స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట దాదాపు 13.5 కోట్లమందిని ఓటర్ల జాబితానుంచి తొలగించటాన్ని నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవినుంచి తొలగించాలని కోరుతూ దేశ రాజధాని నగరంలో శని, ఆదివారాల్లో ఇండియా కూటమి పక్షాలు నిరసనలు నిర్వహించాయి. తొలి రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాస ప్రాంగణంలో జరిగిన మాక్ పార్లమెంటు, మర్నాడు రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ‘ఓట్ బచావ్... దేశ్ బచావ్’ ర్యాలీ విపక్షాల అంచనాలను అందుకున్నాయనే చెప్పాలి.
జ్ఞానేశ్ ఏకపక్షంగా అరాచక విధానాలు అవలంబించకపోతే ఇండియా కూటమిలోని 21 పార్టీలకూ, పౌర సమాజ బృందాలకూ ఇంతమందిని సమీకరించే బలమైన అజెండా ఉండేదే కాదు. ముంచుకొచ్చిన సమస్యే ప్రజల్ని ఏకం చేస్తుంది. పోరాట రూపాలను నిర్ణయిస్తుంది. ఎవరో ఫామ్–7 ద్వారా ఫలానా ఓట్లు తొలగించమంటూ దరఖాస్తు ఇవ్వటం తరవాయిగా నోరూ వాయీ లేని బడుగు బలహీనవర్గాల ఓట్లను తొలగించటం సాధారణ విషయం కాదు. అలాగే అసలు ఫామ్–8 లేకుండానే ఆ పేరిట ఏకంగా 13,000 మందికి పైగా ఓటర్ల వివరాలు తారుమారుచేసిన వైనం ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో బయటపడింది.
ఒక ప్రాంతంలో ఓటర్ల తొలగింపు 2 శాతం మించితే ఎన్నికల నమోదు అధికారి ఆ ప్రాంతానికి వెళ్లి స్వయంగా విచారించాలన్న నియమం ఉండగా, చాలాచోట్ల అదేమీ జరగలేదు. కావలసినంత రగడ జరిగాక తొలగించిన ఓటర్లు ఫామ్–6 ద్వారా మళ్లీ చేరొచ్చనిఈసీ వెసులుబాటిచ్చింది. కానీ కొత్త ఓటర్లకు ఉద్దేశించిన ఆ ఫామ్‌లో తాము అంతక్రితం ఎప్పుడూ ఓటేయలేదని ప్రమాణం చేసి చెప్పాలి. అది తప్పని రుజువైతే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 కింద ఏడాది జైలు శిక్ష పడుతుంది. తన తప్పిదంవల్ల కోల్పోయిన ఓటును పొందటానికి బొంకమని ఓటర్లకు ఈసీ సలహా ఇస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకం. ఇలాంటి అపసవ్య విధానాలతో తలవంపులు తెచ్చిన జ్ఞానేశ్‌ను బీజేపీ పెద్దలు వెనకేసుకు రావటం, ప్రశ్నిస్తున్నవారిని జాతి వ్యతిరేకులుగా ముద్రేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈసీ నిర్వాకం ఇలా ఉన్నప్పుడు ఉద్యమాలు జరగటం, ప్రజలు నిలదీయటం వింతేమీ కాదు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు అన్ని పార్టీల నేతలూ జ్ఞానేశ్ తీరువల్ల ఓట్లు గల్లంతై ఫలితాలు ఎలా తారుమారవుతున్నాయో బాగానే వివరించారు. పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, హరియాణా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందనీ... అందువల్ల బీజేపీకి, దాని కూటమికి లబ్ధి కలిగిందనీ చెప్పారు.మంచిదే. మరి నిన్న మొన్నటిదాకా తమతోనే కలిసి నడిచిన డీఎంకే సైతం తమిళ నాడులో ఇలాగే జరిగిందని చెప్పింది కదా... ఆ సంగతి ఇండియా కూటమి నాయకులు ఎలా మరిచారు?
అసలు జ్ఞానేశ్ రాకకు ముందే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి దొంగ ఓట్ల జాతరతో గెలుపోటముల్ని తారుమారు చేయడం గురించి... నిబంధనలకు విరుద్ధంగా సీసీ టీవీ ఫుటేజ్, వీవీప్యాట్‌లు ధ్వంసం చేయటం గురించి ఇప్పటికే జాతీయ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. పరకాల ప్రభాకర్ వంటి మేధావులు ప్రశ్నించారు. ఏపీలో కూడా కూటమి పాలనే సాగుతుండగా వీటిని ప్రస్తావించటం అవసరమని ఒక్క నేతకు కూడా అనిపించకపోవటం వింత కాదా? ఏపీ ప్రస్తావన తెస్తే తన మిత్రుడు చంద్రబాబు నొచ్చుకుంటారనీ, తమిళనాడు గురించి ఎత్తితే మాజీ మిత్రుడు, డీఎంకే నేత స్టాలిన్‌కు అనుకూలమవుతుందనీ రాహుల్ గాంధీ భావించి ఉండొచ్చు.
జనం అన్నీ గమనిస్తుంటారు. ప్రధానంగా ఓట్ల చోరీ అంశంపైనే కేంద్రీకరిస్తూ కూడా జ్ఞానేశ్‌ను మించి ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టిస్తున్న ఏపీ ఎన్నికల కమిషనర్ పునేఠ గురించి మాట మాత్రమైనా అనకపోవటం విపక్షాల సైద్ధాంతిక దివాలాకోరుతనాన్ని వెల్లడిస్తోంది. ‘మానింది మందు...’ అన్నట్టు ఇదే నమూనాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించరన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? రామ్‌లీలా మైదాన్‌లో ర్యాలీ రోజునే మున్సిపల్ పోలింగ్ ఎంత ఘోరంగా సాగిందో సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోయింది. అయినా ఉలుకూ పలుకూ లేదు. ఇక ‘ఓట్ల చోరీ’ గురించి ప్రస్తావించే కాంగ్రెస్ అవతలి పార్టీలనుంచి ‘ఎమ్మెల్యేల చోరీ’కి పాల్పడటం కూడా కనబడుతూనే ఉంది. ఇలా ద్వంద్వ వైఖరి ప్రదర్శించేవారికి విశ్వసనీయత ఎన్నాళ్లుంటుంది... ఎందుకుంటుంది?


