కేటీఆర్‌ను పట్టించుకోను.. ఆయనది మేనేజ్‌మెంట్ కోటా
అమిత్ షాకు దమ్ముంటే ఒవైసీపై పోటీ చేయాలి
దక్షిణాది భవిష్యత్తుకు డీలిమిటేషన్ ప్రక్రియ గొడ్డలిపెట్టు
ఏబీపీ న్యూస్ ‘సదరన్ రైజింగ్ సమ్మిట్–2026’లో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్, కేటీఆర్ లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తన రాజకీయ కథలో కేసీఆర్ రావణాసురుడైతే.. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటా నాయకుడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఏబీపీ న్యూస్ నిర్వహించిన ‘సదరన్ రైజింగ్ సమ్మిట్–2026’లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, డీలిమిటేషన్, కాంగ్రెస్ పాలన తదితర అంశాలపై మాట్లాడారు.
ఓట్ల కోసం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మత రాజకీయాలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ మాత్రం కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. అమిత్ షాకు ధైర్యం ఉంటే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని సవాల్ విసిరారు. తెలంగాణలో తమకు ప్రధాన ప్రత్యర్థి బీఆర్‌ఎస్సేనని స్పష్టం చేశారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం ఏ ఒక్క పార్టీకి సంబంధించినది కాదు.
అది దక్షిణ భారతదేశ భవిష్యత్తుతో ముడిపడిన అంశం. నియోజక వర్గాల సంఖ్యను 50 శాతం పెంచితే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం మరింత పెరుగుతుంది. పెంపు అనంతరం మొత్తం 850 స్థానాల్లో ఉత్తరాదికి 650, దక్షిణాదికి సుమారు 195 సీట్లు దక్కే పరిస్థితి ఏర్పడితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దక్షిణాది రాష్ట్రాల అవసరమే లేకుండా పోతుంది.
రాష్ట్రాల జనాభాతోపాటు జీడీపీ, అభివృద్ధి ప్రాతిపదికన 50 శాతం ఫార్ములాను అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ల అమలుకు కొత్త చట్టాలు, రాజ్యాంగ సవరణలు అవసరం లేదు. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 181 సీట్లను మహిళలకు కేటాయించవచ్చు’అని వివరించారు.
మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్
ప్రధాని మోదీ ‘విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్’మారారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన విదేశీ పర్యటనలకు లెక్క లేకుండా పోయిందన్నారు. ‘ఈడీ, సీబీఐ, ఐటీలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓట్ చోర్.. గద్దీ చోర్’నినాదానికి ప్రజల నుంచి భారీ మద్ధతు లభిస్తోంది. మోదీకి ముందు దేశ అప్పులు రూ.53 లక్షల కోట్లు ఉండగా, గత 12 ఏళ్లలోనే అవి రూ.120 లక్షల కోట్లకు చేరాయి. మోదీ ప్రభుత్వం అదానీ వంటి కార్పొరేట్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. కానీ రాష్ట్రంలోని మా ప్రజాప్రభుత్వం పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి నిధులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది’అన్నారు.
నా రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్..
‘కేసీఆర్‌ను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తాను. కానీ కేటీఆర్‌ను అంత సీరియస్‌గా తీసుకోను. తండ్రి అండతో కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో నాయకుడయ్యారు. నా రాజకీయ ప్రస్థానంలో 17 ఏళ్లలోనే వివిధ పదవులు చేపట్టి స్వయంకృíÙతో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నాను. నా రాజకీయ కథలో కేసీఆర్ రావణాసురుడు. గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్‌కు ఇప్పుడు అదే అంశం చుట్టుకుంది.
ప్రతిపక్షం ఉండాలనే ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే బీఆర్‌ఎస్ ను కొనసాగిస్తున్నాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’విధానాన్ని రూపొందించాం. మూడేళ్లలో 65 శాతం ఎన్నికల హామీలను అమలు చేశాం. మిగిలిన వాటిని వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం.
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మారుస్తున్నాం. అంతర్జాతీయ విద్యాసంస్థలు తెలంగాణలో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోదీని కూడా ఆహ్వానించాం. రావాలా? వద్దా? అనేది ఆయన ఇష్టం’అని వ్యాఖ్యానించారు.


