పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ఈ విషయాలు తెలుసుకోండి! | Child Height Growth Parenting Tips | Sakshi
Sakshi News home page

పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ఈ విషయాలు తెలుసుకోండి!

Nov 8 2026 11:54 AM | Updated on Nov 8 2026 11:57 AM

Child Height Growth Parenting Tips

ఫండే

హెల్త్‌

సందేహం

‘మా పిల్లాడు క్లాస్‌లో అందరికంటే పొట్టిగా ఉన్నాడు’. ‘ఎత్తు పెరగడానికి ఏదైనా టానిక్‌ ఇవ్వాలా?’... ఇలాంటి సందేహాలు చాలామంది తల్లిదండ్రులకు ఉంటాయి. అయితే, ఇతర పిల్లలతో పోల్చడం కంటే వయసుకు తగ్గట్టుగా తమ బిడ్డ ఎదుగుతున్నాడా లేదా అన్నది గమనించడం ముఖ్యం. పిల్లల ఎత్తును ఎలా పర్యవేక్షించాలి? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? ఇక్కడ తెలుసుకుందాం...

పిల్లల ఎదుగుదల అందరిలోనూ ఒకేలా ఉండదు. పిల్లల ఎత్తు– తల్లిదండ్రుల ఎత్తు, పోషకాహారం, హార్మోన్లు, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కారణాన్ని ముందుగానే గుర్తిస్తే అవసరమైన చికిత్స అందించవచ్చు. భారతీయ పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించేందుకు ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ (ఐఏపీ) సంస్థ తల్లిదండ్రులకు సూచించిన మార్గదర్శకాలు.

ఎలా తెలుసుకోవాలి?
పిల్లల వయసు, లింగానికి అనుగుణంగా గ్రోత్‌ చార్ట్‌లో ఎత్తును నమోదు చేసి చూడాలి. ఇతర పిల్లల కంటే పొట్టిగా ఉండటం ఒక్కటే సమస్యకు నిదర్శనం కాదు. కాలక్రమంలో ఎత్తు పెరగకపోవడం లేదా ఎదుగుదల రేఖలు కిందికి మారడం గమనించాల్సిన అంశాలు.

కారణాలేమిటి?
తల్లిదండ్రుల ఎత్తు, పోషకాహార లోపం, థైరాయిడ్‌ సమస్యలు, గ్రోత్‌ హార్మోన్‌  లోపం, దీర్ఘకాలిక వ్యాధులు వంటి కారణాలు ఉండవచ్చు. కారణాన్ని గుర్తించేందుకు వైద్యుడు అవసరమైన పరీక్షలను సూచిస్తారు.

తరచు కొలవాలా?
పిల్లల వయసు, ఎదుగుదలను బట్టి సాధారణంగా ఆరు నెలలకొకసారి ఎత్తు, బరువును పరిశీలించడం ఉపయోగకరం. కొలతలను తేదీతో సహా నమోదు చేసి, గ్రోత్‌ చార్ట్‌లో ఎదుగుదలను గమనించాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
ఎత్తు పెరుగుదల మందగించినా, బరువు సరిగా పెరగకపోయినా, ఎదుగుదల రేఖలు కిందికి మారినా వైద్యుడిని సంప్రదించాలి. యుక్తవయస్సు చాలా ముందుగా లేదా ఆలస్యంగా ప్రారంభమైనా పరీక్ష అవసరం కావచ్చు.

ప్రత్యేక ఆహారం, మందులు ఉన్నాయా?
ఎత్తు పెంచే అద్భుతమైన ఆహారం లేదా టానిక్‌ ఏమీ ఉండవు. పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, కూరగాయలు, పండ్లు వంటి పోషకాహారాన్ని అందించాలి. పోషకాల లోపం ఉంటే వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు వాడవచ్చు. అవసరం లేకుండా విటమిన్లు లేదా టానిక్‌లు ఇవ్వడం వల్ల అదనపు ఎత్తు పెరగదు.

వ్యాయామాలు ఎత్తు పెంచుతాయా?
ఆటలు, ఈత, సైక్లింగ్‌ వంటి శారీరక కార్యకలాపాలు ఎముకలు, కండరాల బలానికి ఉపయోగపడతాయి. అయితే వేలాడటం లేదా ప్రత్యేక వ్యాయామాలు చేయడం వల్ల తుది ఎత్తు పెరుగుతుందని నిరూపితమైన ఆధారాలు లేవు.

హార్మోన్‌  ఇంజెక్షన్లు ఇవ్వవచ్చా?
ప్రతి పొట్టి పిల్లవాడికీ గ్రోత్‌ హార్మోన్‌  అవసరం ఉండదు. నిర్దిష్ట వైద్య సమస్య ఉన్నప్పుడు మాత్రమే నిపుణులు సూచిస్తారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా హార్మోన్‌  మందులు అసలు వాడకూడదు.

నెలసరి మొదలైతే ఎత్తు పెరగదా?
బాలికల్లో నెలసరి ప్రారంభమైన తర్వాత ఎత్తు పెరుగుదల వేగం సాధారణంగా తగ్గుతుంది. అయినప్పటికీ కొంత పెరుగుదల కొనసాగవచ్చు. ఎత్తు పెంచాలనే ఉద్దేశంతో నెలసరిని ఆలస్యం చేసే మందులు సొంతంగా వాడకూడదు. ప్రతి చిన్నారి ఎదుగుదల ప్రత్యేకం. పిల్లలు ఎంత ఎత్తు ఉన్నారనే దానికంటే, వయసుకు తగ్గట్టుగా ఆరోగ్యంగా ఎదుగుతున్నారా లేదా అన్నదే ముఖ్యం.

- డా. కె. పవన్‌ కుమార్‌, సీనియర్‌ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్‌ అలర్జిస్ట్, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement