సోర్స్‌ మారితే కొత్త ప్రాజెక్టే కదా? | Brijesh Kumar Tribunal restricts redistribution of Krishna water only between TS | Sakshi
Sakshi News home page

సోర్స్‌ మారితే కొత్త ప్రాజెక్టే కదా?

Nov 21 2026 5:52 AM | Updated on Nov 21 2026 5:52 AM

 Brijesh Kumar Tribunal restricts redistribution of Krishna water only between TS

నీటి కేటాయింపులు లేకుండా ‘పాలమూరు–రంగారెడ్డి’ని ఎలా చేపట్టారు? 

అనుమతులు లేకుండా పనులు ఎలా కొనసాగిస్తున్నారు 

కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణకు బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ప్రశ్నలు 

నీటి కేటాయింపులు పెరుగుతాయన్న ఆశతో ప్రాజెక్టు చేపట్టామన్న తెలంగాణ

సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నీటి కేటాయింపులు లేకుండా ఎలా చేపట్టారని.. అపెక్స్‌ కమిటీ సహా కేంద్ర జలసంఘం అనుమతి లేకుండానే నిర్మాణ పనులు ఎలా కొనసాగిస్తున్నారని బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జూరాల నుంచి నీటి సోర్స్‌ను శ్రీశైలానికి మార్చడంపై పలు ప్రశ్నలు సంధించింది. సోర్స్‌ మారినప్పుడు దాన్ని కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తారని పేర్కొంది. తీసుకునే నీటి పరిమాణం, ఆయకట్టు మారితే కొత్తగా అన్ని అనుమతులు అవసరమని స్పష్టం చేసింది.

కృష్ణా జలాల కేటాయింపులపై వరుసగా శుక్రవారం మూడో రోజూ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, ప్రాజెక్టు అవసరాన్ని తెలంగాణ తరఫు న్యాయవాది కేఎస్‌ వైద్యనాథన్‌ ట్రిబ్యునల్‌ ముందుకు తెచ్చారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ పలు ప్రశ్నలు సంధించారు. అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టిందంటూ ఏపీని దోషిగా చూపుతూ అలాంటి తప్పులనే ఎందుకు చేస్తున్నారని.. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టును ఎందుకు చేపట్టారని.. 2017లో నిర్మాణం చేపడితే.. ఇంత ఆలస్యంగా నీటి కేటాయింపులు కోరుతున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

కేటాయింపులు పెరుగుతాయన్న ఆశతోనే... 
ట్రిబ్యునల్‌ ప్రశ్నలకు వైద్యనాథన్‌ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ‘తెలంగాణలో ఉన్న పరీవాహక ప్రాంతం, ఆయకట్టు, అవసరాలు ఏ లెక్కన చూసినా తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా పెరగాలి. కచి్చతంగా వాటా పెరుగుతుందన్న ఆశతో ప్రాజెక్టును చేపట్టాం. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమం కోసం ప్రాజెక్టులను నిర్మిస్తుంది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర సైతం ముందుగా ప్రాజెక్టులు నిర్మించి ఆ తర్వాత నీటి వాటాలను సాధించుకున్నాయి.

అదే తరహాలో పాలమూరు–రంగారెడ్డిని చేపట్టాం. దీని ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లివ్వాలని సంకల్పించాం. అదీగాక బచావత్‌ పాత అవార్డు ప్రకారం గంపగుత్తగా కేటాయించిన నీటిని వాడుకొనేలాగానే పాలమూరును డిజైన్‌ చేశాం. ఇప్పుడు కొత్తగా వాటాలు దక్కితే వాటిని వినియోగిస్తాం, ఏపీ ప్రభుత్వం బేసిన్‌లో లేని ప్రాంతాలకు కృష్ణా నీటిని తరలించేలా ప్రాజెక్టులు చేపట్టింది.

కాల్వల సామర్థ్యం పెంచుతూ రిజర్వాయర్లను నిర్మించింది. కానీ మేం బేసిన్‌ అవసరాలను తీర్చేందుకు బేసిన్‌ పరిధిలోనే పాలమూరు ప్రాజెక్టు చేపట్టాం’అని వైద్యనాథన్‌ చెప్పారు. ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల అంశం ట్రిబ్యునల్‌ పరిధిలో ఉన్నందున అది తేలే వరకు డీపీఆర్‌కు ఆమోదం తెలపలేమని కేంద్ర జల సంఘం అంటోందని దృష్టికి తెచ్చారు.  

ఎస్‌ఆర్‌బీసీకి నికర జలాలు.. ఎస్‌ఎల్‌బీసీకి మిగులు జలాలా? 
శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌బీసీ) పూర్తిగా కృష్ణా బేసిన్‌ వెలుపల ఉన్న ప్రాజెక్టు అని తెలంగాణ వాదించింది. కేసీ కెనాల్‌ నుంచి ఆదా అయ్యే 8 టీఎంసీలతోపాటు తిరిగి నదిలోకి చేరే జలాల్లో 11 టీఎంసీలను ఎస్‌ఆర్‌బీసీకి కేటాయించడాన్ని సవాల్‌ చేసింది. తెలంగాణలోని కరవుపీడిత ప్రాంతాలకు సాగునీరు అందించే ఎస్‌ఎల్‌బీసీకి మాత్రం మిగులు జలాలనే పరిమితం చేశారని పేర్కొంది. ఇది సరికాదని అభ్యంతరం తెలిపింది. తెలంగాణలోని అంతర్గత బేసిన్‌ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. వాటి ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎస్‌ఆర్‌బీసీకి నికర జలాలు కేటాయించరాదని ట్రైబ్యునల్‌ను తెలంగాణ కోరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement