చిప్‌ల స్మగ్లింగ్‌ సూత్రధారి లీ మింగ్‌!  | Alice Huang Secret NVIDIA Chip Exports To China Exposed | Sakshi
Sakshi News home page

చిప్‌ల స్మగ్లింగ్‌ సూత్రధారి లీ మింగ్‌! 

Nov 23 2026 3:40 AM | Updated on Nov 23 2026 3:40 AM

Alice Huang Secret NVIDIA Chip Exports To China Exposed

ఎన్విడియా వ్యవహారంలో తెరముందు అలిస్‌ హువాంగ్‌.. తెరవెనుక చైనా వ్యాపారవేత్త  

అమెరికా ఆంక్షలను ఉల్లంఘించి చైనాకు చిప్‌ల చేరవేత  

‘ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’కథనం 

లీ మింగ్‌పై కేసు నమోదు  

న్యూయార్క్‌: సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్‌ కంపెనీ నుంచి చైనాకు కృత్రిమ మేధ(ఏఐ) చిప్‌ల సరఫరా వెనుక అసలు సూత్రధారి అలిస్‌ హువాంగ్‌ కాదని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ (డబ్ల్యూఎస్‌జే) వెల్లడించింది. తెర వెనుక చైనా వ్యాపారవేత్త లీ మింగ్‌(52) ఈ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నాడని తాజాగా నివేదించింది. చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌తో అలిస్‌ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ కారణం వల్లనే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆమెకు చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అమెరికా నిఘా అధికారులు అనుమానిస్తున్నారు. నిజానికి ఏఐ చిప్‌లను చైనాకు విక్రయించకుండా అమెరికా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అయినప్పటికీ దొంగచాటుగా చిప్‌ల సరఫరా జరుగుతూనే ఉంది. 

అమెరికా ఆంక్షలను ఉల్లంఘించి, ఎన్విడియా చిప్‌లను చైనాకు మళ్లించడంలో పాలుపంచుకున్న కంపెనీల నెట్‌వర్క్‌ను లీ మింగ్‌ నడిపినట్లు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది. మెగాస్పీడ్‌ కంపెనీలో అలిస్‌ హువాంగ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవిలో ఉన్నప్పటికీ, లీ మింగ్‌ కీలకమైన వ్యాపార నిర్ణయాలతో సహా ఆ సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. అతడికి ఎన్విడియా చిప్‌లను విక్రయించే ఇతర కంపెనీలతో కూడా సంబంధాలు ఉన్నాయి. 

అమెరికా సరఫరాదారులను దగా చేసి..  
ఎన్విడియా ఆధారిత కంప్యూటర్‌ సర్వర్లను ఇతర దేశాలకు మళ్లించారనే ఆరోపణలపై గత ఏడాది ఫిబ్రవరిలో సింగపూర్‌లో లీ మింగ్‌పై కేసు నమోదు చేశారు. అభియోగ పత్రాల్లో అనేక కంపెనీల పేర్లు ఉన్నప్పటికీ, వాటిలో మెగాస్పీడ్‌ పేరు లేదు. సింగపూర్‌ ప్రాసిక్యూటర్ల ప్రకారం.. ఎన్విడియా ఏఐ చిప్‌లతో కూడిన సర్వర్లు తమ సింగపూర్‌ కంపెనీ వాడుకోవడం కోసం ఉద్దేశించినవని లీ అమెరికా సరఫరాదారులను నమ్మించి మోసం చేశాడు. ఆ పరికరాలను పొరుగున ఉన్న మలేషియాకు రవాణా చేసి, ఆ తర్వాత మూడో దేశానికి పంపించాడు. లీ మింగ్‌ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు.

 సింగపూర్‌లో చైనా రాయబార కార్యాలయం సమీపంలో ఉన్న ఒక విలాసవంతమైన విల్లాలో నివసిస్తున్నట్లు సమాచారం. లీ మింగ్‌కు అలిస్‌ హువాంగ్, ఆమె భర్త కాంగ్‌ వెయ్‌లతో చాలాకాలంగా వ్యాపార సంబంధాలు ఉన్నాయని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక వెల్లడించింది. చైనాకు అధునాతన ఎన్విడియా చిప్‌ల ఎగుమతులపై జో బైడెన్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించిన తరువాత, ఆ ముగ్గురూ చైనా వినియోగదారులకు అధునాతన కంప్యూటింగ్‌ సామర్థ్యాలను అందించడానికి ఆగ్నేయాసియా అంతటా వ్యాపారాల నెట్‌వర్క్‌ను నిర్మించడం ప్రారంభించారు.  

అలిస్‌ హువాంగ్‌తో తన వివాహేతర సంబంధంపై విచారణ పెరుగుతున్న నేపథ్యంలో జెన్సన్‌ హువాంగ్‌ ఎన్విడియా అధ్యక్షుడు, సీఈఓ, బోర్డు సభ్యత్వ పదవులకు రాజీనామా చేసిన కొద్ది రోజులకే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, ఎగుమతిపై ఆంక్షలున్నప్పటికీ బిలియన్ల డాలర్ల విలువైన ఎన్విడియా ఏఐ చిప్‌లను మెగాస్పీడ్‌ సంస్థ చైనాకు మళ్లించిందనే అనుమానంతో అమెరికా, సింగపూర్‌ అధికారులు ఆ సంస్థపై దర్యాప్తు చేస్తున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, వర్తించే ఎగుమతి నియంత్రణ నిబంధనలను పాటిస్తున్నామని మెగాస్పీడ్‌ వివరణ ఇచ్చింది. వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రకారం.. మెగాస్పీడ్‌ కంపెనీ మలేషియాలోని డేటా సెంటర్ల ద్వారా చైనా టెక్నాలజీ దిగ్గజం అలీబాబాకు కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని సరఫరా చేయగా, కొన్ని ఎన్విడియా ఆధారిత సర్వర్లను చైనాకు రవాణా చేసింది.  

చిప్‌ల పరిశ్రమపై చైనా గూఢచార సంస్థ నిఘా  
అధునాతన సెమీకండక్టర్‌ చిప్‌లను సంపాదించడం, ప్రపంచ చిప్‌ పరి శ్రమపై నిఘా పెట్టడంపై చైనా గూఢచార సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తాజాగా ఒక నివేదికలో స్పష్టంచేసింది. చిప్‌ల విషయంలో పశ్చిమ దేశాల ఆంక్షలను అధిగమించడానికి కనీసం రెండేళ్లుగా ఒక ప్రచారాన్ని నిర్వహిస్తోందని తెలిపింది. సెమీకండక్టర్‌ రంగం, దాని సప్లై చైన్లపై నిఘా సమాచారాన్ని సేకరించడంతోపాటు చైనా కంపెనీల కొసం అధునాతన చిప్‌లను కొనుగోలు చేయడానికి, అక్రమ రవాణాకు సహకరించడానికి చైనా భద్రతా మంత్రిత్వ శాఖ(ఎంఎస్‌ఎస్‌) చెన్‌ యిక్సిన్‌ నేతృత్వంలో ఒక వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసిందని ఆసియా, అమెరికా, యూరప్‌లకు చెందిన ప్రస్తుత, మాజీ భద్రతా, నిఘా అధికారులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. 

సాంకేతిక రంగంలో స్వావలంబనను సాధించాలని, అమెరికా, దాని మిత్రదేశాలు విధించిన ఆంక్షలను అధిగమించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆరాట పడుతున్నారు. తన ప్రయత్నాల్లో భాగంగా ఎంఎస్‌ఎస్‌ను రంగంలోకి దించినట్లు ప్రచారం సాగుతోంది. 2022 చివరిలో చైనా భద్రతా మంత్రి అయిన చెన్‌ పాశ్చాత్య దేశాల ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే తమ ముఖ్యమైన బాధ్యత అని తేల్చిచెప్పారు. ఏప్రిల్‌లో ఆయన సాంకేతిక దిగ్బంధనాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆవిష్కరణ, పారిశ్రామిక అభివృద్ధి, అనువర్తనాలను(అప్లికేషన్లు) ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement