బెర్లిన్: ఫ్రాన్స్‌లో విద్యార్థి, యువత సాగిస్తున్న ఆందోళన ప్రభావం పొరుగు దేశాలపైనా పడింది. జర్మనీలో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై శనివారం రాత్రి చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. జెన్ జెడ్ సారథ్యంలో జరుగుతున్న నిరసనల వేళ దేశ ఆర్థిక కేంద్రంగా ఉన్న ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ముసుగులు ధరించిన దుండగులు దుకాణాలను యథేచ్ఛగా లూటీ చేశారు. దీంతో, నగరంలోని ప్రధాన షాపింగ్ స్ట్రీట్‌ను పోలీసులు మూసి వేయించారు.
బ్యాట్‌మ్యాన్ వేషం వేసుకున్న నిరసనకారుడు సహా పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తుపాకుల దుకాణం నుంచి ఎత్తుకుపోయిన రెండు తుపాకులను తిరిగి స్వా«దీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్ చేశామన్నారు. కొందరు ఎంతో నైపుణ్యంతో దుకాణాల అద్దాలను పగులగొట్టి, వస్తువులను ఎత్తుకుపోయారని వెల్లడించారు. రాజధాని బెర్లిన్‌తోపాటు, కొలోన్, హాంబర్గ్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అత్యవసర సిబ్బందిపై పెట్రోల్ బాంబులు విసురుతూ, సీసాలు, రాళ్లు విసురుతున్న ఆందోళన కారుల్ని చెదరగొట్టేందుకు వాటర్ కెనన్లను ప్రయోగించారు.
బెర్లిన్‌లో 27 మంది పోలీసులు గాయపడగా, 56 మంది నిరసనకారులను నిర్బంధించారు. హెస్ రాష్ట్రంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిలో కనీసం 100 మందిని వామపక్ష అతివాదులుగా గుర్తించామని అధికారులు చెప్పారు. హాంబర్గ్‌లో నల్ల దుస్తులు ధరించిన నిరసనకారులు బారికేడ్లకు నిప్పుపెట్టారు. పెట్రోల్ బాంబులు విసిరారు. శనివారం ఉదయం కొన్ని చోట్ల శాంతియుతంగానే నిరసన ప్రదర్శనలు ముగిశాయి. కాగా, ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిక్, బెర్లిన్‌లో జరిగిన ఆందోళన ర్యాలీల్లో 18 వేల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విద్యాసంస్థలకు నిధుల కేటాయింపులను పెంచాలని, జీవన వ్యయాన్ని తగ్గించాలని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. లూటీలు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జర్మనీ అంతరంగిక శాఖ మంత్రి అలెగ్జాఆండర్ హెచ్చరించారు. శనివారం రాత్రి నిరసనల సమయంలో హింసను అదుపు చేయడంలో బలగాలు విజయవంతమయ్యాయని అభినందించారు. కాగా, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వ తోడ్పాటు పెరగాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని జెన్ జెడ్ ప్రతినిధి లినా చెప్పారు. తమ పోరాటం శాంతి కోసమే తప్ప, హింస, ఘర్షణల కోసం కాదన్నారు. సంపద అందరికీ సమానంగా పంపిణీ కావాలని, నిర్బంధ సైనిక శిక్షణను రద్దు చేయాలని ఆమె కోరారు.


