వాషింగ్టన్ : అమెరికా లూసియానా రాష్ట్రం, న్యూఆర్లీన్స్ పోర్టు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రసిద్ధ మిస్సిస్సిప్పి నదిపై ప్రయాణికులతో వెళ్తున్న లగ్జరీ రివర్ క్రూయిజ్ నౌకను భారీ ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో క్రూయిజ్ నౌక ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి, పాక్షికంగా నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో నౌకలో సుమారు 130 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
అమెరికన్ క్రూయిజ్ లైన్స్‌కు చెందిన అమెరికన్ హెరిటేజ్ అనే 5 అంతస్తుల లగ్జరీ నౌక, మిస్సిస్సిప్పి నదిపై ప్రయాణికులతో వస్తోంది. అదే సమయంలో అటుగా వస్తున్న భారీ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి ఆ క్రూయిజ్ నౌకను తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన తీరు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. భారీ ఉక్కు నౌకలు రెండూ ఒకదాన్ని ఒకటి వేగంగా ఢీకొన్నప్పుడు వచ్చిన శబ్దం అత్యంత భయానకంగా ఉందని, కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ఆ భారీ నౌక ఒక వైపునకు ఒరిగిపోయి నీటిలో మునిగిపోవడం ప్రారంభమైందని తెలిపారు.
నౌక ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలతో కేకలు వేశారు. కొంతమంది ప్రాణాలను కాపాడుకునేందుకు లైఫ్ జాకెట్లు వేసుకుని నదిలోకి దూకగా, మరికొందరు నౌక రెయిలింగ్స్ పట్టుకుని సహాయం కోసం అర్ధించారు. సమాచారం అందుకున్న వెంటనే యూఎస్ కోస్ట్ గార్డ్, న్యూఆర్లీన్స్ అత్యవసర వైద్య సిబ్బంది , స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళాలు వెంటనే అప్రమత్తమై భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.
నదిలో పడిపోయిన,నౌకలో చిక్కుకున్న ప్రయాణికులను సమీపంలోని ఇతర బోట్ల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రక్షించిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదం తీవ్రత దృష్ట్యా, రెస్క్యూ సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా యూఎస్ కోస్ట్ గార్డ్ మిస్సిస్సిప్పి నదిలోని మైలు మార్కర్లు 93 మరియు 96 మధ్య ప్రాంతంలో అన్ని రకాల నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ట్యాంకర్ నౌక అకస్మాత్తుగా అదుపుతప్పడానికి అసలు కారణం ఏమిటి?. స్టీరింగ్ వైఫల్యం చెందిందా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో కోస్ట్ గార్డ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి : రీల్స్ పిచ్చి.. పులి దాడిలో 19 ఏళ్ల యువకుడు మృతి..


