‘అసెంబ్లీ రౌడీ’ సినిమా సీన్‌ రిపీట్‌.. జైలు నుంచి ఎన్నికల్లో పోటీ | Jailed Hardliner Amritpal Singh Likely To Contest In Punjab Assembly Polls | Sakshi
Sakshi News home page

‘అసెంబ్లీ రౌడీ’ సినిమా సీన్‌ రిపీట్‌.. జైలు నుంచి ఎన్నికల్లో పోటీ

Nov 27 2026 5:14 PM | Updated on Nov 27 2026 5:23 PM

Jailed Hardliner Amritpal Singh Likely To Contest In Punjab Assembly Polls

చండీగఢ్‌: ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలో హీరో మోహన్‌ బాబు జైలుకి వెళ్తారు. అక్కడి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తారు. నిజ జీవితంలోనూ ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయి. జైలులో ఉన్న వేర్పాటువాద నేత, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ (33) 2027లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై నేరుగా బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు అమృత్‌పాల్ పార్టీ అకాలీ దళ్ (వారిస్ పంజాబ్ దే) వర్గాలు వెల్లడించాయి. ఒకటి కాదు.. రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిపాయి.

మాల్వా ప్రాంతంలోని ధురి నియోజకవర్గం నుంచి భగవంత్ మాన్‌పై పోటీ చేయాలని అమృత్‌పాల్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరో స్థానం మజా ప్రాంతంలోని ఖేమ్ కరణ్. ప్రస్తుతం అమృత్‌పాల్ మజా ప్రాంతంలోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పోటీ చేసే స్థానాలపై పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌పాల్ పోటీ చేయడం మాత్రం ఖాయమని ఆయనకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒక అభ్యర్థి రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, రెండు చోట్ల గెలిస్తే చివరకు ఒక స్థానాన్ని మాత్రమే కొనసాగించాల్సి ఉంటుంది.

అమృత్‌పాల్ సింగ్ 2024లో జైలులో ఉండగానే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. 2023 ఏప్రిల్‌లో అరెస్టయిన ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. తొలుత జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించినప్పటికీ, ఆ చట్టం కింద నిర్బంధ గడువు ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసిన తర్వాత కూడా అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడికి సంబంధించిన కేసులో అరెస్టు కావడంతో జైలులోనే కొనసాగుతున్నారు. 2023లో అమృత్‌పాల్, ఆయన అనుచరులు కత్తులు, తుపాకులతో అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి తమ సహచరుడిని విడిపించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి.

అక్రమ ఆయుధాల స్వాధీనం, పోలీసుల బారికేడ్లను ధ్వంసం చేయడం, ఓ సిక్కు కార్యకర్త హత్యతో సంబంధం ఉన్నట్లు కూడా పంజాబ్ పోలీసులు ఆయనపై ఆరోపణలు చేశారు. ఇటీవల నవంబర్ 21న తన నానమ్మ చరణ్ కౌర్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అమృత్‌పాల్‌కు మూడు గంటల కస్టడీ పెరోల్ లభించింది. తన స్వగ్రామమైన జల్లుపూర్ ఖేరాలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు అనుమతించలేదు. అయినప్పటికీ, అక్కడికి వచ్చిన ప్రజలకు చేతులు జోడించి అభివాదం చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. 
అమృత్‌పాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ పార్టీ తరఫున ముందుకొస్తున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలవాలనే లక్ష్యంతో భగవంత్ మాన్‌తో ప్రత్యక్ష పోటీకి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు కూటమి చర్చల్లో పాల్గొన్న వర్గాలు తెలిపాయి. అమృత్‌పాల్ కార్యకలాపాలపై భగవంత్ మాన్ గతంలో పలుమార్లు విమర్శలు చేశారు. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అడ్డుపెట్టుకుని అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించిన వారిని పంజాబ్ వారసులుగా పిలవలేమని వ్యాఖ్యానించారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అమృత్‌పాల్‌పై ఆరోపణలు చేశారు.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను ఆప్ 92 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 18, శిరోమణి అకాలీ దళ్‌కు 3, బీజేపీకి 2 స్థానాలు దక్కాయి. ఈసారి అమృత్‌పాల్ పార్టీ కొన్ని అకాలీ దళ్ వర్గాలతో పాటు మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీతోనూ మూడో కూటమి ఏర్పాటుపై చర్చలు జరుపుతోంది. బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ మధ్య ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ పొత్తు కుదరడంతో పంజాబ్ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో 2027 ఎన్నికల్లో అమృత్‌పాల్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారా? ధురిలో భగవంత్ మాన్‌తో తలపడతారా? ఆయన పార్టీ మూడో కూటమిని ఏర్పాటు చేయగలుగుతుందా? అన్న అంశాలు పంజాబ్ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement