చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులైన పురుషులకు 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది. భార్య ప్రసవించే సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు వివాహితులైన పురుష ఉద్యోగులు ఈ సెలవులను వినియోగించుకోవచ్చు.
ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. బిడ్డ పుట్టడానికి 15 రోజుల ముందుగానీ, ప్రసవం జరిగిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు గానీ ఈ సెలవులు తీసుకోవచ్చు. పురుష ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పితృత్వ సెలవులు ప్రవేశపెట్టాలంటూ వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.
బిడ్డ జననం చుట్టూ ఉండే సమయం తల్లికి, శిశువుకు ఎంతో కీలకమని ప్రభుత్వం పేర్కొంది. ఈ సమయంలో కుటుంబ బాధ్యతలను భార్యాభర్తలు ఇద్దరూ పంచుకోవడం అవసరమని అభిప్రాయపడింది. తండ్రి కూడా శిశువు సంరక్షణలో చురుగ్గా భాగస్వామి కావడానికి పితృత్వ సెలవులు దోహదపడతాయని తెలిపింది.
మహిళా ఉద్యోగులకు 365 రోజులు సెలవులు
మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న 365 రోజుల ప్రసూతి సెలవులు మాతృత్వానికి, శిశు సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. ఇదే విధంగా పురుష ఉద్యోగులకు పితృత్వ సెలవులు కల్పించడం ద్వారా కుటుంబ బాధ్యతల్లో సమతుల్యత సాధించవచ్చని వివరించింది.
ఇదిలా ఉంటే.. గత ఆగస్టులో మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవుల వ్యవధిని 12 వారాల నుంచి 365 రోజులకు పెంచుతున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో తొలుత 90 రోజులుగా ఉన్న ప్రసూతి సెలవులను 2011లో ఆరు నెలలకు పెంచారు. 2016లో తొమ్మిది నెలలకు, 2021 జులైలో ఏడాదికి అంటే 365 రోజులకు పొడిగించారు. అప్పట్లో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి.
అయితే, సాధారణ అర్హత నిబంధనల ప్రకారం ఇద్దరి కంటే తక్కువ మంది జీవించి ఉన్న పిల్లలున్న మహిళా రెగ్యులర్ ఉద్యోగులకే 365 రోజుల ప్రసూతి సెలవుల ప్రయోజనం వర్తిస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జీవించి ఉన్న పిల్లలున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఆదేశాలు, తదనంతరం రాష్ట్ర సవరణల ప్రకారం పూర్తి వేతనంతో 12 వారాల ప్రసూతి సెలవులు లభిస్తాయి.


