చీకటిని చీల్చుకుంటూ ఒక ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు దూసుకుపోతోంది. ఆ బస్సులో కూర్చున్న ఇన్‌స్పెక్టర్ అభిమన్యు ఆలోచనలు గతంలోకి వెళ్లాయి.ప్రమోద్ శుక్లా హత్య కేసు విచారణ కోసం ఫతేనగర్ ఇన్‌స్పెక్టర్ పృథ్వీ విజయవాడ వెళ్లి నాలుగు రోజులుగా కనిపించడం లేదు. పృథ్వీ భార్య హేమ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఈ బాధ్యతను అభిమన్యుకు అప్పగించారు. ఇరవై నాలుగు గంటల్లో పృథ్వీని తీసుకువస్తానని హేమకు మాట ఇచ్చాడు.
హేమకు తెలుసు... అభిమన్యు మాట ఇస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మాట ఇచ్చినట్టని...అభిమన్యు విజయవాడకు బయల్దేరాడు. కళ్ళు తెరిచి చూశాడు అభిమన్యు. బస్సు మార్గమధ్యంలో ఒక నిర్మానుష్య ధాబా దగ్గర ఆగింది. అభిమన్యు కిందికి దిగి ప్రశాంతంగా చాయ్ తాగి తిరిగి బస్సు దగ్గరికి వస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా కొందరు ఆగంతకులు మెరుపువేగంతో అతని ముఖానికి ముసుగు వేశారు.
క్షణాల్లో అక్కడికి దూసుకొచ్చిన ఒక కారులో అభిమన్యును బలవంతంగా ఎక్కించుకుని వేగంగా వెళ్లిపోయారు. ఇది గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. క్షణాల్లో రెండు రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు.
∙∙
అర్ధరాత్రి... విజయవాడ శివార్లలోని ఒక పాడుబడిన గోడౌన్‌లో అభిమన్యు కళ్ళకు కట్టిన గంతలు విప్పారు. అభిమన్యు కళ్ళు నెమ్మదిగా చీకటికి అలవాటు పడుతున్నాయి. తన పక్కనే మరో వ్యక్తి వున్నాడన్న విషయం అర్థమైంది. ‘పృథ్వీ!’ అని పిలిచాడు అభిమన్యు.
ఇంతలో చీకట్లో ఉన్న స్పీకర్‌లో నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ‘వెల్‌కమ్ మిస్టర్ అభిమన్యు! మీ ఇన్‌స్పెక్టర్‌ను కాపాడుకోవడానికి మీ డిపార్ట్‌మెంట్ నిన్ను పంపుతుందని, ఆపదలో ప్రత్యక్షమయ్యే నువ్వు వస్తావని నాకు తెలుసు. కానీ ఇంత త్వరగా నా గేలానికి చేపలా చిక్కుతావని అనుకోలేదు. నీ మేధస్సును చూస్తే ముచ్చటేస్తుంది. మీ ఇన్‌స్పెక్టర్‌ని భలే పోల్చుకున్నావే...’ అంటూ బిగ్గరగా నవ్వాడు.
కట్లు విప్పుకుంటూ లేచి నిలబడ్డ అభిమన్యు చిరునవ్వుతో బదులిచ్చాడు. ‘నీ గేలానికి చిక్కింది చేప కాదు, తిమింగలం! నేను నీకు చిక్కలేదు మిస్టర్ వినోద్ శుక్లా, నువ్వే నా ట్రాప్‌కు ఎరగా దొరికావు. ప్రమోద్ శుక్లా హత్య కేసు అనగానే తీగ లాగాను. మీ నాన్న రెండవ భార్య కొడుకువైన నీ మీద నాకు అనుమానం వచ్చింది. ఆస్తి కోసం జరిగిన ప్రమోద్ శుక్లా హత్య కేసులో నువ్వే ప్రధాన నిందితుడివని అర్థమైంది.’
వినోద్ శుక్లా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అభిమన్యు కొనసాగించాడు. ‘మా ఇన్‌స్పెక్టర్ పృథ్వీ విజయవాడకు బయలుదేరే ముందు ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకెళ్లాడు. అతనికి బర్త్ డే గిఫ్ట్‌గా నేనే ఇచ్చాను. అందులో లొకేషన్ ట్రాక్ అవుతూనే ఉంది. ఆ డివైజ్ కంట్రోల్ నా ల్యాప్‌టాప్‌లో ఉంది. ఎప్పుడైతే పృథ్వీ కనిపించడం లేదని తెలిసిందో, నా ఆపరేషన్ రివర్స్ మొదలుపెట్టాను. మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఎందుకని మీ కారులోనే ఇలా దర్జాగా వచ్చాను.
నువ్వు ఇలాంటి కిడ్నాప్ డ్రామా ఆడతావని నాకు ముందే తెలుసు. ఆస్తి కోసం నువ్వు ఇంత ఘాతుకానికి పాల్పడతావని ఊహించని నీ సోదరుడు హత్యకు గురయ్యాడు. నువ్వు ఉరిస్తంభానికి వేలాడక తప్పదు... నీ చాప్టర్ క్లోజ్! నిన్ను పట్టుకోవడానికి రెండు రాష్ట్రాల పోలీసులు అక్కర్లేదు, ఈ అభిమన్యు ఒక్కడు చాలు.’
అభిమన్యు మాటలు ముగిసేసరికి బయట పోలీస్ సైరన్ల మోత వినిపించింది. అప్పటికే పోలీసులు ఆ స్థావరాన్ని చుట్టుముట్టారు. లోపలికి దూసుకొచ్చిన పోలీసులు వినోద్ శుక్లాను, అతని గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి, వినోద్‌కు అరదండాలు తగిలించి హైదరాబాద్ తరలించడానికి సిద్ధమయ్యారు. అక్కడికి చేరుకున్న విజయవాడ కమిషనర్ అభిమన్యును అభినందిస్తూ, ‘థాంక్యూ మిస్టర్ అభిమన్యు. ఈ కేసు మూలంగానైనా మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు.
‘మనమంతా ఒకే కుటుంబం సార్, పోలీస్ కుటుంబం. థాంక్యూ ఏపీ పోలీస్’ అంటూ అభిమన్యు కరచాలనం చేసి, పృథ్వీని తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. అప్పటికే టీవీలో స్క్రోలింగ్ మొదలైంది. ‘ఇన్‌స్పెక్టర్ పృథ్వీని క్షేమంగా తీసుకువస్తున్న అభిమన్యు... అసలు హంతకుడు దొరికాడు...’అప్పుడే హేమ దగ్గరి నుంచి ఫోన్...‘థాంక్స్ అన్నయ్య... ఏ ఆడపడుచు ఆపదలో వున్నా ఆదుకుంటావు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’ అంది. కృతజ్ఞతాపూర్వకంగా...ఆ క్షణం అభిమన్యుకు తన చెల్లెలు గుర్తొచ్చింది.
శ్రీసుధామయి
ఇదీ చదవండి: కుంకుమ పువ్వు గురించి ఈ విషయాలు తెలుసా..!


