ఐదేళ్ల చిన్నారికి.. 12 ఏళ్ల కుమార్తె! ఈ కథ తెలిస్తే షాకే! | Funday Mystic World Story On Shukla Gupta Reincarnation Case | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల చిన్నారికి.. 12 ఏళ్ల కుమార్తె! ఈ కథ తెలిస్తే షాకే!

Nov 8 2026 9:55 AM | Updated on Nov 8 2026 10:01 AM

Funday Mystic World Story On Shukla Gupta Reincarnation Case

ఫండే

మిస్టిక్‌ వరల్డ్‌

అది 1954– పశ్చిమ బెంగాల్‌లోని కాంపా గ్రామం– రైల్వే ఉద్యోగి కె.ఎన్‌.సేన్‌గుప్తా రెండేళ్ల కుమార్తె శుక్లా గుప్తా ఓ దిండును చేతుల్లోకి తీసుకుని లాలిస్తోంది. దానిని ‘మీనూ... మీనూ...’ అంటూ పిలుస్తోంది. మొదట్లో ఆ చిన్నారి అలా ఎందుకు చేస్తోందో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. కానీ, మాటలు స్పష్టంగా వచ్చాక ఆమె చెప్పిన విషయాలు వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మీనూ తన కుమార్తె అని, తనకు భర్త ఉన్నాడని, అతడి కుటుంబం మరో ఊరిలో ఉంటోందని చెప్పడంతో వారి నోట మాట రాలేదు.

కాలం గడిచేకొద్దీ శుక్లా మాటల్లో మరిన్ని వివరాలు బయటపడ్డాయి. తన భర్త పేరు చెప్పకపోయినా, అతడి తమ్ముళ్లు ఖేతు, కరుణ అని పేర్కొనేది. వారంతా భట్‌పారా సమీపంలోని రథ్‌తలా ప్రాంతంలో నివసిస్తున్నారని చెప్పేది. తనను అక్కడికి తీసుకెళ్లాలని పట్టుబట్టేది. చిన్నారి చెబుతున్న ఊరు, వ్యక్తుల గురించి ఆమె కుటుంబానికి పెద్దగా తెలియదు. అయినా, ఆమె మాటల వెనుక ఏదైనా వాస్తవం ఉందేమో తెలుసుకోవాలని తండ్రి నిర్ణయించుకున్నారు.

శుక్లా తండ్రి తన రైల్వే సహోద్యోగి ఎస్‌.సి. పాల్‌ ద్వారా భట్‌పారా ప్రాంతం గురించి ఆరా తీశారు. అక్కడ రథ్‌తలా అనే ప్రాంతం ఉందని, ఖేతు అనే వ్యక్తి కూడా నివసిస్తున్నాడని తెలిసింది. మరింత విచారించగా, ఖేతుకు బంధువైన మానా అనే మహిళ 1948 జనవరిలో మరణించినట్లు, ఆమెకు మీనూ అనే చిన్న కుమార్తె ఉన్నట్లు సమాచారం లభించింది.

ఇక్కడే ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. శుక్లా చెబుతున్న మీనూ అనే పేరు, మరణించిన మానా కుమార్తె పేరుతో సరిపోలింది. మానా మరణించిన ఆరేళ్ల తర్వాత, 1954లో శుక్లా జన్మించింది. ఈ వివరాలు తెలుసుకున్న ఆమె తండ్రి, ఆ కుటుంబాన్ని కలవాలని నిర్ణయించుకున్నారు.

1959లో సుమారు ఐదేళ్ల వయసున్న శుక్లాను తీసుకుని ఆమె తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి భట్పారాకు వెళ్లారు. అక్కడికి చేరుకున్నాక శుక్లా ముందుండి ఒక ఇంటికి తీసుకెళ్లింది. అది తన గత జీవితంలో మామగారి ఇల్లు అని చెప్పింది.
అయితే, ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఆమె కొంత తడబడింది. మానా మరణించిన తర్వాత ఇంటి ప్రవేశ మార్గాన్ని మార్చినట్లు తర్వాత తెలిసింది. ఇంట్లో సుమారు 20 నుంచి 30 మంది ఉన్న సమయంలో శుక్లా కొందరిని గుర్తించింది.

అక్కడే మరో భావోద్వేగభరిత ఘటన చోటుచేసుకుంది. మానా కుమార్తె మీనూకు అప్పటికి సుమారు 12 ఏళ్లు. శుక్లా వయసు ఐదేళ్లే. అయినప్పటికీ, మీనూను చూడగానే ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనై, తన కూతురేనన్నట్లుగా ఆప్యాయత చూపించింది. దిండును చేతుల్లోకి తీసుకుని మీనూగా భావిస్తూ ఆడుకున్న చిన్నారి, ఇప్పుడు తన కుమార్తెగా చెప్పిన బాలికను నిజంగానే కలుసుకున్నట్లు ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఇయాన్‌ స్టీవెన్‌సన్‌ పునర్జన్మలకు సంబంధించిన కేసులను అధ్యయనం చేస్తుంటారు. శుక్లా గుప్తా ఉదంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. 1961లో ఆమెను కలిసి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు, చిన్నారి ముందుగా చెప్పిన విషయాలు, మరో కుటుంబంతో జరిగిన పరిచయం వంటి అంశాలను నమోదు చేశారు. ఈ కేసును పునర్జన్మలపై తాను రాస్తున్న పుస్తకంలో చేర్చారు.

పరిశోధనలో ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశం ఏమిటంటే, రెండు కుటుంబాలు కలుసుకునే ముందే శుక్లా కొన్ని పేర్లు, ప్రాంతం గురించి చెప్పిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ వివరాల్లో కొన్నింటిని భట్‌పారా ప్రాంతంలో స్వతంత్రంగా ఆరా తీసినప్పుడు సరిపోలినట్లు ఆయన పేర్కొన్నారు.

శుక్లా చిన్నతనంలో గత జీవితానికి సంబంధించినట్లు చెప్పిన విషయాలు జీవితాంతం అలాగే కొనసాగలేదు. స్టీవెన్‌సన్‌ 1961లో ఆమెను పరిశీలించిన తర్వాత, 1969 నవంబరులో మరోసారి కలిశారు. అప్పటికి ఆమెకు సుమారు 15 ఏళ్లు. ఆ సమయంలో గత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాల ప్రస్తావన తగ్గిపోయినట్లు ఆయన నమోదు చేశారు.

చిన్నతనంలో తరచు చెప్పిన విషయాలు వయసు పెరిగేకొద్దీ ఎందుకు తగ్గిపోయాయి? అవి నిజంగా గత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలేనా? లేక పిల్లల ఊహాశక్తి, పరిసరాల ప్రభావం, ఇతరుల నుంచి తెలియకుండానే అందిన సమాచారం వంటి అంశాలు వాటికి కారణమయ్యాయా? ఈ ఒక్క ఉదంతంతో ఈ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం చెప్పలేం.

శుక్లా గుప్తా కథలో ఆసక్తిని కలిగించేది కేవలం ఆమె పునర్జన్మను నమ్మిందనే అంశం కాదు. రెండేళ్ల వయసులో దిండును ‘మీనూ’గా భావించడం, ఒక కుటుంబం గురించి వివరాలు చెప్పడం, ఐదేళ్ల వయసులో ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు చూపిన భావోద్వేగాలు– ఇవన్నీ ఈ కేసును ప్రత్యేకంగా నిలబెట్టాయి.

మన జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి? మనకు తెలియని విషయాలను చిన్నపిల్లలు కొన్ని సందర్భాల్లో ఇంత నిర్దిష్టంగా ఎలా చెబుతారు? మరణం తర్వాత చైతన్యం కొనసాగుతుందా? ఇవి ఇప్పటికీ చర్చకు, పరిశోధనకు తావిచ్చే ప్రశ్నలు. శుక్లా గుప్తా ఉదంతం పునర్జన్మను నిరూపించదు. కానీ జ్ఞాపకాలు, బాల్య మనస్తత్వం, మానవ చైతన్యం గురించి మరోసారి ఆలోచింపజేస్తుంది.

- సత్యకిశోర్‌ కొండ్రెడ్డి

ఇదీ చదవండి: ఈవారం కథ: బైరాగి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement