లక్నో: మానవ నైపుణ్యాలను కృత్రిమ మేధ(ఏఐ) భర్తీ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు ఏఐ గురించి చాలా చర్చ జరుగుతున్నప్పటికీ నైపుణ్యాలున్న వ్యక్తి జీవనోపాధిని ఎవరూ లాక్కోలేరని చెప్పారు. శనివారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్టాన్‌లో ఐదో జాతీయ నైపుణ్య స్నాతకోత్సవ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.
స్వాతంత్య్రానికి పూర్వం ఆక్రమణదారులు భారతదేశ సంప్రదాయ నైపుణ్య మౌలిక సదుపాయాలను దెబ్బతీసి, సంప్రదాయ హస్తకళలను లక్ష్యంగా చేసుకున్నారని గుర్తుచేశారు. బ్రిటిష్ వారు మన దేశంలో గుమస్తాలను తయారు చేయడానికి అవసరమైన విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఆక్రమణదారులు మన దేశంలోకి అడుగుపెట్టినప్పుడు మొదటి దాడి మన నైపుణ్యాలపైనే జరిగిందన్నారు.
భారతీయుల చేతివృత్తుల నైపుణ్యమే దేశాన్ని గొప్పగా, సుసంపన్నంగా తీర్చిదిద్దుతోందని ఆక్రమణదారులకు తెలుసని చెప్పారు అందుకే చేతివృత్తుల వారి బొటనవేళ్లను నరికేసి, వృత్తులను నాశనం చేయాలని చూశారని పేర్కొన్నారు. కాలం మారుతోందని, ప్రపంచ నైపుణ్య రాజధానిగా మారే దిశగా భారత్ ప్రయాణం సాగిస్తోందని ప్రధానమంత్రి వెల్లడించారు.
నైపుణ్యం కలిగిన వారిని గౌరవిస్తేనే పురోగమనం
భారతదేశం ఎల్లప్పుడూ నైపుణ్యాలను గౌరవించే దేశమని మోదీ వెల్లడించారు. లక్నోలోని చికంకారీ పనిని ప్రస్తావించారు. చాలాకాలం పాటు ప్రపంచంలో భారతదేశానికి ఇలాంటి నైపుణ్యాలతోనే గుర్తింపు లభించిందన్నారు.
‘‘నాణ్యమైన మస్లిన్, బనారసీ, కాంచీపురం పట్టు, కశ్మీరీ పష్మినా, పత్తి వ్రస్తాల నుంచి కలంకారీ వరకు, ప్రపంచంలోని అత్యుత్తమ కత్తులను తయారు చేయడానికి ఉపయోగించే ఉక్కు నుంచి కంచు మరియు పంచధాతువు శిల్పాల వరకు.. లెక్కలేనన్ని కళలు మన దేశంలో ఉండేవి’’అని తెలియజేశారు.
కృత్రిమ మే«థ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోదీ సూచించారు. నైపుణ్యాలు ఉన్నవారికి కచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇండ్రస్టియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల(ఐటీఐ) విద్యార్థులకు కూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యార్థులకు లభించే గౌరవమే దక్కాల ని తేల్చిచెప్పారు. ఐఐటీ అయినా, ఐటీఐ అయినా.. తన దృష్టిలో విద్యార్థులే దేశానికి సంపద, బలం, భవిష్యత్తు అని స్పష్టంచేశారు.
ప్రజలు నా మాట మన్నించారు.. అందుకే బంగారం ధర తగ్గింది
ప్రజలు తన మాట మన్నించి, బంగారం కొనడం తగ్గించారని, దానివల్ల నేడు బంగారం ధరలు తగ్గాయని ప్రధాని మోదీ చెప్పారు. తాము బంగారం కొనకపోవడం వల్ల తమ డబ్బు ఆదా అయ్యిందని ప్రజలు తనతో చెబుతున్నారని పేర్కొన్నారు. ‘‘దేశ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేశాను. అవసరం లేకపోతే, కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనకండి అని చెప్పాను.
1965లో తీవ్ర ఆహార కొరత ఏర్పడినప్పుడు అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలను ఒక పూట భోజనం మానేయమని కోరారు. అప్పట్లో దేశ ప్రజలు శాస్త్రి పిలుపును పాటించారు. నా దేశం ఇప్పటికీ అదే స్వభావాన్ని కలిగి ఉంది. నాలాంటి ఒక సాధారణ వ్యక్తి బంగారాన్ని తక్కువగా కొనమని కోరితే, దేశ ప్రజలు తక్కువగా కొన్నారు. దాంతో బంగారు ధరలు తగ్గాయి. డబ్బు అదా అయ్యిందని వారు నాతో చెబుతున్నారు’’అని మోదీ స్పష్టంచేశారు.


