పండుగ వచ్చిందంటే చాలు.. వ్యాయామం, ఆహార నియమాలన్నింటిని పక్కన పెట్టేస్తుంటాం. పిండివంటలు, స్వీట్లతో పాటు ప్రత్యేక వంటకాలన్నీ నోరూరిస్తుంటే పరిమితిని దాటి తినేస్తుంటాం. దీనివల్ల జీర్ణ సమస్యలు, బద్దకం, బరువు పెరగడం వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. అలాగని ఒకేసారి ఆహారాన్ని తగ్గించడం, కఠినమైన వ్యాయామాలు చేయడం కూడా మంచిది కాదు. శరీరానికి అవసరమైన పోషకాలు అందక నీరసం వస్తుంది. అందుకే చిన్నచిన్న మార్పులతో మెల్లగా ప్రారంభించాలి.
దీపావళి సమయంలో నూనెలో వేయించిన పదార్థాలు, స్వీట్లు ఎక్కువగా తీసుకుంటాం. కాబట్టి ముందుగా ఆహారంతోనే మార్పులు మొదలుపెట్టాలి. వీటికి కొద్దిరోజులు దూరంగా ఉంటూ.. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రీటీన్లు అందించే పప్పులు, గుడ్లు, పెరుగు వంటివి చేర్చుకోవాలి. రోజంతా తగినంత నీరు తాగాలి.
వ్యాయామం మళ్లీ ఆరంభించాలి..
పండుగ సమయంలో వ్యాయామానికి విరామం ఇచ్చినవారు మళ్లీ నెమ్మదిగా మొదలుపెట్టాలి. మొదటి రోజూ 20 నుంచి 30 నిమిషాల నడకతో మొదలుపెట్టవచ్చు. యోగా, సైక్లింగ్, ఈత వంటి వాటిని కూడా అలవాటు చేసుకోవచ్చు. ఇప్పటికే వ్యాయామం చేసేవారు తమ శారీరక సామర్థ్యాన్ని బట్టి పాత దినచర్యకు తిరిగి రావాలి. ఒక్కసారిగా ఎక్కువసేపు కఠినమైన వ్యాయామాలు చేయకూడదు.
నిద్రకు ప్రాధాన్యం..
పండుగ సందడి కారణంగా చాలామంది రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతారు. దీంతో నిద్ర వేళలు మారి΄ోతాయి. మళ్లీ నిర్ణీత సమయానికి నిద్ర΄ోవడం అలవాటు చేసుకోవాలి. రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేట్లు ΄్లాన్ చేసుకోవాలి. పడుకునే ముందు ఫోన్ చూడటం తగ్గించాలి. రాత్రి వేళల్లో టీ, కాఫీలు ఎక్కువగా తాగకూడదు.
ఆందోళన వద్దు..
పండుగలో తీసుకున్న ఆహారం వల్ల బరువులో స్వల్ప మార్పులు కనిపించినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉప్పు, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండి బరువు పెరిగినట్లు కనిపించవచ్చు. కాబట్టి వెంటనే బరువు తగ్గాలనే ఆతృత వద్దు. క్రమబద్ధమైన ఆహారం, తగినంత నిద్ర, రోజువారీ వ్యాయామంతో ఆరోగ్యాన్ని తిరిగి మెరుగుపరుచుకోవచ్చు.


