ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
నలుగురూ చూస్తున్నారనే భయం లేకుండా కొందరు ప్రేమను చాటుకుంటారు. కనీసం స్పెయిన్‌లో అయితే అసలే అవసరం లేదు! రద్దీగా ఉండే రోడ్లపై, పార్కుల్లో, బస్టాండ్లలో ప్రేమికులు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం అక్కడ సర్వసాధారణం. పరిచయమైనప్పుడు బుగ్గలపై ముద్దులతో పలకరించడం నుంచి ప్రేమికుల ఆప్యాయతల వరకు అన్నీ సహజంగానే కనిపిస్తాయి. అయితే, ఈ స్వేచ్ఛ వెనుక ఒకప్పుడు అణచివేత, ఆంక్షలు, వాటికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల చరిత్ర కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం!
స్పెయిన్ ప్రజలు ఇళ్లలో కంటే బయటే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వీధులు, పార్కులు, కేఫ్‌లు, రెస్టారెంట్లు వారి రోజువారీ జీవితంలో కీలకంగా ఉంటాయి. వార్విక్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూరం తక్కువగా పాటించే దేశాల్లో స్పెయిన్ ఒకటి.
ఉత్తర ఐరోపా దేశాలతో పోలిస్తే అక్కడి ప్రజలు శారీరక సాన్నిహిత్యాన్ని ఎక్కువగా వ్యక్తం చేస్తారని మాడ్రిడ్ కాంప్లుటెన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంపారో లాసెన్ చెబుతున్నారు. అందుకే బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాన్ని అక్కడ ప్రత్యేకంగా చూడరు.
ఇళ్లలో ఏకాంతం కరువు.. బయటే ప్రేమకు చోటు!
స్పెయిన్ జనాభాలో సుమారు 65 శాతం మంది అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నారు. ఐరోపా సమాఖ్య దేశాల్లో ఇదే అత్యధికం. పెరిగిన ఇళ్ల ధరల కారణంగా యువత తల్లిదండ్రుల నుంచి విడిపోయి సొంతంగా జీవించడం కష్టంగా మారింది. దీంతో స్నేహితులను కలవాలన్నా, ప్రేమికులతో సమయం గడపాలన్నా బార్లు, రెస్టారెంట్లు, పార్కులనే ఆశ్రయిస్తున్నారు. ఇళ్లలో వ్యక్తిగత ఏకాంతం తక్కువగా ఉండటం కూడా బహిరంగ ప్రదేశాల్లో ప్రేమను వ్యక్తం చేయడానికి ఓ కారణమని ప్రొఫెసర్ లాసెన్ అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు ముద్దులు పెట్టుకున్నా నేరమే!
ప్రస్తుతం స్పెయిన్‌లో కనిపిస్తున్న స్వేచ్ఛకు ఒకప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. ఫ్రాన్సిస్కో ఫ్రాంకో నియంతృత్వ పాలన (1939–1975) సమయంలో సంప్రదాయ కాథలిక్ మత విలువల పేరుతో ప్రజల వ్యక్తిగత జీవితంపైనా ఆంక్షలు విధించేవారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడంతోపాటు బహిరంగంగా ప్రేమను వ్యక్తం చేయడాన్నీ నియంత్రించేవారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకున్న జంటలకు జరిమానాలు విధించే పరిస్థితి ఉండేది.
ముద్దులతోనే నిరసన.. మారిన చరిత్ర!
1975లో ఫ్రాంకో మరణం తర్వాత స్పెయిన్‌లో స్వేచ్ఛ, భావప్రకటనకు ప్రాధాన్యం పెరిగింది. మాడ్రిడ్‌లో ‘లా మోవిడా మాడ్రిలెనా’ పేరుతో సాంస్కృతిక ఉద్యమం మొదలైంది.
1986లో ఇద్దరు మహిళలు బహిరంగంగా ముద్దు పెట్టుకున్నందుకు అరెస్టు చేయబడి.. రెండు రోజులు పోలీసుల అదుపులో ఉన్నారు. దీంతో 1987 ఫిబ్రవరి 23న హక్కుల సంఘాలు మాడ్రిడ్‌లో సామూహిక ముద్దుల నిరసన నిర్వహించాయి. ఆ తర్వాత ప్రైడ్ మార్చ్‌ల ముగింపులోనూ ఈ కార్యక్రమం కొనసాగింది. చివరకు 1988లో బహిరంగంగా అసభ్యంగా ప్రవర్తించారనే నేరానికి సంబంధించిన చట్టాన్ని రద్దు చేశారు.
అందరికీ ఒకే స్థాయిలో స్వేచ్ఛ ఉందా?
ప్రస్తుతం స్పెయిన్‌లో బహిరంగంగా ప్రేమను వ్యక్తం చేయడం సాధారణమైనప్పటికీ అందరికీ ఒకే స్థాయిలో స్వేచ్ఛ ఉందని చెప్పలేమని ప్రొఫెసర్ లాసెన్ అంటున్నారు. వృద్ధ జంటలు లేదా స్వలింగ జంటలు బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నప్పుడు కొందరి నుంచి విమర్శలు, అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు. అయినప్పటికీ స్పెయిన్ సమాజం గతంతో పోలిస్తే ఎంతో మారిందని, ముద్దులు ఆ స్వేచ్ఛకు కనిపించే చిన్న ఉదాహరణ మాత్రమేనని వాలెన్సియాకు చెందిన మాజీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ పౌలా ఫురియో అభిప్రాయపడ్డారు.
అయితే, జపాన్ నుంచి స్పెయిన్‌కు తిరిగొచ్చిన ఓ మహిళకు రైల్వే స్టేషన్ బయట బెంచీపై ముద్దులు పెట్టుకుంటున్న జంట కనిపించింది. ఆ దృశ్యం చూసి ‘ఇంటికి తిరిగొచ్చాను’ అని ఆమె ఆనందపడిందట. ఒకప్పుడు ముద్దు పెట్టుకున్నందుకు అరెస్టులు ఎదుర్కొన్న దేశంలోనే నేడు అది సాధారణ జీవనశైలిగా మారింది. దీంతో స్పెయిన్‌లో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం కేవలం ప్రేమను చాటుకోవడమే కాదు.. తమ భావాలను ఎలాంటి భయం లేకుండా వ్యక్తం చేసే స్వేచ్ఛకు ప్రతీకగా నిలుస్తోందని స్పెయిన్ నెటీజన్లు అంటున్నారు.
ఇదీ చదవండి: ఎంతిచ్చామన్నది కాదు.. ఇచ్చామా లేదా.. అదీ ముఖ్యం!


