శాంతి చర్చల్లో యూరప్‌కు చోటు.. జెలెన్‌స్కీ హర్షం! | Russia Ukraine Peace Talks Europe Role | Sakshi
Sakshi News home page

శాంతి చర్చల్లో యూరప్‌కు చోటు.. జెలెన్‌స్కీ హర్షం!

Nov 13 2026 1:11 PM | Updated on Nov 13 2026 1:23 PM

Russia Ukraine Peace Talks Europe Role

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే దిశగా జరుగుతున్న చర్చల్లో యూరప్‌ దేశాలకూ భాగస్వామ్యం కల్పించేందుకు అమెరికా ముందుకొచ్చింది. తదుపరి విడత చర్చల్లో యూరప్‌ ప్రతినిధులకు చోటు కల్పిస్తామని అమెరికా రాయబారులు జారెడ్‌ కుష్నర్‌, స్టీవ్‌ విట్‌కాఫ్‌ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోడిమిర్‌ జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు.

గురువారం ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జెలెన్‌స్కీతో అమెరికా ప్రతినిధులు సమావేశమయ్యారు. అంతకుముందు మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. అయితే, యుద్ధం, భూభాగాల విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని పుతిన్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. గతవారం అబుదాబిలో జరిగిన చర్చలు కూడా ఎలాంటి పురోగతి సాధించలేదు.

శాంతి చర్చల్లో యూరప్‌కు ప్రాతినిధ్యం ఉండాలని జెలెన్‌స్కీ చాలాకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో యూరప్‌ భాగస్వామ్యానికి అమెరికా హామీ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చల్లో యూరప్‌ అవసరాన్ని పుతిన్‌కు వివరించామని, ఆయన కూడా ఇందుకు అంగీకరించినట్లు కుష్నర్‌ తెలిపారు.

మరోవైపు, రష్యా, ఉక్రెయిన్‌ ఖైదీల మార్పిడికి అంగీకరించాయి. 2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే అతిపెద్ద మార్పిడి కానుంది. దీని ద్వారా వేలాది మంది తమ కుటుంబాల చెంతకు చేరుకుంటారని కుష్నర్‌ చెప్పారు. అయితే, విడుదలయ్యే వారి సంఖ్య, తేదీపై స్పష్టత ఇవ్వలేదు.

ఇదిలా ఉండగా, యుద్ధానంతర పరిణామాల్లో యూరప్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆ దేశాల నేతలు భావిస్తున్నారు. యూరప్‌ కూడా ముఖ్యమైన శక్తి అని రష్యా గుర్తిస్తోందని ఈయూ విదేశాంగ విధాన విభాగం అధిపతి కాజా కల్లాస్‌ పేర్కొన్నారు. అయితే, రష్యా నిజంగా శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉందా? అన్న సందేహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఐదో వంతు భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు, తమ సైన్యానికి అందుతున్న స్టార్‌లింక్‌ సేవలపై ఆంక్షలు కఠినతరం కావడంతో రష్యా డ్రోన్లను అడ్డుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని జెలెన్‌స్కీ తెలిపారు.

ఇదీ చదవండి: ఓటమి నేర్పిన గుణపాఠం.. ట్రంప్ సంచలన ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement