ఢిల్లీకి సంచులు మోయడంలో పదికి పది మార్కులు ఇవ్వొచ్చు
హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలోనూ ఇవ్వొచ్చు
అప్పట్లో బ్యాగులు తీసుకెళ్లే స్థాయి నుంచి ఇప్పుడు ఢిల్లీకి సంచులు మోసుకెళ్లే స్థాయికి రేవంత్ ఎదిగారు
ఏబీపీ సదరన్ రైజింగ్–2026 సదస్సులో కేటీఆర్
2015లో ఒక ఎమ్మెల్యేకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి రేవంత్ అడ్డంగా పట్టుబడ్డారు
ఈ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది
రేవంత్‌రెడ్డి వన్‌టైమ్ వండర్ లీడర్.. 2028లో బీఆర్‌ఎస్‌దే విజయం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి సంచులు మోయడంలో, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పదికి పది మార్కులు ఇవ్వొచ్చని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనల సంఖ్యను బట్టి, అక్కడికి ఎన్ని సంచులు మోసుకెళ్లారనే అంశాన్ని బట్టి కూడా పదికి పది మార్కులు ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు.
2015లో ఓటుకు నోటు కేసులో ఒక ఎమ్మెల్యేకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా పట్టుబడ్డారని, ఈ వ్యవహారంలో ఫోరెన్సిక్, పత్రాలతో కూడిన ఆధారాలు ఉన్నాయని, కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో విచారణలో ఉందని గుర్తుచేశారు. అప్పట్లో బ్యాగులు తీసుకెళ్లే స్థాయి నుంచి ఇప్పుడు ఢిల్లీకి సంచులు మోసుకెళ్లే స్థాయికి రేవంత్ ఎదిగారని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్–2026 సదస్సులో ఆయన మాట్లాడారు.
రాహుల్‌కు ఏటీఎం కార్డుల్లా రేవంత్, డీకే
‘రాహుల్‌గాంధీ జేబులో రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్ అనే రెండు ఏటీఎం కార్డులు ఉన్నాయి. ఈ రెండు కార్డుల గడువు 2028లో ముగుస్తుంది. ఆ ఏడాది డిసెంబర్‌లో రేవంత్ ప్రభుత్వం ఎక్స్‌పైర్ అవుతుంది. రేవంత్‌రెడ్డి వన్‌టైమ్ వండర్ లీడర్. 2028 తర్వాత ఆయన రాజకీయంగా కనిపించరు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సమాజంలోని ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అమిత్ షా.. మరో షా వచ్చినా తెలంగాణ బాద్‌షా కేసీఆరే..’అని కేటీఆర్ అన్నారు.
తిట్లు, కేసులు, కమిషన్లతోనే కాలక్షేపం
‘ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి వెయ్యి రోజులు దాటినా అమలు చేయడం లేదు. ఆటో డ్రైవర్లు, మహిళలు, ఉద్యోగులను అడిగితే ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుస్తుంది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కేవలం 1.85 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయింది.
కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నాయకులను తిట్టడం, కొత్త కేసులు పెట్టడం, కొత్త కమిషన్లు వేయడంతోనే రేవంత్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.2.8 లక్షల కోట్లు కాగా రేవంత్ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆ నిధులతో ఏం చేశారు? కొత్తగా ప్రారంభించిన ఒక్క పథకమైనా, నిర్మించిన ఒక్క మౌలిక సదుపాయాల ప్రాజెక్టయినా చూపించాలి.
ఇది ‘ఎల్‌కాంగో’ప్రభావం
తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న కరువు పరిస్థితులకు ఎల్‌నినో ప్రభావం కారణం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన ‘ఎల్‌కాంగో’ప్రభావం. రేవంత్‌రెడ్డికి ప్రజా సమస్యల కంటే నేను గడ్డం ఎందుకు పెంచుతునన్న అంశమే పెద్ద సమస్యగా మారింది. ‘హిట్లర్ అభిమాన స్ఫూర్తి ప్రదాత’అని రేవంత్‌రెడ్డి గతంలో బహిరంగంగా ప్రకటించారు. హైడ్రా రాజకీయ ఒత్తిళ్లకు, బ్లాక్‌మెయిలింగ్‌కు, వసూళ్లకు ఉపయోగపడుతోంది.
రాష్ట్రంలో నేరాలు, అవినీతి పెరిగాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల వరకు దోచుకున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా 15 నుంచి 20 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని మరో ఎమ్మెల్యే అనిరు«ద్‌రెడ్డి వ్యాఖ్యానించారు..’అని కేటీఆర్ గుర్తు చేశారు.


