నమీబియాలో బ్లూబెర్రీ సాగు.. అంగోలాలో కోళ్ల పరిశ్రమ.. ఇలా ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ రంగం కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అంగోలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెట్టుబడి నిధి (FSDEA) వివిధ దేశాల్లో వ్యవసాయ రంగానికి ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పెట్టుబడులతో కొత్త వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలు అభివృద్ధి చెందడమే కాకుండా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
నమీబియాలోని కవాంగో నది తీర ప్రాంతంలో 2019లో లియోపోల్డిన్ మహోంగో తొలిసారిగా వాణిజ్యపరంగా బ్లూబెర్రీ సాగును ప్రారంభించారు. అప్పటివరకు ఆ దేశంలో ఈ పంటను వాణిజ్య స్థాయిలో ఎవరూ పండించలేదు. అయితే, అంగోలా పెట్టుబడి నిధి సహకారంతో ప్రారంభమైన మషారే బెర్రీస్ వ్యవసాయ క్షేత్రం క్రమంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం సుమారు 60 హెక్టార్ల విస్తీర్ణంలో బ్లూబెర్రీ సాగు జరుగుతోంది.
ఈ వ్యవసాయ క్షేత్రంలో పంట కోత సమయంలో వందలాది మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే కావడం విశేషం. తొలుత ఈ క్షేత్రంలో కూలీగా పనిచేసిన మహోంగో ఇప్పుడు ఉత్పత్తి మేనేజర్‌గా ఎదిగారు. వ్యవసాయ రంగంలో మహిళల నాయకత్వం అరుదుగా కనిపించే ఈ ప్రాంతంలో ఆమె ఎదుగుదల ఇతర మహిళలకు స్ఫూర్తినిస్తోంది. కష్టపడి పనిచేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆమె చెబుతున్నారు.
మరోవైపు, అంగోలాలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయి. దేశంలో సుమారు 3.5 కోట్ల హెక్టార్ల భూమి సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ, అందులో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే సాగులో ఉంది. దీంతో దేశానికి అవసరమైన ఆహారంలో దాదాపు సగం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చడంతోపాటు చమురు రంగంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వ్యవసాయం, మత్స్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అంగోలాలోని వాకు కుంగో ప్రాంతంలో ఉన్న ఎమిరాయిస్ సంస్థ కోళ్ల పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. మొక్కజొన్న సాగు, కోళ్ల దాణా తయారీ, కోడి పిల్లల పొదగడం, కోళ్ల పెంపకం, మాంసం ప్రాసెసింగ్, పంపిణీ వరకు అన్ని కార్యకలాపాలను ఈ సంస్థే నిర్వహిస్తోంది. అంగోలా పెట్టుబడి నిధి ఆర్థిక సహకారంతో సంస్థ తన కార్యకలాపాలను విస్తరించింది. ప్రస్తుతం ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి కల్పిస్తోంది. సంస్థ ప్రణాళికలు, కొత్త వ్యాపారాల డైరెక్టర్ ఎఫ్రాయిమ్ హిల్ఫ్ మాట్లాడుతూ.. అంగోలాలోని ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లకు సరఫరా చేసేందుకు ఈ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు తెలిపారు.
అంగోలా పెట్టుబడి నిధి 2025 వార్షిక నివేదిక ప్రకారం.. మొత్తం ఆస్తుల విలువ 470 కోట్ల డాలర్లకు చేరగా, ప్రత్యామ్నాయ పెట్టుబడుల ద్వారా 42 శాతం రాబడి సాధించింది. వ్యవసాయం, మైనింగ్, ఆరోగ్య రంగాలు ఈ వృద్ధికి కీలక పాత్ర పోషించాయి. భవిష్యత్తులోనూ వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెంచి ఆహార ఉత్పత్తిని విస్తరించడంతోపాటు స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని నిధి ఛైర్మన్ అర్మాండో మాన్యుయెల్ తెలిపారు.
ఇదీ చదవండి: షేక్ హసీనాకు భారీ షాక్.. భారత్ కీలక నిర్ణయం?


