విన్‌ఫాస్ట్‌ ఈ–టూవీలర్లు వచ్చేస్తున్నాయ్‌  | Vietnam VinFast plans to enter India electric two-wheeler market | Sakshi
Sakshi News home page

విన్‌ఫాస్ట్‌ ఈ–టూవీలర్లు వచ్చేస్తున్నాయ్‌ 

Nov 26 2026 4:48 AM | Updated on Nov 26 2026 4:48 AM

Vietnam VinFast plans to enter India electric two-wheeler market

2027 ప్రథమార్థంలో రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విడుదల 

తూత్తుకుడి ప్లాంట్‌లోనే తయారీ 

ఏటా రెండు కొత్త కార్ల ఆవిష్కరణ 

భారత్‌లో 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం

న్యూఢిల్లీ: వియత్నాంకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం విన్‌ఫాస్ట్‌ భారత ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్లో వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 2027లో దేశీయ ఈ–టూవీలర్‌ విభాగంలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. వీటిని తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్‌లోనే తయారు చేయనుంది. 

తద్వారా 2030 నాటికి భారత ఈవీ మార్కెట్లో గణనీయమైన వాటాను దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విన్‌ఫాస్ట్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. ‘‘భారత్‌లో ఎలక్ట్రిక్‌ టూవీలర్ల విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ–టూవీలర్‌ మార్కెట్‌పై అధ్యయనం చేస్తున్నాము. తొలుత ఒకసారి ఛార్జ్‌ చేస్తే కనీస రేంజ్‌ ఇచ్చే బ్యాటరీ ఆధారిత స్కూటర్లను ప్రవేశపెట్టనున్నాము. వీటిలో బ్యాటరీ స్వాపింగ్‌ సదుపాయం కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వాహనాల ట్రయల్స్‌ తుది దశలో ఉన్నాయి. వివిధ నగరాల్లో డీలర్‌íÙప్‌ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాము’’ అని విన్‌ఫాస్ట్‌ ఇండియా (టూ–వీలర్స్‌) మార్కెట్‌ సీఈవో అనురాగ్‌ సక్సేనా తెలిపారు. 

2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ప్రణాళికలు  
భారత్‌లో స్థానిక విడిభాగాల వినియోగాన్ని (లోకలైజేషన్‌) ప్రస్తుత 15 శాతం నుంచి రెట్టింపు చేయాలని విన్‌ఫాస్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. మాతృసంస్థ విన్‌గ్రూప్‌ ఇప్పటివరకు భారత్‌లో 500 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టగా, ఛార్జింగ్‌ స్టేషన్లు సహా వివిధ రంగాల్లో మొత్తం 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను సిద్ధం చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

ఇందులో భాగంగా విన్‌గ్రూప్‌ అనుబంధ సంస్థ ‘వీ–గ్రీన్‌’ దేశవ్యాప్తంగా ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు 2029 వరకు ఉచిత ఛార్జింగ్‌ సదుపాయం, దీర్ఘకాలిక బ్యాటరీ గ్యారెంటీతో పాటు రిజి్రస్టేషన్‌ గడువు ముగిసిన తర్వాత పాత వాహనాలను వెనక్కి తీసుకునే (బైబ్యాక్‌) వ్యూహాన్ని ద్విచక్ర వాహనాలకూ వర్తింపజేయనున్నట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్‌ విస్తరణ కోసం తమిళనాడు ప్రభుత్వంతో మరో 500 ఎకరాల భూసేకరణ ఒప్పందాన్ని కూడా విన్‌ఫాస్ట్‌ ఇటీవలే కుదుర్చుకుంది.  

కాంపాక్ట్‌ ఎస్‌యూవీలపై దృష్టి.. 
కాంపాక్ట్‌ ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు మరో రెండు బ్యాటరీ ఆధారిత కార్లను కూడా భారత్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ‘‘భారత్‌లో ఏటా కనీసం రెండు కొత్త కార్లను విడుదల చేయాలనే ప్రణాళికతో ఉన్నాము. తొలిసారి కారు కొనుగోలు చేసే వారి అభిరుచులు మారుతున్నాయి. 

1,000 సీసీ సామర్థ్యం గల ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ల కంటే, కాస్త శక్తిమంతమైన కాంపాక్ట్‌ ఎస్‌యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా వచ్చే ఏడాది (2027) ప్రారంభంలోనే ‘వీఎఫ్‌ 5’ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నాము. తద్వారా తూత్తుకుడి ప్లాంట్‌ పూర్తిస్థాయి సామర్థ్యమైన ఏటా 50,000 యూనిట్ల ఉత్పత్తిని చేరుకుంటాము’’ అని విన్‌ఫాస్ట్‌ ఆసియా (ఫోర్‌–వీలర్‌ విభాగం) సీఈవో తపన్‌ ఘోష్‌ చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement