రానున్న 2027–28 కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో యువత గొంతుకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి ‘జెన్‌జీ ’ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పట్టణ ప్రాంతాల్లో సరసమైన గృహవసతి కోసం అద్దె ఇళ్ల (రెంటల్ హౌసింగ్) వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు ఉపాధి కల్పన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నైపుణ్యాభివృద్ధిపై యువత తమ అభిప్రాయాలను స్పష్టంగా ముందుంచారు.
సుమారు రెండు గంటల ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న 22 మంది యువ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో సహా వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, యువ నిపుణులు ఇందులో భాగస్వాములయ్యారు. పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది మహిళలే ఉండటం విశేషం.
నగరాల్లో నివసిస్తున్న యువత,ఉద్యోగులకు సరసమైన ధరల్లో నివాసాలు అందుబాటులోకి రావాలంటే అద్దె గృహాల రంగాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని ‘జెన్-జీ’ ప్రతినిధులు నొక్కిచెప్పారు. ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన అంశంగా చర్చకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ రంగాల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని యువత కోరారు. ప్రస్తుతం వెల్లడైన అంశాలు వాటాదారుల నుంచి వచ్చిన సూచనలు మాత్రమేనని, వీటిపై ఇంకా తుది విధాన నిర్ణయాలు తీసుకోలేదని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్థికవేత్తలు, పరిశ్రమలు, బ్యాంకింగ్, స్టార్టప్‌లు, కార్మిక సంఘాలు, వివిధ రంగాల ప్రతినిధులతో చర్చల అనంతరం బడ్జెట్ రూపకల్పన తుది దశకు చేరుతుంది. సాధారణ సంప్రదాయం ప్రకారం, ఆర్థిక సర్వే జనవరి చివరి వారంలో (జనవరి 29 లేదా 31) సభ ముందుకు వచ్చే అవకాశం ఉండగా, 2027–28 కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2027న ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.


