మనీలాండరింగ్ కేసులపై సుప్రీం ఆదేశం
2009 నాటి సవరణ రద్దుకు సిఫారసు
పాత పద్ధతిని మళ్లీ తేవాలని కేంద్రానికి సూచన
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసుల విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశం జారీ చేసింది. పీఎంఎల్‌ఏ చట్టం కింద ఆస్తుల జప్తు వ్యవహారాల తుది విచారణలో న్యాయవ్యవస్థకు సంబంధించిన సభ్యుడు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఆస్తుల జప్తు కేసుల్లో తీసుకునే నిర్ణయాలు ఆయా వ్యక్తుల హక్కులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, పారదర్శకత, నిష్పాక్షికత కోసం న్యాయవ్యవస్థకు సంబంధించిన వ్యక్తిని భాగం చేయడం అవసరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
అడ్జుడికేటింగ్ అథారిటీలు జారీచేస్తున్న తాత్కాలిక ఆస్తి జప్తు ఉత్తర్వులు గణనీయంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో కేంద్రం 2009 నాటి సవరణను రద్దు చేసి ఒకరికంటే ఎక్కువ అడ్జుడికేటింగ్ అథారిటీలున్న పాత విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టేందుకు ఆలోచించాలని బెంచ్ సూచించింది. న్యాయ వ్యవస్థకు చెందిన సభ్యుడు లేకుండానే పీఎంఎల్‌ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ ఏకసభ్య ధర్మాసనాలు నిర్వహించిన విచారణలను ఢిల్లీ, కలకత్తా, తెలంగాణ హైకోర్టులు సమరి్థంచగా ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఈ తీర్పునిచ్చింది.
తాత్కాలిక ఆస్తి జప్తు ఉత్తర్వు విచారణ 180 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా పెరిగిపోతున్న కేసుల భారంతో ఇది సాధ్యం కావడం లేదని సుప్రీంకోర్టు గుర్తించింది. 2012 మార్చి 31వ తేదీ నుంచి ఇప్పటివరకూ దాదాపు 3,639 తాత్కాలిక ఆస్తుల జప్తు ఉత్తర్వులు జారీ అయిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ కారణంగా పీఎంఎల్‌ఏలోని సెక్షన్ 8(2), 8(3) కింద ఆస్తుల జప్తును ధ్రువీకరించే లేదా నిర్ధారించే నిర్ణయాలను తీసుకునే ధర్మాసనంలో న్యాయ వ్యవస్థకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నట్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీర్పులో స్పష్టం చేశారు. ఢిల్లీ, కలకత్తా, తెలంగాణ హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులకూ ఈ తాజా తీర్పు వర్తిస్తుందని సుప్రీం స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, దరఖాస్తులన్నింటినీ తాజా మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించింది.


