతోంది. చమురు నౌకలపై దాడులను పెంచడంతో పాటు, తమ ఆంక్షలను ఉల్లంఘించే నౌకలకు ఈ మార్గాన్ని మూసివేయాలని భావిస్తోంది. ప్రపంచ చమురు ధరలు తగ్గకుండా చూడటం, నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ల అవకాశాలను దెబ్బతీయడం కూడా తమ వ్యూహంలో భాగమని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, ఇరాన్‌పై మళ్లీ భారీ సైనిక దాడులు చేయాలా? లేదంటే ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనంతో ఒత్తిడి కొనసాగించాలా? అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందిగ్ధంలో ఉన్నాడట. ఇటు ఇరాన్ అణు కార్యక్రమం తిరిగి ఊపందుకుంటోందన్న ఆందోళనతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త దాడులకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
హార్ముజ్ వద్ద కొత్త ఎత్తుగడలు
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం నుంచే సాగేది. నౌకల రాకపోకలను పరిమితం చేసి అమెరికాపై ఒత్తిడి పెంచాలని టెహ్రాన్ భావిస్తోంది. గత పది రోజులుగా దాడుల వ్యూహాన్ని మార్చినట్లు ఇద్దరు సీనియర్ ఇరాన్ అధికారులు రాయిటర్స్‌కు వెల్లడించారు.
చిన్న పడవలతో నిఘా.. ఆపై దాడులు!
అమెరికా దాడుల్లో ఇరాన్ రాడార్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కొత్త పద్ధతిని అనుసరిస్తున్నట్లు అమెరికా సైనిక అధికారి తెలిపారు. ఆయుధాలు లేని చిన్న పడవల్లో నిఘా సిబ్బందిని పంపి, అమెరికా నౌకాదళంతో పాటు ఇతర లక్ష్యాల కదలికలను గుర్తిస్తున్నట్లు వివరించారు. గత వారం ఇలాంటి ఓ పడవలోని సిబ్బంది సమాచారాన్ని ఐఆర్‌జీసీకి చేరవేస్తున్నట్లు గుర్తించిన అమెరికా బలగాలు వారిని బయటకు పంపించి, పడవను ధ్వంసం చేశాయని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదన్నారు.
గల్ఫ్ ఆఫ్ ఒమన్ వరకూ విస్తరణ?
హార్ముజ్కే పరిమితం కాకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఖతార్, యూఏఈ తీరాలకు సమీపంలోని సముద్ర జలాల్లోనూ కార్యకలాపాలను విస్తరించాలన్నది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. గత 48 గంటల్లో ట్యాంకర్లతో సహా వాణిజ్య నౌకలకు సంబంధించి కనీసం ఐదు ఘటనలు నమోదయ్యాయి. వీటిలో డ్రోన్ దాడులు కూడా ఉన్నట్లు సమాచారం. తమ ఆంక్షలను ఉల్లంఘించే నౌకలకు హార్ముజ్ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలను తగ్గించేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని పేర్కొంటున్నారు. హార్ముజ్ వద్ద వాణిజ్య నౌకలకు ముప్పు తీవ్రంగానే ఉందని జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా హెచ్చరించింది.
దాడులు చేయాలా? ఆగాలా?
ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య చేపట్టే అంశంపై ట్రంప్, నెతన్యాహు చర్చించినట్లు ఆక్సియోస్ కథనం వెల్లడించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ‘పికాక్స్ మౌంటెన్’ ప్రాంతాన్ని యురేనియం శుద్ధి కేంద్రంగా ఉపయోగించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సెంట్రల్ కమాండ్ నాయకత్వం సైనిక చర్యకు మద్దతిస్తున్నట్లు కథనం పేర్కొంది. అయితే ట్రంప్ సలహాదారుల్లో ఎక్కువమంది ఆర్థిక ఆంక్షలు, ఇతర ఒత్తిడి మార్గాలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
దాడులపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోలేదని, నవంబర్ 3న జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడి చేయబోమని ఆయన ప్రకటించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. ట్రంప్, నెతన్యాహు మళ్లీ యుద్ధం ప్రారంభించే అంశంపై చర్చించారన్న వార్తలను వైట్‌హౌస్ అధికారి ఖండించారు. ఇరువురు నేతల మధ్య క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుగుతాయని నెతన్యాహు కార్యాలయం పేర్కొంది.
ఎన్నికలే అసలు లెక్కా?
ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న, అమెరికాలో నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే నెతన్యాహుకు రాజకీయంగా ప్రయోజనం కలగవచ్చన్న అంచనాలున్నా, ఇరాన్ ప్రతిదాడులతో ఎన్నికలు వాయిదా పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా ఉంది. అమెరికాలో యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగితే ట్రంప్ రిపబ్లికన్లకు ఎన్నికల్లో నష్టం వాటిల్లవచ్చు. అందుకే సైనిక చర్యపై ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
అమెరికా ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేస్తోంది. హార్ముజ్ వద్ద ఇరాన్ కొత్త వ్యూహాలు, అమెరికా–ఇజ్రాయెల్ సైనిక సన్నద్ధత మధ్య ట్రంప్ తీసుకునే నిర్ణయం యుద్ధ భవిష్యత్తుతో పాటు ప్రపంచ చమురు ధరలు, ఎన్నికల రాజకీయాలపైనా ప్రభావం చూపనుంది.
ఇదీ చదవండి: 30 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ!


