అమెరికాకు ఇజ్రాయెల్ కీలక దూత.. నెతన్యాహు బిగ్‌ ప్లాన్‌? | Israel Mossad chief visits US For Iran Issue | Sakshi
Sakshi News home page

అమెరికాకు ఇజ్రాయెల్ కీలక దూత.. నెతన్యాహు బిగ్‌ ప్లాన్‌?

Nov 14 2026 7:53 AM | Updated on Nov 14 2026 8:08 AM

Israel Mossad chief visits US For Iran Issue

జెరూసలేం: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలకు దిగాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఏకంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ చీఫ్ రోమన్ గోఫ్మన్ రంగంలోకి దిగారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆక్సియోస్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌పై ఇప్పటికిప్పుడు మళ్లీ దాడులు చేయడానికి ట్రంప్ ఆసక్తి చూపడం లేదని, ఆర్థిక ఆంక్షలు, సముద్ర దిగ్బంధనం ద్వారా ఒత్తిడి కొనసాగించాలని భావిస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి.

ఆక్సియోస్ కథనం ప్రకారం.. మొసాద్ డైరెక్టర్ రోమన్ గోఫ్మన్ అమెరికా పర్యటనలో సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌తో సమావేశమయ్యారు. అనంతరం మియామీకి వెళ్లి వైట్‌హౌస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌తోనూ చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలపై మొసాద్, సీఐఏ, వైట్‌హౌస్ అధికారికంగా స్పందించలేదు. నెతన్యాహుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న గోఫ్మన్ పర్యటన ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలు చేపట్టాలని నెతన్యాహు కోరుతుండగా.. ట్రంప్ మాత్రం ప్రస్తుతానికి ఆ ప్రతిపాదనకు సుముఖంగా లేరని తెలుస్తోంది. నవంబర్ 5న ఇరాన్ యుద్ధ పరిస్థితులపై ట్రంప్, నెతన్యాహు ఫోన్‌లో చర్చించినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. ఇరాన్‌పై తక్షణ దాడుల కంటే ఆర్థిక ఒత్తిడి, నౌకాదళ దిగ్బంధనం కొనసాగిస్తూ దౌత్యపరమైన ఒప్పందానికి ప్రయత్నించడమే మంచిదని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.

గల్ప్‌ దేశాల్లో ఆందోళన.. 
ఈ విషయంలో సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా అమెరికా ప్రస్తుత వైఖరికి మద్దతు ఇస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగించాలని, ఇప్పుడే మరోసారి యుద్ధానికి దిగాల్సిన అవసరం లేదని గల్ఫ్ దేశాలు కోరినట్లు ఆయన చెప్పారు. దీంతో ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక విభేదాలు బయటపడుతున్నాయనే చర్చ మొదలైంది.

ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న సస్పెన్స్‌..
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లోనూ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల తర్వాత నెతన్యాహు నేతృత్వంలోని కూటమి పార్లమెంట్‌లో మెజారిటీ కోల్పోయింది. ఆయన ప్రత్యర్థి గాడి ఐసెన్‌కాట్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం పొందారు. అయితే అవసరమైన మెజారిటీని సమీకరించడం ఇంకా సవాలుగానే ఉంది. ఐసెన్‌కాట్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే నెతన్యాహు అధికారం కోల్పోవాల్సి ఉంటుంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌తో మరోసారి యుద్ధాన్ని ప్రారంభించే ప్రయత్నం జరగవచ్చని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆక్సియోస్ పేర్కొంది. యుద్ధ పరిస్థితులను ఉపయోగించుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం జరగవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్‌ ఆచితూచి.. 
గురువారం నెతన్యాహు, ఐసెన్‌కాట్ సుమారు రెండు గంటలపాటు సమావేశమై ఇరాన్ పరిస్థితులపై చర్చించారు. ప్రస్తుతం వెంటనే ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టాల్సిన పరిస్థితి లేదని ఐసెన్‌కాట్ భావిస్తున్నట్లు ఆయనకు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ మార్పు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రధాని చర్యలపై తగిన పర్యవేక్షణ ఉండాలని ఐసెన్‌కాట్ స్పష్టం చేశారు. దేశ భద్రతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని కూడా హెచ్చరించారు. మరోవైపు అమెరికాలోనూ ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. నవంబర్ 3న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఎదురుదెబ్బ తినడంతో ఇరాన్ విషయంలో ట్రంప్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఖతార్ ప్రధానితో సమావేశమైన తర్వాత కూడా ఇరాన్‌పై ప్రస్తుత ఒత్తిడి విధానాన్నే కొనసాగిస్తామని ట్రంప్ సంకేతాలిచ్చారు.

ఇదీ చదవండి: ఓటమి నేర్పిన గుణపాఠం.. ట్రంప్ సంచలన ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement