సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి పథంలో నడిచిన తెలంగాణ గ్రామాలు కాంగ్రెస్ పాలనలో నిధుల కొరతతో నీరసించిపోయాయని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
తన వాదనకు మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన 'ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్' నివేదికను కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ గ్రామ పంచాయతీలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.16.59 లక్షలు ఖర్చు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024-25లో ఆ మొత్తం రూ.6.24 లక్షలకు పడిపోయిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి వ్యయం గణనీయంగా తగ్గిందని విమర్శించారు.
ప్రజలు చెల్లించే పన్నులు, ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పుల నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పించారు. నిధులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు కాకపోతే ప్రజలకు ప్రయోజనం ఏముంటుందని నిలదీశారు. రేవంత్ రెడ్డి పాలనలో పల్లె నుంచి పట్నం వరకు ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, విధ్వంసమే జరుగుతోందని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా మారిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కేసీఆర్ గారి హయాంలో అభివృద్ధి పథంలో నడిచిన తెలంగాణ గ్రామాలు ఇవ్వాళ కాంగ్రెస్ అరాచక పాలనలో నిధులు లేక నీరసించిపోయాయి. ఈ మాట చెబుతున్నది మేము కాదు. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన "ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయతి రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్" అనే రిపోర్టులో తెలంగాణ గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో సగటున రూ. 16.59 లక్షల నిధులు వ్యయం చేయగా, అది కాంగ్రెస్ పాలనలో 2024-25 సంవత్సరంలో కేవలం రూ. 6.24 లక్షలకు పడిపోయింది అని పేర్కొంది. ప్రజలు కట్టిన పన్నులు, తెస్తున్న లక్షల కోట్ల అప్పులు అన్నీ కాంగ్రెస్ హై కమాండ్, రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బొక్కేస్తుంటే ఇక అభివృద్ధికి, సంక్షేమానికి ఎక్కడ మిగులుతాయి? రేవంత్ రెడ్డి పాలనలో పల్లె నుండి పట్నం వరకూ ఎక్కడా అభివృద్ధి లేదు. జరుగుతున్నదంతా విధ్వంసమే. #CongressFailedTelangana
— KTR (@KTRBRS) November 21, 2026
ఇదీ చదవండి: సోర్స్ మారితే కొత్త ప్రాజెక్టే కదా?


