పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ.. కేంద్రం వ్యూహమేంటి? | Political Suspense On Parliament Special Session | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ.. కేంద్రం వ్యూహమేంటి?

Nov 21 2026 11:17 AM | Updated on Nov 21 2026 11:17 AM

Political Suspense On Parliament Special Session

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణపై దేశ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారికంగా తేదీలను ప్రకటించలేదు. మరోవైపు ఆగస్టు 13న వాయిదా పడిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా ప్రొరోగ్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. శనివారానికి పార్లమెంట్‌ వాయిదా పడి 100 రోజులకు చేరుకుంది.

సాధారణంగా కొత్త పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలంటే 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా ఉంచిన నేపథ్యంలో, అదే సమావేశాలను తిరిగి కొనసాగించేందుకు కనీసం రెండు రోజుల నోటీసుతోనే సభను నిర్వహించే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగానే కేంద్రం ప్రత్యేక సమావేశాలపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది.

54 ఓట్ల తేడాతో గతంలో బిల్లు వీగింపు
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం గత ఏప్రిల్‌లో పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. అయితే లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందలేదు. ప్రస్తుతం 543 మంది సభ్యుల లోక్‌సభలో మూడు ఖాళీలు ఉండటంతో రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ 361 ఓట్లుగా ఉంది.

850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు?
2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్రం కొత్త ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాలను గరిష్ఠంగా 850 వరకు పెంచే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుత స్థానాల సంఖ్యను 50 శాతం మేర పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెల్లడించాయి. అయితే దీనిపై తుది నిర్ణయం వెలువడలేదు.

అఖిలపక్ష సమావేశం పెట్టాలంటున్న విపక్షాలు
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై తమతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత లోక్‌సభలోని 543 స్థానాల సంఖ్యను మరో 25 సంవత్సరాల పాటు కొనసాగించాలని, రాష్ట్రాల మధ్య ప్రస్తుత స్థానాల నిష్పత్తిని కాపాడాలని విపక్షాలు కోరుతున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మెజారిటీ సాధిస్తామన్న ధీమా!
మరోవైపు గతంలో బిల్లు వీగిపోయినప్పటికీ, ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అవసరమైన 361 ఓట్లకు అదనంగా 15 నుంచి 18 ఓట్లు సాధించగలమనే ధీమాతో ఉన్నట్లు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను తగ్గించేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం చొప్పున లోక్‌సభ స్థానాలను పెంచే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ అమలు, డీలిమిటేషన్, లోక్‌సభ స్థానాల పెంపు అంశాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారాయి. కేంద్రం ప్రత్యేక సమావేశాల తేదీలను ఎప్పుడు ప్రకటిస్తుంది? విపక్షాలను సంప్రదిస్తుందా? దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు ఎలాంటి పరిష్కారం చూపుతుంది? అన్న అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇదీ చదవండి: బీజేపీకి ఊహించని షాక్‌.. కాంగ్రెస్‌ భారీ విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement