న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలను తిరిగి సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు నిర్వహించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు కేంద్రం విజ్ఞప్తి చేసింది. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించారు.
ఈ సమావేశాలపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ప్రకటన చేశారు. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలను బట్టి డిసెంబర్ 3 నాటికి ఉభయ సభల సమావేశాలు ముగిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. లోక్‌సభ రెండు రోజుల పాటు, ఆ తర్వాత రాజ్యసభ మరో రెండు రోజుల పాటు సమావేశమయ్యే అవకాశం ఉంది.
నియోజకవర్గాల పునర్విభజన?
మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా చట్టాలు తీసుకురానుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించే రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన విధానంలో మార్పులు తీసుకురావాలనే ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం 2023లోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే, జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసేలా కేంద్రం గతంలో పునర్విభజన చట్టాన్ని ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనల్లో భాగంగా తీసుకొచ్చిన రాజ్యాంగం (131వ సవరణ) బిల్లు-2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో వీగిపోయింది. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని ప్రభుత్వం సాధించలేకపోయింది. దీంతో దానికి అనుబంధంగా ఉన్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను సభ ముందుకు తీసుకురావద్దని ప్రభుత్వం స్పీకర్‌ను కోరింది.
మరోవైపు, ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలకు ఇప్పటివరకు అధికారికంగా ముగింపు పలకలేదు. 100 రోజులకు పైగా ఈ పరిస్థితి కొనసాగడం కూడా పార్లమెంట్‌ను ఎప్పుడైనా తిరిగి సమావేశపరిచే అవకాశం ఉందనే చర్చలకు కారణమైంది.
అయితే, నవంబర్ 30 నుంచి జరగనున్న సమావేశాల్లో ఏయే బిల్లులను ప్రవేశపెడతారనే విషయాన్ని కేంద్రం ఇంకా వెల్లడించలేదు. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల కోసమే సభలను తిరిగి సమావేశపరుస్తున్నట్లు కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. దీంతో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.


