సోమవారం లోక్‌సభ సమావేశాలు ఆరంభం.. డిసెంబర్ 2న రాజ్యసభ మొదలు
డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం
ప్రతిష్టాత్మక బిల్లుల ఆమోదమే లక్ష్యంగా ఉభయ సభల సమావేశం
ఏప్రిల్‌లో చవిచూసిన ఓటమికి బదులు తీర్చుకునేందుకు సిద్ధమైన బీజేపీ సర్కార్
నేడు కేబినెట్ ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: వంద రోజులు గడిచినా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా ముగిశాయని అధికారిక ప్రకటన (ప్రోరోగ్) చేయకుండా అందర్నీ ఉత్కంఠకు గురిచేసిన మోదీ సర్కార్ తమ వ్యూహాన్ని ఎట్టకేలకు అమల్లోకి తెస్తోంది. కేవలం నాలుగు రోజులపాటే కొనసాగేలా పార్లమెంట్ ఉభయసభలను అత్యవసరంగా ప్రత్యేకంగా నవంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు ఎన్‌డీఏ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తిచేసేందుకు ఉభయ సభలను సమావేశపరుస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు వెల్లడించారు. సోమవారం లోక్‌సభ, బుధవారం (డిసెంబర్ 2న) రాజ్యసభ సమావేశాలు ఆరంభించాలని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లను కోరామని మంత్రి పేర్కొన్నారు. లోక్‌సభ నవంబర్ 30, డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో, రాజ్యసభ డిసెంబర్ రెండు, మూడు తేదీల్లో సమావేశం కానుంది. మూడో తేదీన ఇరుసభల సమావేశాలు ముగిసే ఆస్కారముందని మంత్రి ‘ఎక్స్’లో తెలిపారు.
ఎన్ని బిల్లులపై చర్చిస్తారో?
ఈసారి సమావేశాల్లో ఏయే బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారనే విషయాన్ని మంత్రి బహిర్గతం చేయలేదు. కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్లు, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులను ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలనే కృతనిశ్చయంతో, పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అయితే డీలిమిటేషన్‌తో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ప్రత్యేకంగా చర్చించేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సేవాతీర్‌్థలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుండటంతో ఏ బిల్లులు ఉభయసభల ముందు రానున్నాయో ఇప్పటికే విపక్ష పార్టీల్లో ఒక స్పష్టత వచ్చింది. నారీశక్తికి న్యాయం జరక్కుండా ఏ శక్తీ ఆపలేదు అని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే మహిళా రిజర్వేషన్ల విషయంలో అత్యంత వేగంగా పరిణామాలు జరగడం గమనార్హం.
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదింపజేసేందుకు ఏప్రిల్‌లో ప్రభుత్వం చేసిన ప్రయత్నం లోక్‌సభ సాక్షిగా విఫలమవడం తెల్సిందే. ఈ ఓటమికి బదులు తీర్చుకునేందుకు పక్కా ప్రణాళికతో ప్రభుత్వం సమాయత్తమైందని తెలుస్తోంది. 540 మంది సభ్యులున్న లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించాలంటే కనీసం 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఎన్‌డీఏకు సొంతంగా 293 మంది సభ్యుల బలముంది.
వీళ్లకు ఎన్సీపీఐ, శివసేన, అకాలీదళ్, స్వతంత్రులు ఇలా 32 మంది సభ్యుల మద్దతు తోడవడంతో బలం 325కు పెరిగే వీలుంది. ఎన్‌డీఏ కూటమిలో లేని డీఎంకే(22), ఎన్సీపీ(ఎప్పీ)(8) ఎంపీలను తమ వైపునకు తిప్పుకుంటే ఎన్‌డీఏ బలం 355కు పెరగొచ్చు. మేజిక్ నంబర్ అయిన 360కోసం మరో ఐదుగురు ఎంపీల మద్దతు అవసముంటుంది. పూర్తి సన్నద్ధతతో ఆ ఐదుగురి మద్దతునూ కూడగట్టి బిల్లుల గండం నుంచి విజయవంతంగా గట్టెక్కాలని కమలనాథులు చేస్తున్న కృషి ఏ మేరకు ఫలిస్తుందోనని అన్ని రాజకీయ వర్గాలు తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నాయి.
అయితే హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో విపక్షాలకు పదునైన విమర్శలను ఉభయసభల వేదికగా ప్రయోగించేందుకు అవకాశం చిక్కింది. అక్రమాలకు చిరునామాగా తయారైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వేపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఎస్‌ఐఆర్ వివాదానికి కేంద్రబిందువైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలన్న డిమాండ్లతో ఉభయసభలు హోరెత్తిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.
లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్‌తో తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల వాటా విషయంలో ప్రస్తుతం ఉన్న 1971 జనాభా లెక్కల ఆధారిత నిష్పత్తినే కొనసాగించాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
రిజర్వేషన్ బిల్లులో మార్పులు!
నేడు జరిగే కేబినెట్ భేటీలో మహిళా రిజర్వేషన్ బిల్లులో కొన్ని చిన్నపాటి మార్పులు చేర్పులపై చర్చ జరగనుందని తెలుస్తోంది. కీలకమైన భేటీ కావడంతో కేబినెట్ మంత్రులంతా సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే మోదీ ఆదేశాలు జారీచేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 543గా ఉన్న లోక్‌సభ సీట్లను 850కి పెంచడానికి సంబంధించిన బిల్లుపైనా కేబినెట్ చర్చించే ఆస్కారముంది.


