1400 ఏళ్లు జీవించగలరా మానవులు..?! | Humans Could Live For 1,400 Years: Nick Bostrom | Sakshi
Sakshi News home page

1400 ఏళ్లు జీవించగలరా మానవులు..?! ప్రొఫెసర్ నిక్ బోస్ట్రోమ్ షాకింగ్‌ వ్యాఖ్యలు

Nov 25 2026 6:23 PM | Updated on Nov 25 2026 6:29 PM

Humans Could Live For 1,400 Years: Nick Bostrom

స్వీడన్‌కు చెందిన తత్వవేత్త, ఆక్స్‌ఫర్డ్ మాజీ ప్రొఫెసర్ నిక్ బోస్ట్రోమ్ మానవుని ఆయుర్దాయంపై షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో మనుషులు 1400 ఏళ్ల వరకు జీవించగలరని బాంబు పేల్చారు. ఎందుకంటే సూపర్‌ ఇంటెలిజెంట్‌ ఏఐ(కృత్రిమ మేధస్సు) అది సాధ్య చేయగలదని ధీమాగా చెప్పారు. ఈ ఏఐ వైద్య రంగంలో చక్కటి పురోగతిని వేగవంత చేయగలదని, అది మానవులకు వృద్ధాప్యాన్ని జయించడంలో సహాయం చేయలగలదంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. 

అంతేగాదు ఈ సూపర్‌ ఇంటెలిజెంట్ ఏఐని విజయవంతంగా అభివృద్ధి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ  ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన ఇలా అన్నారు. ఒక వేళ మానవులకు వృద్ధాప్యం రాకపోతే అత్యంత వృద్ధ మానవుడి వయసు కంటే 11 రెట్లు ఎక్కువ కాలం జీవించగలరని చెప్పారు. 

ఇదేలా సాధ్యం..
శాస్త్రవేత్తలు వృద్ధాప్యం అనే జీవ ప్రక్రియను తొలగించగలిగితే, వయసు పెరగడంతో ముడిపడి ఉన్న మరణ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఇదంతా గణిత పరంగా తిరుగుతుందని చెప్పారు. అంటే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి వార్షిక మరణ ప్రమాదాన్ని ఆధారంగా చేసుకుని చెబుతారట. అంటే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి నిర్దిష్ట ఏళ్లలో మరణించే గణాంక సంభావ్యతను తీసుకుని వృద్ధాప్యాని నిరోధిస్తే కచ్చితంగా 1400 ఏళ్లు జీవించగలరని పేర్కొన్నారు. 

అంటే ఇక్కడ ఆరోగ్యకరమైన వ్యక్తి అంటే చక్కటి జీవనశైలిని అనుసరించే వ్యక్తి ఆయఃప్రమాణాన్ని అనుసరించి ఏ వయసులో వృద్ధాప్యం దరిచేరి మరణ ప్రమాదాన్ని పెంచుతుందో లెక్కించి..కృత్రిమ మేధ సాయంతో వృద్ధాప్యానికి చెక్‌ట్టి ఆయుర్దాయం పెంచడం అన్నమాట. 

ఆయన ఉద్దేశ్యం ఏంటంటే.. 
ఆయన పరిశోధన ప్రకారం..ఏఐ శాస్త్రవేత్తలకు పలు వ్యాధులను నయం చేయడంలో సహాయపడగలదని అన్నారు. ఇది వైద్యరంగంలో విపరీతమైన పురోగతిని తీసుకొచ్చేలా వేగవంతం చేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.  అంటే ఏఐ మనుషులను అమరులను చేసే మాత్ర కనుగొనగలదని చెప్పడం లేదని నొక్కి చెప్పారు. 

తగినంత ఆధునాతన ఏఐ వ్యవస్థ పరిశోధకులకు సంక్లిష్టమైన జీవ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి, సంభావ్య చికిత్సలను గుర్తించడానికి, అనుకరణలను (సిమ్యులేషన్స్) నిర్వహించడానికి లేదా ఏళ్లుగా పట్టే ప్రయోగాలను వేగవంతం చేయగలదని చెప్పడమే తన ముఖ్యోద్దేశమని అన్నారు. 

అలాగే వృద్ధాప్యం అంటే కేవలం ముడతలు లేదా నెరిసిన జుట్టు మాత్రమే కాదని ఇందులో కణ, అణు స్థాయిలో మార్పులు ఉంటాయని అన్నారు. అంటే పేరుకుపోయిన నష్టం, క్షీణిస్తున్న కణజాల పనితీరు, వ్యాధులకు గురయ్యే అవకాశం పెరగడం వంటివి నెమ్మదింప చేసే పరిశోధనలు ఇప్పటికే జరుగుతున్నాయని అన్నారు. అలాంటి వాటిల్లో ఈ ఏఐ సమర్థవంతంగా ఉపయోగపడటమే గాక వృద్ధాప్యానికి చెక్‌పెట్టి మరణప్రమాదాన్ని తగ్గించగలదని మాత్రమే చెబుతున్నానని అన్నారు. 

అయితే సూపర్‌ఇంటెలిజెంట్‌ ఏఐ వైద్య ఆవిష్కరణలకు సహాయం చేసినా..అవి ఎంత వరకు ప్రయోజనకరం అనేది కూడా బేరీజు వేసుకోవాలని లేదంటే నష్టాలు తప్పవని కూడా హెచ్చరించారు. కాగా, ఇంతవరకు మానవ వృద్ధాప్యాన్ని ఆపగల నిర్ధారిత చికిత్స ఏదీ లేదని, అలాగే బోస్ట్రోమ్ చెప్పినట్లు ప్రస్తుత ఏఐ వ్యవస్థలు ఆ స్థాయిలో ఆవిష్కరణలు అందించగలవనే ఆధారాలు కూడా లేవని అంటున్నారు పలువురు నిపుణులు.

 

ఇదీ చదవండి: చదువురాని ఇంట పుట్టిన శాస్త్రవేత్త..! ఏకంగా రక్త ప్రవాహ గణితాన్నే శాసిస్తోంది!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement