అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా అత్యాధునిక ఏఐ చిప్స్ చైనాకు చేరాయని యూఎస్ జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ జే క్లేటన్ వెల్లడించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఎన్విడియా సంస్థకు చెందిన కీలక చిప్స్ అక్రమ తరలింపుపై అమెరికా దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ జరుపుతున్నాయి.
2024 నుంచే నిఘా
ఈ వ్యవహారంలో సింగపూర్ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ ‘మెగాస్పీడ్’ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సున్నితమైన సెమీకండక్టర్ సాంకేతికత మళ్లింపుపై అనుమానాలతో అమెరికా వాణిజ్య శాఖ 2024లోనే ఈ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది. 2025 మేలో ఎన్విడియా విక్రయాల వివరాలను కోరగా జూన్‌లో ఎన్విడియా మెగాస్పీడ్‌ను నో సెల్ జాబితాలో చేర్చింది. బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ(బీఐఎస్) సింగపూర్ అధికారులతో కలిసి మెగాస్పీడ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి అప్పటి సీఈఓ ఆలిస్ హువాంగ్‌ను విచారించింది. అనంతరం నేరపూరిత కోణంలో న్యాయశాఖ దర్యాప్తు చేపట్టింది.
జే క్లేటన్ కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో జే క్లేటన్ మాట్లాడుతూ.. ఎన్విడియా చిప్స్ కోసం కొందరు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఇప్పటికే కొన్ని కంపెనీలపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే ఆలిస్ హువాంగ్‌కు చైనా నిఘా సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇంకా తుది నిర్ధారణకు రాలేదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఇటీవల బీఐఎస్ కఠిన నిబంధనలు విడుదల చేసింది. విదేశీ డేటా సెంటర్లలో సర్వర్ల ద్వారా కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అద్దెకు తీసుకుని ఆంక్షలను అధిగమించే విధానాలకు అడ్డుకట్ట వేసింది. మరోవైపు ఎన్విడియా బోర్డు సుజాన్ నోరా జాన్సన్ అధ్యక్షతన ఎగుమతి నియంత్రణల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఆరోపణలు నిరూపితమయ్యే వరకు ఎవరినీ దోషులుగా పరిగణించలేమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: రెండో పాలసీ ఉందని జీవిత బీమా తిరస్కరణ!


