నెల రోజుల నుంచే సైలెంట్‌గా పద్మవ్యూహానికి పదును పెట్టిన బీజేపీ
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదానికి నలుదిక్కుల నుంచి కాషాయదళం పావులు
సమీకరణాలు కుదిరాకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై నిర్ణయం
ఇప్పటికే మిత్రపక్షాలు, ప్రాంతీయ పార్టీలతో అమిత్ షా చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన బడ్జెట్ సమావేశాల్లో సంఖ్యాబలం లేక వీగిపోయిన మహిళా రిజర్వేషన్, లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ఈసారి ఎలాగైనా ఆమోదింపజేయాలన్న లక్ష్యంతో బీజేపీ తన వ్యూహాలకు పదునుపెట్టి ముందుకు కదిలింది. గత 2 నెలలుగా దీనిపై భారీ కసరత్తు చేస్తూ అన్ని లెక్కలు సరిచూసుకుని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం సిద్ధమైంది. బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండో వంతు మెజారిటీ కోసం నలువైపులా పావులు కదిపిన బీజేపీ.. మిత్రపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టాకే ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రత్యేక సమావేశాలపై నిర్ణయం తీసుకున్నట్లు భోగట్టా.
మెజార్టీ లెక్కలు చూసుకున్నాకే ?
మహిళా రిజర్వేషన్‌ను 2029 నుంచే అమలు చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మూడింట రెండొంతుల మెజార్టీ సాధించలేక లోక్‌సభలో వీగిపోయింది. ఆనాడు లోక్‌సభలో 543 మందికి గానూ 528 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. బిల్లు ఆమోదానికి అవసరమైన 352 ఓట్లకు 54 ఓట్లు తక్కువగా ఉండటంతో బిల్లు విఫలమైంది. దీంతో మహిళా బిల్లుకు అనుబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది.
తృణమూల్‌ను వీడిని 20 మంది, ఉద్ధవ్‌ఠాక్రే వర్గం నుంచి బయటికొచ్చిన ఆరుగురు శివసేన ఎంపీలు కలిస్తే ఎన్డీఏ బలం 319కి పెరుగుతుంది. 2/3 మెజార్టీ సంఖ్య 360 కోసం ఎన్డీఏకు మరో 41 మంది ఎంపీలు అవసరం. బీజేపీ వర్గాల ప్రకారం ఇటీవల తమిళనాడులో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డీఎంకే కొన్ని అంశాలపై కాంగ్రెస్‌కు భిన్నంగా వ్యవహరించే అవకాశముందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో 22 మంది డీఎంకే ఎంపీలు డీలిమిటేషన్‌కు మద్దతిస్తే ఆ సంఖ్య 341కి పెరుగుతుంది.
తటస్థ పార్టీలు, స్వతంత్రులు, మ రో ఐదుగురు మద్దతు ఇస్తారని తెలుస్తోంది. దీంతో బలం 346కి చేరవచ్చు. ఇక శరద్ పవార్ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లూ ఎన్డీఏకు మద్దతిస్తే బలం 354కు పెరుగుతుంది. సమాజ్‌వాదీ పార్టీ, శివసేన(యూబీటీ), తృణముల్ కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎంపీలనూ తమ వైపునకు తప్పుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు జరిపారని ప్రచారం జరిగింది. మెజారిటీకి సరిపోయే లెక్కలన్నీ సరిపోయాకే బిల్లుపై ముందుకు కదలాలని నిర్ణయించారు.
ఈ బిల్లు కోసమే ప్రత్యేక సెషన్ ?
మహిళా రిజర్వేషన్, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కీలక బిల్లులను ముందుకు తీసుకువచ్చేందుకే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌డీఏ వర్గాలు చెప్తున్నాయి. ఆగస్టు 13న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసినప్పటికీ, రెండు సభలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రొరోగ్ చేయలేదు. సాధారణంగా సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ప్రొరోగేషన్ జరుగుతుంది. అయితే వంద రోజులు దాటినా ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో కీలక బిల్లుల ఆమోదం కోసమే çసమావేశాలు ఆలస్యం చేస్తున్నారని చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది.
ప్రత్యేక సమావేశాలకు సిద్ధం అవుతుందన్న వార్తల నేపథ్యంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఇదివరకే కేంద్రానికి లేఖ రాశారు. ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు తేవడానికి ముందే అఖిలపక్ష భేటీని నిర్వహించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుందంటూ వస్తున్న ఆరోపణలను గతంలో అమిత్ షా ఖండించారు. ఈ బిల్లుతో దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగకపోగా, సభలో ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని అమిత్ షా చెప్పారు. ప్రస్తుతం 543 మంది సభ్యులున్న సభలో ఆంధ్రప్రదేశ్‌కు 25 లోక్‌సభ స్థానాలు(4.60 శాతం ప్రాతినిధ్యం) ఉన్నాయి.
డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 50 శాతం మేర పెరిగి 38కి చేరుకుంటుందని, సభలో ఏపీ ప్రాతినిధ్యం 4.65 శాతానికి పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు 17 సీట్లు (3.13 శాతం ప్రాతినిధ్యం) ఉండగా, భవిష్యత్తులో అవి 26 స్థానాలకు పెరుగుతాయని, సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 3.18 శాతానికి చేరుకుంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 129 సీట్లు ఉన్నాయని, ఇది సభలో 23.76 శాతమని అమిత్ షా గుర్తుచేశారు. పునర్విభజన తర్వాత దక్షిణాది ఎంపీల సంఖ్య 129 నుంచి 195కి చేరుకుంటుందని పేర్కొన్నారు. దీంతో సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా దాదాపు 24 శాతం పెరుగుతుందని, అలాంటప్పుడు దక్షిణాదికి అన్యాయం జరిగిందనే ప్రశ్నే తలెత్తదని ఆయన తేల్చిచెప్పారు.


