వివాహ వ్యవస్థ భద్రమేనా? | Indian Marriage System Family Values | Sakshi
Sakshi News home page

వివాహ వ్యవస్థ భద్రమేనా?

Nov 27 2026 8:33 AM | Updated on Nov 27 2026 8:33 AM

Indian Marriage System Family Values

భారతీయ సంస్కృతిలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే ఒప్పందం కాదు; రెండు కుటుంబాలను, రెండు జీవితాలను కలిపే పవిత్రమైన బంధం. సుఖ దుఃఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం, బాధ్యతలను పంచుకోవడం, కుటుంబ విలువ లను తరువాతి తరాలకు అందించడం వివాహ వ్యవస్థలోని ముఖ్య ఉద్దేశాలు.

అయితే ఆధునిక జీవనశైలి, వ్యక్తిగత ఆకాంక్షలు, మారుతున్న సామాజిక విలువల ప్రభావంతో వివాహ బంధం పట్ల నిబద్ధత తగ్గుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నచిన్న అభిప్రాయ భేదాలకే సహనం కోల్పోవడం, సమస్యలను చర్చించుకుని పరిష్కరించు కోకుండా విడాకుల వైపు వెళ్లడం, సహజీవనాన్ని వివాహానికి ప్రత్యామ్నాయంగా భావించడం వంటి పరిణామాలు... కుటుంబ వ్యవస్థకు కొత్త సవాళ్లుగా మారుతున్నాయి.

2011 జనగణన ప్రకారం 15–49 సంవత్సరాల వయసున్న మహిళల్లో సుమారు ఒక శాతం మంది విడా కులు పొందినవారు లేదా భర్త నుంచి విడిగా జీవిస్తున్న వారు ఉండగా, 2024 నమూనా నమోదు వ్యవస్థ (ఎస్‌ఆర్‌ఎస్‌) ప్రకారం వితంతువులు, విడాకులు పొందినవారు, విడిగా జీవిస్తున్నవారు జనాభాలో 3.5 శాతం.

భారతదేశంలో విడాకుల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా కనిపిస్తున్నంత మాత్రాన ఇక్కడి వివాహ బంధాలన్నీ సుస్థిరంగా ఉన్నాయని భావించడం సరికాదు. బంధాలు విచ్ఛిన్నం కావడానికి పరస్పర అవగాహన లోపం, సంభాషణ తగ్గిపోవడం, ఆర్థిక సమస్యలు, గృహహింస, కట్న వేధింపులు వంటి అనేక కారణాలున్నాయి. విడాకులు మహిళల ఆర్థిక భద్రత, సామాజిక స్థితిపై ప్రభావం చూపడంతో పాటు పిల్లల భావోద్వేగ వికాసాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు, సెలబ్రిటీల వివాహాలు, విడాకులు విస్తృత చర్చకు వస్తూ ఉన్నాయి. వారిని ఆదర్శంగా భావించే యువతపై ఈ చర్చల ప్రభావం పడే అవ కాశం ఉంది. విడిపోవడాన్ని సాధారణ పరిణామంగా చిత్రీకరించడం యువతలో వివాహ వ్యవస్థ పట్ల అపోహలు కలిగించవచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తూనే కుటుంబ బాధ్యతల పట్ల గౌరవం కలిగి ఉండటం అవసరం.

వివాహ వ్యవస్థను పరిరక్షించుకోవడానికి పాత సంప్రదాయాలలోని ప్రేమ, విశ్వాసం, ఓర్పు, పరస్పర గౌరవం, బాధ్యత వంటి విలువలను ఆధునిక జీవన విధానంలోనూ ఆచరించాలి. వివాహానికి ముందు యువతకు దాంపత్య జీవితం, భావోద్వేగ పరిపక్వతపై అవగాహన కల్పించాలి.

వివాహానంతరం సమస్యలు తలెత్తినప్పుడు విడాకులే మొదటి పరిష్కారం కాకుండా పరస్పర చర్చలు, కుటుంబ కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలి. వివాహం అంటే ఒకరినొకరు జీవితాంతం భరించడం కాదు; ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ఎదగడం. వ్యక్తిగత స్వేచ్ఛకు, కుటుంబ బాధ్యతకు మధ్య సమతుల్యత సాధించినప్పుడే భారతీయ వివాహ వ్యవస్థ తన పవిత్రతను నిలబెట్టుకోగలదు.
– ఏటూరి శేఖర్‌ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి

ఇదీ చదవండి: అసలైన జర్నలిస్టు ఎవరు? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement