బ్రిటన్‌లో ఆన్‌లైన్‌లో బాలికలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని.. వారిపై లైంగిక దాడికి పాల్పడిన భారతీయ విద్యార్థికి జైలు శిక్ష విధించారు. పదుల సంఖ్యలో బాలికలను మోసం చేసి.. అసభ్యకర ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన బిలాల్ కాజీ(27)కి బ్రిటన్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉత్తర పశ్చిమ ఇంగ్లండ్‌లోని చెస్టర్ క్రౌన్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన పలు నేరాలను అంగీకరించడంతో ఈ శిక్ష విధించింది.
సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో టీనేజర్‌గా పరిచయం చేసుకుని 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలతో స్నేహం చేసేవాడు. కొంతకాలం వారితో నమ్మకంగా మాట్లాడుతూ ప్రేమ పేరుతో దగ్గరయ్యేవాడు. అనంతరం వారిని లైంగిక చర్యలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంపాలని బలవంతం చేసేవాడు.
బాలికలు తను చెప్పినట్లు అంగీకరించకపోతే గతంలో వారు పంపిన అభ్యంతరకర ఫొటోలు, వీడియోలను వారి స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరించేవాడు. వాటిని బహిర్గతం చేస్తానని భయపెట్టి మళ్లీ తనకు కావాల్సినవి పంపించుకునేవాడు. ఇలా పెద్ద సంఖ్యలో బాలికలను మానసికంగా వేధించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బిలాల్ కాజీ.. అమాయక బాలికలను అత్యంత క్రూరంగా తన వలలో వేసుకుని.. వారిని మానసికంగా నియంత్రించాడని బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) ప్రత్యేక ప్రాసిక్యూటర్ మార్టిన్ మెక్‌రాబ్ తెలిపారు. చెషైర్, వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు సేకరించిన ఆధారాలను సీపీఎస్ ఆర్గనైజ్డ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ విభాగం కోర్టుకు సమర్పించింది. నిందితుడి చర్యలు కారణంగా బాధితులు ఏళ్ల తరబడి భయంతో జీవించారని, వారి బాల్యంలోని కీలకమైన సంవత్సరాలు మానసిక వేదనతో గడిచిపోయాయని పేర్కొన్నారు.
2021లో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
ఈ కేసులో తొలి బాధితురాలు 13 ఏళ్ల వయసులో స్నాప్‌చాట్ ద్వారా బిలాల్ కాజీతో పరిచయం పెంచుకుంది. అతడిని తన వయసున్న టీనేజ్ బాలుడిగా భావించింది. అయితే కొద్దికాలానికే వారి సంభాషణలు అసభ్యకర అంశాల వైపు మళ్లాయి. 2021 జూలైలో అతడితో స్నేహం మాత్రమే కొనసాగించాలని, ఇకపై ఫొటోలు పంపబోనని బాలిక స్పష్టం చేసింది. దీంతో కాజీ ఆమెను దూషిస్తూ.. ఆమె తన సొత్తు అంటూ బెదిరించాడు. గతంలో పంపిన ఫొటోలు, వీడియోలను స్నేహితులకు పంపిస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిన బాలిక అతడికి తలొగ్గి మరిన్ని ఫొటోలు, వీడియోలు పంపించింది.
కొద్దిరోజులకే బాలిక స్నాప్‌చాట్ ఖాతా హ్యాక్ అయింది. ఆమె కాజీకి పంపిన అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు స్నేహితులకు చేరాయి. దీంతో 2021 నవంబర్‌లో డెర్బీషైర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో కాజీ చివరిగా చెస్టర్‌లో నివసించినట్లు తెలియడంతో కేసును చెషైర్ పోలీసులకు బదిలీ చేశారు. అప్పటికే కాజీ బ్రిటన్ విడిచి వెళ్లిపోయాడు. అయితే 2023 జూలైలో తిరిగి బ్రిటన్‌కు వచ్చిన సమయంలో హీత్రో విమానాశ్రయంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తొలి బాధితురాలు చేసిన ఆరోపణలపై విచారించారు.
‘రీజ్’ పేరుతో పరిచయం..
కాజీ.. బాలికలను వలలో వేసుకునేందుకు ఒకే తరహా పద్ధతిని అనుసరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్నాప్‌చాట్, రోబ్లాక్స్, వింక్ వంటి సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్ వేదికల్లో ‘రీజ్’ అనే పేరుతో పరిచయం చేసుకునేవాడు. తాను తెల్లజాతికి చెందిన బ్రిటిష్ టీనేజ్ బాలుడినని నమ్మించేవాడు. గుర్తు తెలియని ఓ బాలుడి ఫొటోలను తనవిగా చూపిస్తూ బాలికలతో సన్నిహితంగా మెలిగేవాడు. కొద్దికాలంలోనే వారిని ప్రేమ పేరుతో నమ్మించి, నిజమైన సంబంధంలో ఉన్నామనే భ్రమ కల్పించేవాడు.
ఇదీ చదవండి: సౌదీ సర్వీసులపై ఎయిరిండియా కీలక ప్రకటన


