చుక్కా రామయ్య వ్యక్తిత్వం రాజకీయాలకు అతీతం | CM Revanth Reddy Meets Chukka Ramaiah On His 100th Birthday | Sakshi
Sakshi News home page

చుక్కా రామయ్య వ్యక్తిత్వం రాజకీయాలకు అతీతం

Nov 21 2026 4:47 AM | Updated on Nov 21 2026 4:47 AM

CM Revanth Reddy Meets Chukka Ramaiah On His 100th Birthday

చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తదితరులు

ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం 

చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్, నల్లకుంట: ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు చుక్కా రామయ్య వందో జన్మదినోత్సవం తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర విద్యావ్యవస్థకు గొప్ప పర్వదినమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన క్రియాశీల భాగస్వామ్యం చిరస్మరణీయమ ని కొనియాడారు. ఐఐటీ అనే పదాన్ని రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త చుక్కా రామయ్య అని పేర్కొన్నారు.

విద్యావేత్తగానే కాకుండా శాసనమండలి సభ్యుడిగా కూడా తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌ నల్లకుంటలోని రామయ్య నివాసానికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

రాజకీయాలకు అతీతమైన వ్యక్తిత్వం 
చుక్కా రామయ్యతో కలిసి చట్టసభల్లో పనిచేయడం తన అదృష్టమని సీఎం అన్నారు. ఆయనది రాజకీయాలకు అతీతమైన వ్యక్తిత్వమని అభివర్ణించారు. ప్రజా సమస్యలపై పదునైన ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా, వాటి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారని గుర్తుచేశారు.

రాజకీయ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితం కాకుండా చుక్కా రామయ్య తరహాలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాలలు లేని విషయాన్ని అప్పట్లో చుక్కా రామయ్య, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ శాసనమండలిలో ప్రస్తావించారని సీఎం తెలిపారు. ఆ తర్వాతే ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు.

పీవీ నరసింహారావు, జైపాల్‌రెడ్డి, రావి నారాయణరెడ్డి, చుక్కా రామయ్య వంటి మహనీయులు తెలంగాణకు చెందినవారని ప్రజలు గర్వంగా చెప్పుకుంటారని అన్నారు. చుక్కా రామయ్య సమకాలీనుల్లో ఆయనకు సాటి ఎవరూ లేరని, ఆయన వ్యక్తిత్వం ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. చుక్కా రామయ్య మరింత ఆరోగ్యంగా ఉంటూ భావితరాలకు, ప్రజాప్రతినిధులకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. 

తెలంగాణలో శిఖర సమానుడు చుక్కా రామయ్య 
తెలంగాణలో శిఖర సమానుడు చుక్కా రామయ్య అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ప్రశంసించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు చుక్కా రామయ్య ఓ ప్రతీక అని కొనియాడారు. చుక్కా రామయ్య వందో జన్మదినం సందర్భంగా శుక్రవారం చుక్కా రామయ్య నివాసం వద్ద సభ ఏర్పాటు చేశారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన సభకు హాజరైన జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ‘మన చుక్కా రామయ్య వందేళ్ల పండుగ’పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ చుక్కా రామయ్య తన ప్రథమ గురువన్నారు. రామయ్య ఆదర్శ ఉపాధ్యాయుడే కాదు, నిష్కల్మషమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపమని కొనియాడారు. చుక్కా రామయ్య పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే గొప్ప ఉపాధ్యాయుడని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. 1964లో రామయ్య ఫిజిక్స్‌ క్లాస్‌లో కూర్చుని తాను శ్రద్ధగా పాఠాలు వినేవాడినని సీనియర్‌ పాత్రికేయుడు రామచంద్రమూర్తి గుర్తు చేసుకున్నారు. బాసరలో ఐఐటీ స్థాపనకు చుక్కా రామయ్య ఒక కారణమన్నారు.

రామయ్య గురించి మాట్లాడడమంటే.. నూరేళ్ల తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడడమేనని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వ్యాఖ్యానించారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు, జైళ్ల శాఖ ఐజీ సజ్జనర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కోదండరామ్, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సీతారాం, నర్సిరెడ్డి, రచయిత జయధీర్‌ తిరుమల్, మాడభూషి శ్రీధర్, డాక్టర్‌ విజయ ప్రసాద్, డాక్టర్‌ శ్యాంప్రసాద్, ప్రొఫెసర్‌ విజయబాబు, జూలూరి గౌరీశంకర్‌ సహా పలువురు ప్రముఖులు చుక్కా రామయ్య నివాసానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు 
ప్రముఖ విద్యావేత్త, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన చుక్కా రామయ్య శత జన్మదిన వేడుకల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ నల్లకుంటలోని ఆయన నివాసానికి వచ్చి, పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రామయ్య కుమారులు శ్రీనివాస్, అచ్యుత్, కూతుళ్లు ఉమ, రాజేశ్వరి తదితరులతో కేంద్ర మంత్రి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement