మన దేశంలో ఎటు చూసినా సిమెంట్ లేదా ఇనుప కరెంట్ స్తంభాలు కనిపిస్తాయి. మరి ప్రపంచంలోనే ఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడుతామని చెప్పుకొనే అమెరికాలో మాత్రం ఇప్పటికీ చెక్కతో చేసిన స్తంభాలనే కరెంటు సరఫరాకు వాడుతారని మీకు తెలుసా..? అవును..! ఇది నిజం.. అమెరికా, కెనడా దేశాల్లో దాదాపు 13 కోట్లకు పైగా చెక్క కరెంట్ స్తంభాలు వాడుకలో ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీ ఇంతలా పెరిగినా.. వాళ్లు ఇంకా చెక్కనే ఎందుకు వాడుతున్నారు..? ఎండకు ఎండి, వానకు తడిసి, మంచులో కూరుకుపోయినా ఈ చెక్క స్తంభాలు చెదలు పట్టకుండా, కుళ్లిపోకుండా సుమారు 60 ఏళ్ల పాటు ఎలా మన్నికగా ఉంటాయి..?
అమెరికాలో చెక్క స్తంభాల కథ 1844లో మొదలైంది. టెలిగ్రాఫ్‌ను కనిపెట్టిన శామ్యూల్ మోర్స్, అమెరికాలోని బాల్టిమోర్ నుంచి వాషింగ్టన్ డీసీ వరకు 40 మైళ్ల దూరం టెలిగ్రాఫ్ లైన్ వేయాలనుకున్నారు. తొలుత వైర్లను భూమి లోపల పాతిపెట్టారు. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. దీంతో వైర్లను గాలిలో వేలాడదీయడానికి చెక్క స్తంభాలను ఉపయోగించారు. ఆ ప్రయోగం సూపర్ హిట్ అవ్వడంతో, ఆ తర్వాత విద్యుత్ సరఫరాకు కూడా ఇదే పద్ధతిని వాడటం మొదలుపెట్టారు. 1908 నాటికి వీటి నాణ్యత కోసం ప్రత్యేక చట్టాలు, ప్రమాణాలు కూడా వచ్చాయి.
అడవిలో కనిపించిన ప్రతి చెట్టును కరెంట్ స్తంభంగా మార్చడానికి వీలుండదు. దీనికోసం ప్రధానంగా సదరన్ ఎల్లో పైన్, డగ్లస్ ఫిర్, వెస్ట్రన్ రెడ్ సీడార్ అనే ప్రత్యేక జాతి చెట్లను ఎంచుకుంటారు. చెట్టు నిటారుగా ఉండాలి. ఎక్కడా వంకర్లు ఉండకూడదు. ముడులు ఎక్కువగా ఉండకూడదు. ఇలాంటి లక్షణాలు అడవిలోని చెట్లలో కేవలం 5 నుంచి 7 శాతం చెట్లకు మాత్రమే ఉంటాయి. ఎంపిక చేసిన చెట్లను ఫ్యాక్టరీకి తీసుకెళ్లి, బెరడు తీసి, పగుళ్లు ఉన్నాయో లేదో చెక్ చేసి గ్రేడింగ్ ఇస్తారు.
ఇక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. సాధారణ చెక్క అయితే రెండేళ్లలో చెదలు పట్టి పాడైపోతుంది. కానీ ఈ స్తంభాలు 60 ఏళ్లు మన్నడానికి కారణం వాటికి చేసే రసాయన శుద్ధి. మొదట కలపలోని తేమను పూర్తిగా తీసేయడానికి గాలిలో ఆరబెడతారు. లేదా 'బౌల్టనైజేషన్' (Boultonizing) అనే పద్ధతిలో శూన్య స్థితిలో వేడి నూనెతో ఉడికిస్తారు.
దీనివల్ల కలప పగలకుండా త్వరగా ఆరుతుంది. ఆ తర్వాత 130 అడుగుల పొడవు ఉండే భారీ స్టీల్ సిలిండర్లలోకి ఈ స్తంభాలను పంపుతారు. ఈ సిలిండర్లను 'రెటార్ట్‌లు' (Retorts) అంటారు. రెటార్ట్‌లలో CCA, DCOI, కాపర్ నాఫ్తినేట్, క్రియోసోట్ వంటి శక్తిమంతమైన రక్షణ రసాయనాలను నింపి, విపరీతమైన ఒత్తిడిని ప్రయోగిస్తారు. ఈ పీడనం వల్ల రసాయనాలు కేవలం పైపొరపైనే కాకుండా, చెక్క లోపలి కణజాలం వరకు చొచ్చుకుపోతాయి. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత స్తంభాల నుంచి చిన్న నమూనాలను తీసి, రసాయనం లోపలికి వెళ్లిందా? లేదా? అనే విషయాన్ని ల్యాబ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు.
ఇంత కష్టపడి చెక్క స్తంభాలు తయారు చేసే బదులు సిమెంట్ లేదా స్టీల్ స్తంభాలు వాడొచ్చు కదా?? అనే సందేహం మీకు రావచ్చు. అమెరికా చెక్కనే ఎంచుకోవడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటంటే..:
మొదటిది విద్యుత్ నిరోధకత (Insulation): చెక్క సహజంగానే కరెంట్‌ను ప్రవహింపజేయదు. ఇది మరమ్మతులు చేసే లైన్‌మెన్‌లకు ప్రాణరక్షణనిస్తుంది.
రెండోది చెక్క స్తంభాలపైకి సులభంగా ఎక్కొచ్చు. లైన్‌మన్‌లు తమ బూట్లకు ఉండే ఇనుప కొక్కేలతో (Climbing Spikes) నిచ్చెన లేకుండానే చెక్క స్తంభాన్ని చకచకా ఎక్కగలరు.
మూడో కారణం ఖర్చు తక్కువ, రవాణా సులభతరం కావడమే. ఉత్తర అమెరికాలో విస్తారమైన అడవులు ఉండటం వల్ల స్టీల్, కాంక్రీట్ కంటే చెక్క స్తంభాల తయారీ, రవాణా చాలా చౌక.
అన్నింటికంటే ముఖ్యమైన నాలుగో కారణం.. పర్యావరణ సమతుల్యత. అమెరికాలో 'సస్టైనబుల్ ఫారెస్ట్రీ' పద్ధతిలో ఒక చెట్టు నరికితే, దాని స్థానంలో కొత్త మొక్కలు నాటుతారు.
తెలిసింది కదా..? చూడ్డానికి సాధారణ చెక్క మొద్దుల్లా కనిపించే ఈ స్తంభాల వెనుక ఇంత పెద్ద సైన్స్, ఇంజనీరింగ్ దాగి ఉన్నాయి. 180 ఏళ్ల క్రితం మొదలైన ఈ టెక్నాలజీ, ఆధునిక రసాయన శాస్త్రం తోడవడంతో నేటికీ అమెరికాకు వెలుగులు పంచుతోంది.


