జర్నలిస్టులపై పోలీసుల దాడి కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న
నిరసనల కవరేజీలో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రక్షణ
‘స్వయం ప్రకటిత’ విలేకరులకు అది ఉండకపోవచ్చునంటూ వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: నిరసన ప్రదర్శనలను కవర్ చేసే సమయంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన(అక్రెడిటెడ్) జర్నలిస్టులకు లభించే రక్షణ, ‘స్వయం ప్రకటిత’ జర్నలిస్టులకు ఉండకపోవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పత్రికా స్వేచ్ఛను కాపాడుతూనే, శాంతిభద్రతల పరిరక్షణతో దాన్ని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలనే డిమాండ్‌తో అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు బలవంతంగా తరలించడంపై కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కేయూడబ్ల్యూజే), నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా, ఫ్రీ స్పీచ్ కలెక్టివ్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనల ధర్మాసనం విచారణ జరిపింది.
ప్రభుత్వం గుర్తింపు కలగిన జర్నలిస్టులు, తమను తాము జర్నలిస్టులుగా ప్రకటించుకునే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, ’రీల్–మేకర్స్’కు మధ్య తేడాను, వీరికి లభించే రాజ్యాంగపరమైన రక్షణలకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.
సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించారన్న పిటిషనర్లు
నిరసనల కవరేజీలో ఉండగా తమపై పోలీసులు దాడి చేసి, అక్రమంగా నిర్బంధించారని, గుర్తింపు కార్డులను చూపెట్టినా వదల్లేదని పిటిషనర్లు ఆరోపించారు. ఈ ఏడుగురు జర్నలిస్టులు చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే నియమించిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి విచారణ కమిటీకి ధర్మాసనం అప్పగించింది.
పిటిషనర్లుగా ఉన్న సుహైల్ మహ్మద్, వీఎస్ రాహుల్ (24 న్యూస్), సజిన్ (ఏషియా నెట్ న్యూస్), రోష్ని రాజన్ (రిపోర్టర్ టీవీ), విష్ణుప్రసాద్ (మాతృభూమి), మిజి పి. జోస్ (మనోరమ న్యూస్), స్వతంత్ర విలేకరి ఫర్సానాలను ఈ కమిటీకి ఆధారాలను అందజేయాలని ఆదేశించింది. వృత్తిపరమైన విధులు నిర్వర్తించే జర్నలిస్టులను అడ్డుకోవద్దని అక్టోబర్ 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఉల్లంఘించారని పిటిషనర్లు ఆరోపించారు. వీరు ఆ సమయంలో ప్రదర్శనల కవరేజీలో ఉన్నారా? వీరిపై బలప్రయోగం జరిగిందా? ఒకవేళ జరిగితే, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన దానికి మించి పోలీసులు బలప్రయోగం చేశారా? అనే అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని ధర్మాసనం పేర్కొంది.
పోలీసుల వాదన ఇదే
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు, రీల్స్ చేసే వారికి అక్రెడిటెడ్ జర్నలిస్టులతో సమానమైన రక్షణ వర్తించదని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే సుప్రీంలో అఫిడవిట్ వేశారు. నిజమైన జర్నలిస్టుల విధులకు తాము ఎన్నడూ ఆటంకం కలిగించలేదని, కంటెంట్ క్రియేటర్లకు కోర్టు మినహాయింపులు వర్తించవని అందులో పేర్కొన్నారు.
ధర్మాసనం ఏమన్నదంటే..
‘అసలు జర్నలిస్టుగా ఎవరిని పరిగణించాలి? వారికి లభించే రక్షణను వృత్తిపరమైన గుర్తింపు(అక్రిడిటేషన్) లేదా మీడియా సంస్థతో ఉన్న అనుబంధం ఆధారంగా నిర్ణయించాలా? నిరసనలను కవర్ చేసేటప్పుడు శాంతిభద్రతల విభాగాల (పోలీసుల) విషయంలో జర్నలిస్టులకు ఏవైనా ప్రత్యేక హక్కులు, మినహాయింపులు ఉంటాయా? నిరసన స్థలం నుంచి ఒక జర్నలిస్టును బలవంతంగా బయటకు పంపడం, అదుపులోకి తీసుకోవడం కస్టడీ కిందకు వస్తుందా? దాని రాజ్యాంగపరమైన పర్యవసానాలు ఏమిటి? వంటి అంశాలను కూలంకషంగా పరిశీలిస్తామంది.


