మీరు చిన్నప్పుడు మొదటిసారి ఎక్కిన చెట్టు ఏది? మీరు మొదటగా ఊయల ఊగిన చెట్టు కొమ్మ ఏది? ఏ చెట్టు నీడలో మీ ఆటలన్నీ సాగాయి? ఏ చెట్టు కాయను తెంపి మీ బెస్ట్‌ఫ్రెండ్‌కు ఇచ్చారు? ఇంటిలో అమ్మ మధ్యాహ్నపు ఎండలో ఏ చెట్టు ఛాయలో మంచం వాల్చుకు కునుకు తీసేది? ఏ చెట్టును నాన్న ఇష్టంగా పెంచితే మీ ఇల్లు ‘ఫలానా చెట్టువారి ఇల్లు’గా పిలువబడేది?
చెట్లు మనకు గత జన్మ విషయాలు అయ్యాయి. చెట్లు మన ముంగిలిని, పెరళ్లను ఖాళీ చేసి మనల్ని కాందిశీకులని చేశాయి. చెట్లు తమ ఆకుల గలగలలను, కొమ్మల విసనకర్రలను, తొలికారు పూత లను, వాలే పిట్టలను, సువాసనలు వెదజల్లే పువ్వులను, తియ్యటి ఫలాలను మనకు లేకుండా చేసి, అందుకు మనం యోగ్యులం కామని తలచి దూరం దూరం జరుగుతూ చాలా దూరం వెళ్లిపోయాయి.
మన పిల్లలకు తాటిచెట్లు తెలియదు.
తాటి ఆకుల పచ్చదనపు వాసన పీల్చి ఎరగరు. ఈత చెట్లూ వాటి ఎర్ర, నల్ల కాయలు తిని ఎరగరు. పంతులుగారి ఇంట్లో అంతెత్తున పెరిగిన వెలగచెట్టును వాళ్లు చూడరుగాక చూడరు. రావిచెట్టు వీధిన ఉంటే గాలికి దాని ఆకులు చేసే గోలకు దొంగలు ఆ వైపుకు రారని పిల్లలకు ఎవరు చెప్పాలి? గోడ అవతల పక్కింట్లో ఉసిరి చెట్టుకు కాసిన గుత్తుల గుత్తుల కాయలను తేరిపారా చూడటమే భాగ్యమని తెలుసా? చిటారు కొమ్మన తియ్య జామకాయను ఆకుతో పాటుగా దోటీతో కోసి తింటే ఆ రుచికి కోకాపేటలో ఎకరా కొరగానొస్తుందా?
అశోకుడు చెట్లు నాటించెను. మనం పీకించెను. మానవ జాతిని సిమెంటు మహమ్మారి పట్టుకుంది. ముంగిలి సిమెంట్... పెరడు సిమెంట్... ఊరు సిమెంట్... వాడ సిమెంట్... సిమెంట్ ఉన్నచోట చెట్టు ఉండదు. మట్టి మన కాళ్లకు అంటకూడదు అనుకున్ననాడే మనం చెట్టు గొంతు మీద కాలు పెట్టాము. గుర్తు చేసుకోండి ఇరవై ముప్పై ఏళ్ల వెనక్కు వెళ్లి.
పెరట్లో చిక్కుడు పాదు ఉండేదా? మందారం ఎదిగి ఉండేదా? రోజా పూలు టీచర్లకు ఇచ్చీ ఇచ్చీ అలసి పోయేంతగా పూచేదా? సపోటా చెట్టు ఒరే... నా కాయలు కోసి మగ్గేసుకు తినండ్రా అనేదా? వాకిలిలో సన్నజాజుల చెట్టు సాయంత్రమైతే తెల్ల నక్షత్రాలతో సింగారించుకునేదా? నందివర్ధనాలో నూరు వరహాలో ముచ్చట మూట గట్టేవా? కుండీలు కూడా మానవజాతికి శత్రువులే. చెట్లను నేలకు దూరం చేసి వాటిని జైల్లో వేయొచ్చని తప్పుడుదారి పట్టించాయి.
‘చెట్టు గురించి మీకు ఏం గుర్తుంది?’ అని రచయితలను అడిగిన ప్రశ్న ఇదిగో 50 కథలు 520 పేజీల పుస్తకం అయ్యింది. అశ్రువులో ఆనందబాష్పాలో తుడుచుకుంటూ రచయితలు పోటా పోటీగా రాసిన కథలు ‘చెట్టు కథలు 50’. ఒకరు నల్లతుమ్మను తలుచుకుంటే, ఒకరు పనస చెట్టు. ఒకరిది బాదం చెట్టు కథ. మరొకరిది వేపచెట్టుకు పసుపూ కుంకుమ రాసే కథ. సంపెంగ చెప్పే కథ కావాలా? ఉంది. పారిజాతాల కథా ఉంది. జీడి మామిడి, కానుగ, సీతాఫలం... ఒక్కో చెట్టుదీ ఒక్కో కథ. అందరూ తీసి పారేసే కరివేపాకు ఒక కుటుంబాన్ని నిలబెట్టగలదు తెలుసా? ఉంది ఆ కథ.
‘చెట్టు కథలు 50’ తెలుగువారి బతికిన క్షణాలకు గుర్తు. పచ్చటి పెరళ్ల జ్ఞాపకం. రావిశాస్త్రి, చాగంటి సోమయాజులు నుంచి యండమూరి, మల్లాదితో సహా, నేటి యువ రచయితల వరకూ అందరూ రాసిన కథలు ఇవి.
ఈ సంకలనంతో కథకులు తమ బాకీ తీర్చుకున్నారు. ఇక చెట్లు పెంచడం గురించి, మన ప్రాదేశిక చెట్లు... ఏ చెట్లయితే ఈ నేల మీద కనిపించాలో కచ్చితంగా అవే చెట్లు పెరగడం గురించి పాఠకులూ... సమాజం చేయవలసిన పనే మిగిలింది.
– మహమ్మద్ ఖదీర్‌బాబు, ఎడిటర్, చెట్టు కథలు 50 (‘చెట్టు కథలు 50’ ఆవిష్కరణ నేడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో)
ఇదీ చదవండి: ఇంటర్మీడియట్ విద్య అసలు లక్ష్యం


