సగరులకు న్యాయం చెయ్యండి! | Sagara Uppara Community Struggles And Demands | Sakshi
Sakshi News home page

సగరులకు న్యాయం చెయ్యండి!

Nov 3 2026 8:03 AM | Updated on Nov 3 2026 8:03 AM

Sagara Uppara Community Struggles And Demands

ఇన్‌ బాక్స్‌

రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న సంచార జాతులలో ఉప్పరి కులం ఒకటి. వీరిని ‘సగర’ అనీ అంటారు. ఇతిహాసాల ప్రకారం వీరిని శ్రీరాముని వంశం, భగీరథ వారసులుగా చెబు తున్నా... చరిత్ర ప్రకారం మొదటి తరం శాస్త్ర వేత్తలుగా గుర్తింపు పొందారు. మొదట ఉప్పును కనుగొన్నందున ‘ఉప్పరోళ్ళు’ అనే పేరు వచ్చిందంటారు. భూమి గట్టిదనాన్ని గుర్తించి ఇళ్ల నిర్మాణం  చేయడంతో పాటు నీటి ఊటలను గుర్తించి చెరువులు, కుంటలు తవ్వుతారు.

దేశ వ్యాప్తంగా సగరులు వివిధ పేర్లతో మనుగడ సాగి స్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సగర, ఉప్పర, మేయర్, బేల్ధార్‌; కర్ణాటకలో ఉప్పర, సగర, ఉప్పలింగ, ఉప్పలీగశెట్టి అనీ; తమిళనాడులో ఉప్పలియన్, ఉప్పలియనాయర్‌ అనీ; కేరళలో అలవన్, కుస; మహారాష్ట్రలో లోనారి, గవంది, అగ్రి, కామథీ, గవాంధీ వంటి రకరకాల పేర్లతో వీరు ఉన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో సగరులను బీసీ ‘డీ’ గ్రూపులో (వరుస సంఖ్య–31)  చేర్చారు. అందులోని అభివృద్ధి చెందిన కులాలతో పోటీ పడలేక అనేక ఏండ్లుగా ‘ఏ’ గ్రూపులోకి మార్చాలని డిమాండ్‌ చేసిన ఫలితంగా... 1968లో వచ్చిన అనంత రామన్‌ కమిషన్‌ వీరిని చదువు లేని అనాగరిక సంచార జాతిగా తేల్చి ‘ఏ’లో చేర్చడానికి సిఫారసు చేసింది.

1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు ప్రభుత్వం వేసిన మురళీధర్‌ రావు కమిషన్‌ వీరిని ‘ఏ’ గ్రూపులో చేర్చాలని నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా ప్రభుత్వం 15.7.1986న గ్రూపు ‘ఏ’లో చేర్చుతూ జీవో 166 విడుదల చేసింది. రెండు సంవత్సరాలు ఈ ఫలాలను సగరులు అనుభవించిన తదుపరి హైకోర్టు తీర్పుతో మళ్లీ బీసీ ‘డీ’లో చేర్చారు.

స్వర్గీయ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం సగరుల స్థితిని అధ్యయనం చేసి ఫెడరేషన్‌ ప్రకటిస్తూ నిధులు ఇచ్చి ఆదుకున్నారు. మళ్ళీ ఏ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు. వీరిని సంచార జాతిగా ప్రకటించాలనీ, ఎత్తైన భవన నిర్మాణాలను నిర్మిస్తూ గోవా కర్రల మీద పని చేస్తున్నందున ప్రమాద బీమా అమలు చేయాలనీ, అన్ని కులవృత్తుల వారికి ఇస్తున్నట్లు పెన్షన్‌ ఇవ్వాలనీ, భవన నిర్మాణ రంగంలో 15 శాతం పనులు ప్రభుత్వ కాంట్రాక్టులలో కులవృత్తి పరంగా కేటాయించాలనీ సగరులు కోరుతున్నారు.
– పోతుల పరంధాం కుమార్‌ సగర, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement